Begin typing your search above and press return to search.

సజ్జల వారి తాజా మాట విన్నారా? సామాన్యులకు సెక్రటేరియట్ తో పనేంటి?

By:  Tupaki Desk   |   15 Oct 2022 4:54 AM GMT
సజ్జల వారి తాజా మాట విన్నారా? సామాన్యులకు సెక్రటేరియట్ తో పనేంటి?
X
మొన్నటి వరకు మూడు రాజధానులపై ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించిన జగన్ సర్కారు.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా..దూకుడుగా వ్యవహరిస్తోంది. ఏది ఏమైనా.. ఎట్టి పరిస్థుల్లో పరిపాలనా రాజధానిగా విశాఖపట్నమే అంటూ తన మాటలతో స్పష్టం చేస్తోంది. మంత్రులు సైతం తరచూ ఇదే విషయాన్ని అదే పనిగా చెబుతున్నారు. ఓవైపు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర రాజమహేంద్రవరానికి దగ్గరగా చేరుకున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు కదం తొక్కుతుంటే.. అందుకు ప్రతిగా మూడు రాజధానులపై ప్రభుత్వం దూకుడుగా వెళుతోంది.

బాపట్ల జిల్లాలో భాగమైన తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వలివేరులో పలు డెవలప్ మెంట్ కార్యక్రమాలను పురస్కరించుకొని జగన్ ప్రభుత్వం పలు కార్యక్రమాల్ని చేపట్టింది. ఇందులో భాగంగా సభను నిర్వహించారు. దీనికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డితో పాటు మంత్రి నాగార్జున.. ఎంపీ ఆదిమూలపు సురేశ్ లాంటి పలువురు నేతలు హాజరయ్యారు. వేదిక మీద మంత్రి ఉన్నా.. ఆయనకు మించి సజ్జల వారి మాటలకు అధిక ప్రాధాన్యత లభించటం గమనార్హం.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నోటి నుంచి కీలక వ్యాఖ్య ఒకటి వచ్చింది. సామాన్యులకు రాష్ట్ర సచివాలయంతో పనేంటి? అని ప్రశ్నించారు. గ్రామస్థాయిలో సచివాలయాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో సమస్యలు స్థానికంగా పరిష్కారమువతాయని వ్యాఖ్యానించారు.

నిజమే.. సజ్జల వారు చెప్పినట్లు స్థానిక సమస్యలు స్థానికంగా ఉన్న సెక్రటేరియట్ లో పరిష్కారమవుతాయి. కానీ.. అంతకు మించిన పెద్ద సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర సచివాలయానికి వెళ్లాల్సిందే కదా?అయినా.. సచివాలయం ప్రజలకు అందుబాటులో ఉండాలే కానీ.. ఎక్కడో సదూరాన ఉంచుతామని మొండిపట్టుదలను ప్రదర్శించటంలో అర్థం లేదు.

కానీ.. ఇప్పుడు అవేమీ అర్థం చేసుకునే పరిస్థితుల్లో వైసీపీ నేతలు లేరన్న సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే సామాన్యులకు సెక్రటేరియట్ తో పనేంటి? అన్న వరకు మాటలు రావటం గమనార్హం. ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ.. దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ లకు దగ్గరయ్యేందుకు బీజేపీ.. టీడీపీలు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

చంద్రబాబు సరైన పాలన అందిస్తే 2019లో ప్రజలు చిత్తుగా ఎందుకు ఓడించినట్లు? అని ప్రశ్నించారు. ఇదే సభలో మాట్లాడిన మంత్రి నాగార్జున ఆరునూరైనా మూడు ప్రాంతాల్లోనూ రాజధానులను ఏర్పాటు చేయటం ఖాయమని స్పష్టం చేశారు. మూడు రాజధానుల విషయంలోనూ.. సెక్రటేరియట్ కు ఎవరు రావాలన్న విషయంలో సజ్జల వారి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.