Begin typing your search above and press return to search.

ఏపీలో పార్టీ పై కేసీఆర్ కు సజ్జల ఘాటు కౌంటర్

By:  Tupaki Desk   |   28 Oct 2021 5:21 AM GMT
ఏపీలో పార్టీ పై కేసీఆర్ కు సజ్జల ఘాటు కౌంటర్
X
పార్టీ పెట్టి ఇరవై ఏళ్లైన సందర్భం గా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్లీనరీ వేళ.. పార్టీ అధినేత కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. తమ ను ఏపీ లో కూడా పార్టీ పెట్టాలని పలువురు కోరుతున్నారని.. పార్టీ పెడితే చాలు.. గెలిపించు కు వస్తామని చెబుతున్నారన్న కేసీఆర్ మాటల కు తాజా గా ఏపీ ముఖ్య మంత్రి సలహాదారు కమ్ పార్టీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కాసింత ఘాటు గా రియాక్టు అయ్యారు. కర్ర కాల్చి వాత పెట్టిన చందం గా కౌంటర్ ఇచ్చారు.

హైదరాబాద్ లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలు గా విభజించటం వల్లే ఏపీ లో అంధకారం అలుముకుంటుందనే విషయాన్ని తాము ముందే చెప్పామని.. ఆ విషయం లో కేసీఆర్ చెప్పింది వాస్తవమేనంటూ సజ్జల వ్యాఖ్యానించారు. శ్రీ శైలం నీటిని అడ్డగోలు గా వాడినందుకు తెలంగాణ కు మిగులు కరెంటు వచ్చిందన్న ఆయన.. రాష్ట్రం విడిపోతే ఏపీ పరిస్థితి దారుణం గా ఉంటుందని.. నీటి సమస్యలు వస్తాయని గతం లో కూడా చెప్పామన్నారు.

ఏపీ లో కూడా టీఆర్ఎస్ ను పెట్టాలని ఏపీ ప్రజలు కోరుతున్నారన్న కేసీఆర్ మాటల పై స్పందించిన సజ్జల.. పార్టీ పెడతామంటే ఎవరైనా వద్దన్నారా? పార్టీ పెట్టొద్దని ఎవరూ చెప్పలేదన్నారు. ఎవరైనా రావొచ్చని.. ఎక్కడైనా పోటీ చేయొచ్చన్న సజ్జల.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోకుండా ఉంటే.. దేశం లోనే ప్రథమ స్థానంలో ఉండేదన్నారు.

కేసీఆర్ ఏదో మాట్లాడతారని.. చంద్రబాబు ఇంకేదో ఆరోపణలు చేస్తారన్న ఆయన.. వీరిద్దరి మధ్య ఏం అండర్ స్టాండిగ్ ఉందోనని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని.. ఎయిడెడ్ స్కూళ్ల ఆందోళన వెనుక టీడీపీ హస్తం ఉందన్నారు. ఎయిడెడ్ పాఠశాలల అప్పగింత లో బలవంతం లేదని.. యాజమాన్యాలు ప్రభుత్వ పోస్టుల ను సరెండర్ చేసి స్కూళ్ల ను నడుపుకోవచ్చన్నారు. రాష్ట్ర పతి పాలన లేదంటే జాతీయ స్థాయి లో ప్రభుత్వాన్ని బద్నాం చేయటమే లక్ష్యం గా బాబు ఢిల్లీ పర్యటన సాగిందన్నారు. తాజా మీడియా సమావేశం లో.. అన్ని విషయాల్ని కవర్ చేస్తూ.. ప్రభుత్వ స్పందన ను సజ్జల తెలియజేశారని చెప్పాలి.