Begin typing your search above and press return to search.

కొవ్వొత్తుల కాకుండా ఇంకేం కాల్చితే న‌చ్చేది బాబు?

By:  Tupaki Desk   |   28 Jan 2017 5:30 AM GMT
కొవ్వొత్తుల కాకుండా ఇంకేం కాల్చితే న‌చ్చేది బాబు?
X
గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా విశాఖ‌లోని ఆర్కే బీచ్‌ లో ఏపీకి ప్ర‌త్యేక హోదా కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్ట‌డాన్ని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు సార‌థ్యంలోని ప్ర‌భుత్వం అడ్డుకోవ‌డాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తప్పుప‌ట్టారు. ప్ర‌జాస్వామ్య‌యుత ఆకాంక్ష‌ను చాటేందుకు చేసిన ప్ర‌య‌త్నాని ఏపీ ప్ర‌భుత్వం తీవ్రంగా అణిచివేసింద‌ని విమ‌ర్శించారు. రిపబ్లిక్ డే సాక్షిగా నిర‌స‌న‌లు చేస్తున్నార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించ‌డం ఆయ‌న అవ‌గాహ‌న‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడు బంద్ - హర్తాళ్ లాంటివి చేస్తామంటే తప్పు గానీ, పావురాలు ఎగరేయడం - కొవ్వొత్తులు వెలిగించడం లాంటివి తమ భావాన్ని ప్రకటించడమే అవుతుందని, ఇంత ప్రశాంతమైన కార్యక్రమాన్ని రెచ్చగొట్టేలా చేసింది ఎవరని సజ్జ‌ల‌ ప్రశ్నించారు. ప్రశాంతంగా కొవ్వొత్తుల ర్యాలీ అనేది ఏ రకంగానూ శాంతి భ‌ద్ర‌త‌ల‌కు భంగం కలిగించేది కాదు కాబట్టే గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున తలపెట్టారని రామకృష్ణారెడ్డి అన్నారు.

విచ్ఛిన్నకర శక్తులు - టెర్రరిస్టులు వైజాగ్‌ ను తగలబెట్టడానికి వస్తుంటే ఆపకూడ‌దా అనే క్రూరమైన మాటలను అంత ప్రశాంతంగా చెప్పినందుకు హ్యాట్సాఫ్ అని బాబు తీరును స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఏం చరిత్ర ఉందని రాజశేఖరరెడ్డిని రెండు సార్లు ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారని అడిగారు. పులివెందులలో ఫ్యాక్షన్ రాజకీయాలను రూపుమాపేందుకు ప్రయత్నించిన ఒక నాయకుడి కుటుంబం గురించి ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కన్నతండ్రి 1998లో హత్యకు గురైతే.. ఆ కేసులో ప్రధాన నిందితుడికి రక్షణ కల్పించింది నాటి సీఎం చంద్రబాబేనని, అతడికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి మరీ రక్షించారని చెప్పారు. ఒక నాయకుడిని రాజకీయంగా బలహీనం చేయడానికి ఇంట్లో పెద్దాయనను హత్య చేసినా, ప్రతీకారానికి ఆయనేమీ ప్రయత్నించలేదని అన్నారు. వైఎస్ ఉన్న ఐదేళ్లలోనే కదా విశాఖకు సాఫ్ట్‌ వేర్ పార్క్ వచ్చిందని, టూ టైర్ అభివృద్ధి కోసం నిధులొచ్చిందని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో ఓడినంత మాత్రాన ఏమీ కాదని.. తర్వాత మళ్లీ తాము అక్కడ గెలుస్తామని స‌జ్జ‌ల‌ ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుత వేగంతో వెళ్తే ఐదేళ్లు కాదు...50 ఏళ్లలో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందడం కష్టమని సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా వల్ల పారిశ్రామికాభివృద్ధి ఎలా జరుగుతుందని చూపించమని చంద్ర‌బాబు అడ‌గడం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌ని వ్యాఖ్యానించారు. ఎలాంటి అభివృద్ధి లేక‌పోతే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో టీడీపీ నాయకులు కూడా వెళ్లి ఎందుకు పరిశ్రమలు పెడుతున్నారని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ప్రయోజనం లేకపోతే, పెద్ద పరిశ్రమ పెట్టడానికి మూడేళ్ల సమయం సరిపోతుంది, రెండేళ్లు చాలవు కాబట్టి పది, పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలని ఎన్నికల సమయంలో ఎందుకు అడిగారని, వెంకయ్య నాయుడు పార్లమెంటులో అదే విషయం ఎందుకు ప్రస్తావించారని ఆయన నిలదీశారు. 900 కిలోమీటర్లకు పైగా తీరప్రాంతం ఉండి, మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా వస్తే మరింత అభివృద్ధి ఉంటుందన్నది అందరి ఆకాంక్ష అని, హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోవడం వల్ల హోదా ఇస్తామని వాళ్లే అన్నారని సజ్జ‌ల చెప్పారు. ప్యాకేజిలో కొత్తగా ఏమీ లేవని, యూనివర్సిటీలు, ఇతర సంస్థలు అన్నింటినీ ముందే చెప్పారని అన్నారు. ఇక‌నైనా చంద్ర‌బాబు త‌న ఆలోచ‌న‌లు మార్చుకొని ప్రత్యేక హోదాకు సంఘీభావం ప్ర‌క‌టించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/