Begin typing your search above and press return to search.

జగన్ వద్దన్న షర్మిల వినలేదు: సజ్జల సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   8 July 2021 9:57 AM GMT
జగన్ వద్దన్న షర్మిల వినలేదు: సజ్జల సంచలన వ్యాఖ్యలు
X
తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన వైఎస్ షర్మిల విషయంలో మరోసారి సీఎం జగన్ స్పందన ఏంటో బయటకు వచ్చింది. షర్మిలకు వైసీపీతో సంబంధం లేదని.. సీఎం జగన్ సన్నిహితుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్న వేళ సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో షర్మిల రాజకీయ భవిష్యత్తును చూసుకున్నారని.. షర్మిల తెలంగాణలో రాజకీయం చేస్తా అన్నప్పుడే సీఎం జగన్ వద్దని వారించాడని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దనేది తమ పార్టీ విధానమన్న సజ్జల కుండబద్దలు కొట్టారు.

ఏపీ, తెలంగాణ అన్నప్పుడు.. తెలంగాణ ప్రయోజనాలకే కట్టుబడి ఉంటానని షర్మిల ఇప్పటికే ప్రకటించారని సజ్జల తెలిపారు. పార్టీలో షర్మిలను ఎదగనివ్వకపోవడం అనేది లేదని.. పార్టీలో పదవులు ఇవ్వలేదని ఆమె ఇంకో పార్టీ పెట్టారని అనుకోవట్లేదన్నారు.

ఏపీలో జరుగుతున్న అభివృద్ధి తెలంగాణలో ఎందుకు జరగకూడదనే ఆమె ఆలోచిస్తున్నారని తెలిపారు.తెలంగాణలో వైసీపీని ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఏపీ ప్రయోజనాలకు భంగం కలుగుతుందనే జగన్‌ భావిస్తున్నట్లు సజ్జల తెలిపారు. అందుకే షర్మిలను కూడా కొత్త పార్టీ వద్దని కోరినట్లు ఆయన వెల్లడించారు .

షర్మిలకు వైసీపీ తరుఫున ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఎలాంటి సహకారం ఉండదని స్పష్టం చేశారు. షర్మిల పార్టీతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని సజ్జల కుండబద్దలు కొట్టారు. అందుకే షర్మిలను కూడా కొత్త పార్టీ వద్దని కోరినట్లు ఆయన తెలిపారు.

తెలంగాణపై సీఎం జగన్‌తో పాటు వైసీపీ కూడా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నాయని సజ్జల తెలిపారు. అందుకే అక్కడ పార్టీని ముందుకు తీసుకెళ్లడం లేదన్నారు. షర్మిలపై సజ్జల చేసిన వ్యాఖ్యలు పూర్తి క్లారిటీగా ఉండటంతో పాటు సంచలనాత్మకంగా ఉన్నాయి.