Begin typing your search above and press return to search.

సాయితేజ తన భార్యకు పంపిన చివరి మెసేజ్ వైరల్..

By:  Tupaki Desk   |   11 Dec 2021 7:30 AM GMT
సాయితేజ తన భార్యకు పంపిన చివరి మెసేజ్ వైరల్..
X
ఇటీవల జరిగిన హెలీక్యాప్టర్ ప్రమాదంలో 13 మంది సైనికులు వీర మరణం పొందారు. ఇందులో త్రివిధ దళపతి బిపిన్ రావత్ తో పాటు మరో 12 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. వారిలో ఏపీ రాష్ట్రానికి చెందిన సాయితేజ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అయితే అతను చనిపోయే ముందు మదనపల్లెలో ఉన్న తన భార్యతో మాట్లాడారు. ఆ తరువాత ఓ మెసేజ్ పెట్టాడు.

ఈ మెసేజ్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. తాను చనిపోయే ముందు పెట్టిన ఈ మెసేజ్ ను సాయితేజ భార్య కుటుంబ సభ్యులతో పంచుకుంది. దీంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు తమ నాన్న ఎప్పుడొస్తాడంటూ అన్నట్లు దీనంగా ఉన్న సాయితేజ పిల్లలను చూసి దు:ఖాన్ని ఆపుకోలేకపోతున్నారు.

చిత్తూరు జిల్లా రేగడివారి పల్లెకు చెందిన మోహన్, భువనేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. ఈఇద్దరూ సైన్యంలోనే ఉన్నారు. వీరిలో పెద్ద కొడుకు సాయితేజ. ఇద్దరు పిల్లలను సైన్యంలోకి పంపడంతో ఆ తల్లిదండ్రులను ఇప్పటికే మెచ్చుకుంటున్నారు. అయితే వారిలో పెద్ద కుమారుడు వీరమరణం పొందడంతో ఊరంతా ఒక్కటై వచ్చి కుటుంబాన్ని ఓదారుస్తోంది.

సైన్యం నుంచి ఇంటికి వచ్చినప్పుడు సాయితేజ అందరితో ఆప్యాయంగా ఉండేవారు. కలిసి మెలిసి ఉంటూ కబుర్లు చెప్పేవాడు. సాయితేజ ప్రతిభను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కొందరు సూచిస్తుంటారు.

సాయితేజకు సతీమణి శ్యామల, మోక్షఘ్న, దర్శిని అనే పిల్లలు ఉన్నారు. అయితే సమయం దొరికినప్పుడుల్లా వారితో వీడియో కాల్ చేస్తూ మాట్లాడేవారు. హెలీ క్యాప్టర్ ప్రమాదం జరిగే 4 గంటల ముందు సాయితేజ భార్యతో మాట్లాడారు. అయితే పిల్లలతో మాట్లాడాలని భార్య అడగ్గా.. ప్రస్తుతం టైం లేదని, బాస్ తో కలిసి టూర్ కు వెళ్లాలని అన్నాడు.

టూర్ ముగిసిన తరువాత ఢిల్లీ వెల్లి మాట్లాడుతానని తెలిపాడు. దీంతో ఫోన్ కట్ చేసి ‘హ్యాపీగా ఉండు..’ అని మెసేజ్ పెట్టాడు. అయితే భర్తతో మాట్లాడిని ఆనందంలో ఉన్న శ్యామలకు 4 గంటల తరువాత హెలీక్యాప్టర్ ప్రమాదం సమాచారం అందుకుంది. ఆ తరువాత కన్నీరు మున్నీరైంది.

ఉదయం 8.45 గంటలకు మాట్లాడిన భర్త ఇక రాడని తెలిసేసరికి శ్యామల తట్టుకోలేకపోతుంది. మరోవైపు తమ నాన్న ఎప్పుడొస్తాడు..? అని పిల్లలు అడగడం చూసి.. శ్యామల దు:ఖం ఆపుకోలేకపోతుంది. ఊళ్లోని వారు శ్యామల ఇంటి వద్దే ఉంటూ వారిని ఓదారుస్తున్నారు. ఈ సంక్రాంతికి సొంత ఊరుకువచ్చి తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని అనుకున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో తప్ప సమయం దొరికితే సాయితేజ ఎక్కువగా సొంతూరుకు రావడానికే ఇష్టపడుతాడు. నిత్యం కుటుంబ సభ్యులతో కాంటాక్టులో ఉండే సాయితే ఇంతలోనే ఆయన పరలోకాలకు వెళ్లాడంటూ శ్యామల ఏడుస్తూ చెబుతోంది. ఎప్పుడూ లేనిది తల్లి నిరంతరాయంగా ఏడుస్తూ ఉంటూ పిల్లలు దీనంగా చూస్తున్నారు. ఈ దృశ్యం చూసిన వారంతా దు:ఖాన్ని ఆపుకోలేకపోతున్నారు.

సాయితేజ ప్రతిభావంతుడైనందునే తక్కువ సమయంలో బాస్ దగ్గర సెక్యూరిటీగా చేసే అవకాశం వచ్చిందని ఆర్మీ ఉద్యోగులు తెలుపుతున్నారు. లాన్స్ నాయక్ హోదాలో పనిచేస్తున్న సాయితేజ విధుల్లోనూ అందరితో కలిసిమెలిసి ఉన్నాడని అంటున్నారు. ఇక సాయితేజ మృతదేహం ఢిల్లీ నుంచి బయలు దేరింది.

ఈరోజు సాయంత్రం వరకు చిత్తూరు జిల్లాకు చేరుకోనుంది. అయితే సాయితేజ అంత్యక్రియలు ఇవాళ నిర్వహించలేమని, రేపు ఉదయమే ఇవ్వాలని సాయితేజ బాబాయ్ అధికారులను కోరారు. ఇప్పటికే ఈ ప్రమాదంలో మృతి చెందిన బిపిన్ రావత్, ఆయన భార్య మధులికల అంత్యక్రియలు జరిగాయి. మిగతా సైనికుల మృతదేహాలను గుర్తుపట్టేందుకు డీఎన్ ఏ టెస్టులు చేస్తున్నారు.