Begin typing your search above and press return to search.

గోపీచంద్ కు పంచ్ పండింది

By:  Tupaki Desk   |   15 Aug 2015 10:02 AM GMT
గోపీచంద్ కు పంచ్ పండింది
X
ఎవరెన్ని విమర్శలు చేసినా ఇండియా గత కొన్నేళ్ల లో బ్యాడ్మింటన్ కు ఇంత ఆదరణ పెరిగిందంటే.. మన దేశం నుంచి ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులు తయారై.. ప్రపంచ బ్యాడ్మింటన్ లో మెరుపులు మెరిపిస్తున్నారంటే అందుకు ముఖ్య కారణం పుల్లెల గోపీచందే. ఆటగాడిగా మరీ గొప్ప స్థాయిని అందుకోలేకపోయినా.. కోచ్ గా మాత్రం ఇండియాలో ఎవరూ అందుకోనంత ఎత్తుకు ఎదిగిపోయాడు గోపీ. ఆయన స్థాపించిన బ్యాడ్మింటన్ అకాడమీ దేశానికి అద్భుతమైన షట్లర్లను అందించింది, అందిస్తూనే ఉంది. ఐతే భారత బ్యాడ్మింటన్ మొత్తం తన గుప్పెట్లో ఉండాలన్న ఆలోచనతో గోపీ కొన్ని ఒంటెత్తు పోకడలు పోతాడన్నది వాస్తవం. మంచి క్రీడాకారులు ఎక్కడున్నా వారికి లిఫ్ట్ ఇచ్చి.. తనకూ పేరు వచ్చేలా చేసుకుంటాడు. దేశంలో బ్యాడ్మింటన్ ఆడాలనుకునే ప్రతి క్రీడాకారుడూ తన అకాడమీ వైపే చూడాలని గోపీ భావిస్తాడని.. ఆయన తీరును బట్టి అర్థమవుతుంది. అందుకే జ్వాల లాంటి వాళ్లు గోపీని టార్గెట్ చేస్తూ ఉంటారు.

ఐతే జ్వాల వ్యవహారం ముందు నుంచి ఉన్నదే కాబట్టి ఓకే. కానీ గోపీ సానబట్టిన సైనా వజ్రం ఏడాది కిందట అతడికి టాటా చెప్పేయడమే ఆయనకు మింగుడు పడని విషయం. సింధు, శ్రీకాంత్ లాంటి న్యూ జనరేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ తనను గోపీ నిర్లక్ష్యం చేస్తున్నాడన్న ఫీలింగ్ తో సైనా హైదరాబాద్ వదిలేసి బెంగళూరుకు షిఫ్ట్ అయింది. అక్కడ విమల్ కుమార్ దగ్గర శిక్షణ తీసుకుంటోంది. దాని ఫలితాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. గోపీ దగ్గర ఉన్నప్పటి కంటే సైనా ఈ మధ్య బాగా మెరుగైంది. తాజాగా ప్రపంచ ఛాంపియన్ షిప్ బ్యాడ్మింటన్ లో అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకం ఖరారు చేసుకోవడం ఆమె సత్తాకు నిదర్శనం. తనపై 9-2 విజయాల రికార్డున్న చైనా అగ్రశ్రేణి క్రీడాకారిణి యిహాన్ వాంగ్ ను హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో 21-15, 19-21, 21-19తో ఓడించి పతకం ఖాయం చేసింది సైనా. ఇంతకుముందు ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ క్వార్టర్స్ చేరినా పతకం గెలవలేకపోయిన సైనా.. ఈసారి పట్టుదలతో ఆడి విజయం సాధించింది. గోపీ శిష్యులు సింధు, శ్రీకాంత్ విఫలమైన సందర్భంలో సైనా తన చిరకాల వాంఛను నెరవేర్చుకోవడం విశేషం. గోపీతో ఉన్నపుడు కానిది.. విమల్ శిక్షణలో సాధ్యమైంది. ఇది ఒకరకంగా గోపీకి ఝలక్కే.