Begin typing your search above and press return to search.

పీకే టీమ్ పీకిందేమీ లేదు: సజ్జల

By:  Tupaki Desk   |   25 Dec 2018 7:18 AM GMT
పీకే టీమ్ పీకిందేమీ లేదు: సజ్జల
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అంటే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు దడ. ఆయన ఎప్పుడు ఎవరి మీద జగన్ కు నెగిటివ్ గా చెబుతాడో అనే భయపడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ టీమ్ కొన్ని నెలల కిందట జగన్ తో అధికారికంగా ఒప్పందం కుదుర్చుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న సంగతి తెలిసిందే.

వాళ్లే సర్వేలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పరిస్థితిని జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నారు. క్యాండిడేట్స్ తో సంబంధం లేకుండా పీకే టీమ్ సర్వేలు నిర్వహించి జగన్ కు నివేదికలను అందిస్తూ ఉంటారు. అయితే పీకే టీమ్ అంటే సజ్జల రామకృష్ణా రెడ్డికి చాలా చులకనగా ఉన్నట్టుంది. నాలుగు రోజుల క్రితం ఒక నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో పీకే టీమ్ పై సజ్జల అనుచితంగా మాట్లాడాడు అని సమాచారం.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చిన సమాచారం మేరకు.. ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం ఇన్ చార్జిగా ఉన్న నేతను అలాగే కంటిన్యూ చేయాలని వారు కోరారు. ఆయన కష్టపడ్డాడు అని, ప్రజల్లోకి వెళ్లారని.. చెప్పడంతో పాటు.. పీకే టీమ్ నిర్వహించిన సర్వేల్లో కూడా ఆ ఇన్ చార్జి కి మంచి పరిస్థితి ఉందని తేలిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

ఆ ఇన్ చార్జితో జగన్ గతంలో మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని చెప్పాడట కూడా. పీకే సర్వేల్లో నీ పరిస్థితి బాగుందని తేలిందని.. మరింత మంచి మెజారిటీని తెచ్చుకునేందుకు ప్రయత్నించాలని జగన్ ఆ ఇన్ చార్జితో అప్పుడు సూచించాడట కూడా.

ఇదే విషయాన్ని కార్యకర్తలు సజ్జల వద్ద ప్రస్తావించారు. ఆ రిపోర్టు మీకు కూడా అందింది కదా.. అని ప్రస్తావించారు. అయితే ఆ మాటలు వినగానే సజ్జల రెచ్చిపోయాడు. పీకే టీమ్ పీకింది ఏమీ లేదు అంటూ కార్యకర్తల మీద విరుచుకుపడ్డాడు. పీకే టీమ్ రిపోర్టును తాము పరిగణనలోకి తీసుకోవమని కూడా అన్నాడట సజ్జల. ఈ మాటలు విని వైసీపీ కార్యకర్తలు ఖిన్నులయ్యారు.

వారు మరేం మాట్లాడలేకపోయినట్టుగా తెలుస్తోంది. ‘పీకే టీమ్ పీకిందేమీ లేదు..” అనేది ఒక ఊతపదంగా వైసీపీలో ఒక చర్చ నడుస్తోంది. ఈ మాటలను సజ్జల ఏదైనా ఎక్స్ పీరియన్స్ తో అన్నాడో లేక ఆయనకు సన్నిహితులైన వారికి సర్వేల్లో నెగిటివ్ రిపోర్టులు వచ్చాయనే భావనతో ఉన్నాడో ఆయనకే తెలియాలి! అని వైసీపీ కార్యకర్తలు అన్నారు.