Begin typing your search above and press return to search.

జగన్ టికెట్లను ఎలా ఖరారు చేస్తారో చెప్పేసిన సజ్జల

By:  Tupaki Desk   |   17 Dec 2022 2:30 PM GMT
జగన్ టికెట్లను ఎలా ఖరారు చేస్తారో చెప్పేసిన సజ్జల
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసును దోచుకోవటం.. ఆయన విశ్వాసాన్ని సుదీర్ఘకాలం కొనసాగించటం అంత తేలికైన విషయం కాదు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో? ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో? ఆయన మూడ్ స్వింగ్స్ ను ముందే ఊహించి.. అందుకు తగ్గట్లు మెసులుకోవటం.. ఆయనకు కోపం రాకుండా.. ఆగ్రహానికి గురి కాకుండా ఉండటానికి అవసరమైన గుణాలు అందరికి అర్థం కావు. అలాంటివన్నీ తెలిసిన అతి కొద్ది మందిలో ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామక్రిష్ణారెడ్డి ఒకరు. ఆ మాటకు వస్తే.. జగన్ ను మిగిలిన వారి కంటే చాలా దగ్గరగా చూసిన వారిలో.. చూస్తున్న వారిలో ఆయనే ముందుంటారు.

అలాంటి పెద్ద మనిషి నోటినుంచి ఒక మాట వచ్చిందన్నా.. అది కూడా జగన్ మైండ్ సెట్ ను తెలిపేలా ఉంటుందన్న విషయంలో మరో ఆలోచనకు అవకాశమే లేదు. తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల్ని అండర్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తూచా తప్పకుండా ఆయన చెప్పినది చెప్పినట్లుగా ఫాలో అయితే సరిపోతుందని చెప్పాలి. తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా సజ్జల నోటి నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి. ఆయన మాటల్ని వింటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ ను ఎలా సొంతం చేసుకోవచ్చన్న దానిపై ఫుల్ క్లారిటీ రావటం ఖాయం. ఇంతకూ సజ్జల నోటి నుంచి వచ్చిన ఆ ముఖ్యమైన మాటలేంటన్నది చూస్తే..

- ప్రతి రెండున్నర నెలలకు ఒకసారి గడపగడపకు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష ఉంటుంది. ఈ ప్రోగ్రాం ప్రభుత్వానికి.. ఎమ్మెల్యేలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది ముఖ్యమైన కార్యక్రమం. ముఖ్యమంత్రి సీరియస్ గా సమీక్షిస్తుంటారు.

- సిన్సియర్ గా పని చేయకపోతే మీకే బాగుండదు.. నష్టపోతారని చెబుతారు. ఎమ్మెల్యేలంతా ప్రతి ఇంటికీ తిరగాలని సీఎం జగన్ ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వంలో పర్ఫార్మెన్స్ బాగుంటే ఆటోమేటిక్ గా అభ్యర్థులుగా ఉంటారు. ఎమ్మెల్యేల పని తీరు బాగుంటే అది సర్వేల్లో ప్రతిబింబిస్తుంది.

- సైంటిఫిక్ మెథడ్ అనుకొని సర్వేను జగన్ ఫాలో అవుతున్నారు. 175కు 175 సీట్లు గెలిచేలా ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నారు. సిన్సియర్ గా పని చేయకపోతే మీకే బాగుండదు. నష్టపోతారని ముఖ్యమంత్రి చెప్పారు. ఎమ్మెల్యేలంతా ప్రతి ఇంటికీ తిరగాలని జగన్ ఆదేశించారు.

- మైక్రో లెవల్ ప్లానింగ్ ఎలా ఉండాలనే విషయమై ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి పార్టీకి ఎన్నికల వ్యూహాలు ఉంటాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు వస్తుంటాయి. ఏ సమయంలో వచ్చిన నివేదికను ఫైనల్ గా తీసుకోవాలన్నదే ముఖ్యమంత్రి జగన్ ఇష్టం.

- ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అంతా తిరిగి గెలవాలన్నదే ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్ష. ఇచ్చిన అవకాశాన్ని ఎవరూ చేజార్చుకోవద్దని జగన్ స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల మీద ఇప్పటివరకు అసలు చర్చే జరగలేదు. కాబట్టి.. ఆ అవకాశమే లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.