Begin typing your search above and press return to search.

రెండు రాష్ట్రాలు ఒకటి కావాలి.. ఒక్క రాజధాని మూడు కావాలి......అయ్యేదేదో చెప్పరాదా సారూ...?

By:  Tupaki Desk   |   10 Dec 2022 2:30 AM GMT
రెండు రాష్ట్రాలు ఒకటి కావాలి.. ఒక్క రాజధాని మూడు కావాలి......అయ్యేదేదో చెప్పరాదా సారూ...?
X
రెండు రాష్ట్రాలు ఒక్కటి కావాలంట. ఆంధ్రా తెలంగాణా కలవాలంట. అలా అయితే మొదట సంతోషించే పార్టీ వైసీపీయే అని సజ్జల రామక్రిష్ణారెడ్డి తాజాగా చెప్పుకున్నారు. సమైక్య వాణిని గట్టిగా వినిపించేది తామే అని ఆయన సౌండ్ చేశారు. ఉమ్మడి ఏపీ అయితే తమ కంటే ఆనందించేవారు ఎవరూ లేరని అన్నారు.

అంతా బాగుంది కానీ కామెడీ కాకపోతే ఇది అయ్యే పనేనా సారూ అని అంటున్నారు. తెలంగాణా ఆంధ్రా రెండు రాష్ట్రాలు అయ్యాయి. ఇది రియాలిటీ. దీన్ని మరచి ఎవరైనా మాట్లాడితే నేల విడిచి సాము చేసినట్లే అనుకోవాలి. అంతే కాకుండా ఫక్తు రాజకీయం కోసం అంటున్న మాటలుగా భావించాలి.

ఇది సెంటిమెంట్ ని మళ్ళీ రాజేయడానికో మరో దానికో అనుకున్నా వృధా ప్రయత్నం అని కూడా అనుకుంటే బెటరేమో. ఎందుకంటే జనాలు అందరి కంటే చైతన్యవంతులు. వారికి ఏది రియాల్టీ ఏది భ్రమ అన్నది బాగా తెలుసు కాబట్టి. ఇకపోతే అమరావతి ఏకైక రాజధాని అంటే కాదు కాదు మూడు రాజధానులు అంటూ మూడేళ్ళుగా వైసీపీ గడుపుకుని వస్తోంది. మా నినాదం వికేంద్రీకరణ అని అంటోంది.

అంటే ఉప ప్రాంతీయ సెంటిమెంట్ ని రెచ్చగొట్టడానికి ఇది చేస్తున్న వ్యవహారం అని, ఎత్తుగడ అని విపక్షాలు విమర్శిస్తున్నా ఈ రోజుకీ అదే పాటను వైసీపె పాడుతోంది అంటున్నారు. మూడు రాజధానుల విషయంలో అడుగు ముందుకు పడలేదు, అందులో కూడా వాస్తవికత పాళ్ళు చాలా తక్కువ అని అంటున్న వారూ ఉన్నారు.

ఇక ఇపుడు ఒక్కసారి చూస్తే రెండు రాష్ట్రాలు ఒక్కటి కావాలి అంటూ సమైక్య వాదాన్ని వినిపిస్తున్న వైసీపీ ఏపీలో మాత్రం మూడు రాజధానులు అంటోంది. రెండింటికీ మధ్య సిద్ధాంత వ్యత్యాసం కనిపించడంలేదూ అని మేధావులు అంటున్నారు. చిన్న రాష్ట్రంలో మూడు ముక్కలాట ఆడుతూ మనసులు కలవని తెలంగాణా ఆంధ్రా కలసి ఉండాలని కోరుకోవడం ఏ రకమైన విధానం, అదేమి నినాదం అని అంటే జవాబు వైసీపీ పెద్దల వద్ద ఉందా అంటున్నారు.

ఇక ఇవన్నీ అయ్యే పనులు కావూ ఏమీ కావు. ఎందుకీ ఊకదంపుడు అని విపక్షాలు అంటున్నాయి. దీని మీద జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ గట్టిగానే తగులుకున్నారు. పాలన చేతకాకపోతే ఇలాంటివే చెబుతారు అంటూ మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇదే కదా అని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులు అంటూ ఇపుడు ఆడుతున్న రాజకీయ చెలగాటానికి తోడు రెండు రాష్ట్రాలు ఒక్కటి కావాలట. ఏంటిది అంటూ వైసీపీ మీద నిప్పులు చెరిగారు.

ఇలాంటివి చూసే జనాలు కూడా అంటున్నది ఒక్కటే. అయ్యే పనేదో చెప్పండి సారూ. నోట్లో బూరెలు వండడం కాదు. అలాంటివి చిన్నపుడే చాలా వినేశామని అంటున్నారు. అంటే పాలనలో ఏమైనా మంచి పనులు ఉంటే చేసి చూపించాలి తప్ప ఆరిపోయిన సెంటిమెంట్లను రగిలించాలని చూస్తే అవి భోగీ మంటల మాదిరిగా ఆరి ఊరుకుంటాయి తప్ప మరేమీ జరిగేది ఉండదని అంటున్నారు. ఏది ఏమైనా సెంటిమెంట్ అన్నది పండితే ఒకసారి మాత్రమే. పదే పదే ప్రయోగిస్తే వికటిస్తుంది అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.