Begin typing your search above and press return to search.

సీబీఐకు ఎక్కడో మండేలా ఆ మాటలు ఇప్పుడు అవసరమా ?

By:  Tupaki Desk   |   17 Feb 2022 4:20 AM GMT
సీబీఐకు ఎక్కడో మండేలా ఆ మాటలు ఇప్పుడు అవసరమా ?
X
ప్రభుత్వంలో అధినేత తర్వాత అంతా తానై అన్నట్లు వ్యవహరించటంతో పాటు.. అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయటం దగ్గర నుంచి.. ప్రభుత్వానికి మెదడుగా మారారు ఏపీ ప్రభుత్వ సలహాదారు పేరున్న సజ్జల రామ కృష్ణారెడ్డి. విషయం ఏదైనా సరే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం గడిచిన కొద్దికాలంగా ఎక్కువైంది. చూసేందుకు సౌమ్యుడిగా కనిపిస్తూ.. పెద్ద మనిషి తరహాలో ఉండే సజ్జల..మాటల్లోనూ.. చేతల్లోనూ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఇక.. ప్రత్యర్థి పార్టీలపై ఆయన ప్రదర్శించే దూకుడు అంతా ఇంతా కాదనే చెప్పాలి. అలాంటి ఆయన తాజాగా తన మాటల గురిని సీబీఐ మీద ఎక్కు పెట్టిన తీరు విస్మయానికి గురి చేస్తోంది.

ఆ మధ్యన సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై జగన్ సర్కారు విరుకుపడటం.. జగన్ వర్గీయులు.. ఆయన సానుభూతిపరులు సోషల్ మీడియాలో వారిపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటం తెలిసిందే. ప్రస్తుతం న్యాయ విచారణలో ఉన్న ఈ అంశం ఏదో ఒకరోజు జగన్ ప్రభుత్వానికి షాకిస్తుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఇలాంటి వాటిని పట్టించుకోని సజ్జల అండ్ కో.. భవిష్యత్తు పరిణామాల గురించి ఆలోచించకుండా.. తక్షణ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు సంచలనంగా మారుతోంది.

తాజాగా వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐపై విరుచుకుపడిన వైనం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది. చార్జిషీట్ పేరుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. అప్పుడు కుట్ర చేశారని.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ కుట్ర చేస్తున్నట్లుగా ఆరోపించారు.

బాధితులనే నిందితులుగా మార్చే కుట్ర సాగుతుందన్న సజ్జల.. వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ చార్జిషీట్ హేతుబద్ధంగా లేకుండా కథనంలా ఉందని.. చార్జ్ షీట్ లో సంబంధం లేని వ్యక్తుల మీద కుట్ర జరుగుతుందన్న ఆయన వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతున్నాయి. ఎంపీ టికెట్ కోసం వివేకా హత్య జరిగిందనే కోణంలో చార్జిషీట్ లో కథనం రాయవటం పూర్తి అసంబద్ధమన్న ఆయన.. అవినాష్ గెలుపు కోసం చివరి క్షణం వరకు వివేకా కృషి చేశారంటూ తనదైన వాదనను వినిపించారు సజ్జల.

అసంబద్ధమైన కథనాలు ప్రసారం చేస్తున్నారని.. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నట్లుగా మండిపడ్డారు. మొత్తంగా సీబీఐ చార్జిషీట్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉండటంతో.. దీనిపై సీబీఐ ఏ రీతిలో రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అత్యుత్సాహంతో వ్యాఖ్యలు చేసి.. ఇప్పుడు కిందా మీదా పడుతున్న వైసీపీ వర్గాలు.. సీబీఐ మీద సజ్జల చేసిన ఆరోపణలు.. విమర్శలు రానున్న రోజుల్లో మరెలాంటి ఉత్పాతాన్ని తీసుకొస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా ఎవరిని పడితే వారిని.. సమయం.. సందర్భం చూసుకోకుండా కెలకటం ఏమిటన్న మాట వినిపిస్తోంది.