Begin typing your search above and press return to search.

ముందస్తు లేదు... బ్రేకేసిన ఆ ఇద్దరూ....?

By:  Tupaki Desk   |   9 Jan 2023 4:30 PM GMT
ముందస్తు లేదు... బ్రేకేసిన ఆ ఇద్దరూ....?
X
ఏపీలో ముందస్తు ఎన్నికలు అంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఈ మధ్య జగన్ ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయిన తరువాత ఆ ప్రచారం మరింతగా ఊపందుకుంది. దానికి తగినట్లుగా విపక్ష శిబిరం ఫుల్ అలెర్ట్ అయింది. ఎంతలా అంటే ఎన్నడూ బాబు ఇంటికి వెళ్లని పవన్ కళ్యాణ్ పని గట్టుకుని మరీ బాబు ఇంటి గడప తొక్కేంతలా.

అక్కడ ఇద్దరొ నేతలూ కలసి దాదాపుగా రెండున్నర గంటల పాటు మాట్లాడుకున్నారు. ఏమి చర్చించారు అన్నది ఎవరికీ తెలియదు కానీ ఈ ఇద్దరు నవ్వు ముఖాలతో మీడియా ముందుకు వచ్చిన నేపధ్యాన్ని చూసినపుడు మాత్రం ఏపీలో జనసేన టీడీపీ పొత్తు ఖాయమని అంటున్నారు. దాంతో వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ క్రిషణం రాజు అంటున్నారు. మా వాళ్ళ ప్యాంటులు తడిసిపోయాయని ఆయన సెటైర్లు వేశారు.

ఏకంగా కాపు మంత్రులు అంతా ఒక రౌండేశారు, పవన్ని విమర్శిస్తూ హద్దులు మరచిపోయారు అని ఆయన ఈ రోజు ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడుతూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. కేవలం ఒకే ఒక్క భేటీకి వైసీపీలో ఇంతలా వణుకు పుట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. దానికి ఉదాహరణ జగన్ సొంత పత్రిక సాక్షిలో పెద్ద వార్తలు అచ్చేయడమే అని ఆయన అంటున్నారు.

ఇక ఏపీలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి ఘోర పరాభవం తప్పదని పార్టీ సొంతంగా చేయించుకున్న సర్వే నివేదిక వెల్లడించిందని ఆయన ఒక సీక్రెట్ మ్యాటర్ గుట్టు విప్పారు. ఇక ఎన్నికలు ఎపుడు జరిగినా టీడీపీ జనసేన కలసి ఎన్నికల బరిలో ఉంటాయని అపుడు వైసీపీ ఓటమి ఖాయమని కూడా రఘురామ జోస్యం చెప్పారు. అందుకే ముందస్తు ఎన్నికల విషయంలో వైసీపీ పెద్దలు తగ్గార్ని ఆయన సెటైర్లు వేస్తున్నారు.

ఈ రోజే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి అయితే ముందస్తుకు తాము వెళ్ళేది లేదని చెప్పడం కూడా రఘురామ చెప్పిన దానికి అద్దం పట్టేలా ఉంది అంటున్నారు. మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ అందరి వాడు అని ఆయన్ని కేవలం కాపు నాయకుడిగా చిత్రీకరించడం దారుణం అని ఆయన అన్నారు. వైసీపీ నేతలు అనుసరిస్తున్న ఈ రకమైన ట్రిక్స్ పారవని కూడా అంటున్నారు.

ఇక వైసీపీకి కాపులలో ఏమీ బలం లేదని, అంతే కాదు బీసీలు ఎసీలలో కూడా వైసీపీకి ఆదరణ లేదని ఆయన జాతకం మొత్తం చెప్పేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ చంద్రబాబు మీటింగ్ మీద రఘురామ ఫుల్ హుషార్ గా ఉన్నారు. ఏపీలో జగన్ సర్కార్ కూలడం ఖాయమని ఆయన ధీమాగా ఉన్నారు. మరి ఆయన మాటలకు వైసీపీలో కౌంటర్ చేసే వారు ఉంటారా. చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.