Begin typing your search above and press return to search.

అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయా ?

By:  Tupaki Desk   |   13 Oct 2022 4:50 AM GMT
అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయా ?
X
అధికార వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయా ? ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయాలని ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంటే మరోవైపు ఇదే ప్రాంతంలోని కీలక నేతలిద్దరి మద్య గొడవలు రోడ్డున పడినట్లు అర్ధమవుతోంది. దాని ఫలితంగా వీళ్ళ గొడవలంతా మీడియాకు ఎక్కువుతున్నట్లు అనుమానంగా ఉంది. వ్యక్తిగత గొడవలతో మీడియాకు ఎక్కితే పోయేది అంతిమంగా పార్టీ పరువే అన్న కనీస ఇంగితం కూడా వీళ్ళకు లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

ఇంతకీ విషయం ఏమిటంటే విశాఖపట్నం నగరంలోని ఖరీదైన భూములను రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరి బంధువులు కారుచౌకగా కొట్టేశారంటు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

భూ యజమానులకు, సాయిరెడ్డి బంధులకు మధ్య డెవలప్మెంట్ కోసం జరిగిన ఒప్పందంపై మీడియా అనేక కథనాలు ఇచ్చింది. దీనికి సాయిరెడ్డి కౌంటరుగా తాను చెప్పదలచుకున్నదేదో చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తలు, సాయిరెడ్డి కౌంటర్ ను జనాలు నమ్ముతారా లేదా అన్నది వేరే విషయం.

తాను కౌంటర్ ఇచ్చిన సమయంలోనే సదరు భూమి డెవలప్మెంట్ కోసం తమ బంధువులు చేసుకున్న ఒప్పందంలో పూర్తిగా రెండుపార్టీల ఇష్టమని చెబుతునే కూర్మన్నపాలెంలో జరిగిన మరో డెవలప్మెంట్ ఒప్పందాన్ని ప్రస్తావించారు.

భూ యజమానులతో ఆ డెవలప్మెంట్ చేసుకున్న బిల్డర్ ఎంవీవీఎస్ మూర్తి. ఆ డెవలపర్ ఎవరయ్యా అంటే బిల్డర్ మాత్రమే కాదు విశాఖ వైసీపీ ఎంపీ కూడా. కావాలనే సాయిరెడ్డి సదరు ఒప్పందాన్ని మీడియాకు ఉప్పందించారనే ప్రచారం పెరిగిపోతోంది.

చాలా కాలంగా విశాఖ ఎంపీకి సాయిరెడ్డికి ఏమాత్రం పడటంలేదనే విషయం ఇపుడు బయటపడింది. వాళ్ళిద్దరి మధ్య అంతర్గతంగా ఉన్న గొడవల వల్లే సాయిరెడ్డి బంధువులు చేసుకున్న ఒప్పందాన్ని ఎంపీ వైపు నుండి లీకులు వచ్చినట్లు అనుమానంగా ఉంది. ఈ మంటతోనే ఎంపీ కంపెనీ చేసుకున్న ఒప్పందాన్ని విజయసాయిరెడ్డి బయటపెట్టారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొత్తానికి అంతర్గత కుమ్ములాటలు తారాస్ధాయికి చేరుకున్నట్లు అర్ధమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.