Begin typing your search above and press return to search.

పీకే ప్ర‌జంటేష‌న్ మీద స‌జ్జ‌ల ఎందుకు సైలెంట్ అయ్యాడు?

By:  Tupaki Desk   |   26 April 2022 10:38 AM GMT
పీకే ప్ర‌జంటేష‌న్ మీద స‌జ్జ‌ల ఎందుకు సైలెంట్ అయ్యాడు?
X
స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి. వైసీపీ కీల‌క‌నాయ‌కుడిగా చ‌క్రం తిప్పుతున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ప్ర‌భుత్వం లో రాజ‌కీయ స‌ల‌హాదారుడిగా కూడా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతేకాదు.. వైసీపీపైనా.. సీఎం జ‌గ‌న్ పైనా ఈగ‌వాల‌కుండా ఆయ‌న చూసుకుంటున్నారు.. ముఖ్యంగా ప్ర‌తిప‌క్షాల నుంచి వ‌చ్చే ప్ర‌తి విమ‌ర్శ‌ను ఆయ‌న నిశితంగా ప్ర‌తివిమ‌ర్శ‌లు చేస్తారు. టీడీపీ, జ‌న‌సేన నేత‌లు చేసే విమ‌ర్శ‌ల‌కు అదే రేంజ్‌లో కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఎవ‌రైనా ఏదైనా అంటే.. వెంట‌నే రంగంలోకి దిగిపోయి.. వాయించి వ‌దిలేస్తారు.

అయితే.. ఇది అన్ని సంద‌ర్భాల్లోనూ జ‌రుగుతుందా? అంటే.. కాద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందు కంటే.. తాజాగా వైసీపీ వ్యూహ‌క‌ర్త‌.. గ‌త ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు కృషి చేసిన‌.. ప్ర‌శాంత్ కిశోర్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్య‌లు.. వైసీపీకి ఆగ‌ర్భ శ‌త్రువుగా ఉన్న కాంగ్రెస్ కు చేసిన రిప్ర‌జెంటేష‌న్ వంటి అంశాలు.. దేశ‌వ్యాప్తంగా గ‌గ్గోలు పెట్టినా.. స‌జ్జ‌ల స్పందించ‌లేదు. ఇటీవ‌ల కాంగ్రెస్‌తో ట‌చ్‌లోకి వ‌చ్చిన పీకే.. ఆ పార్టీని వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలో మొత్తం 17 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒంట‌రిగా బ‌రిలో పొటీ చేయొచ్చ‌ని.. కానీ.. ప్రాంతీయ పార్టీలు బ‌లంగాఉన్న ఏపీ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల‌తో పొత్తులు పెట్టుకోవాల‌ని.. సూచించార‌ట‌. ఈ విష‌యం దేశ‌వ్యాప్తంగా గ‌గ్గోలు పుట్టించింది. ముఖ్యంగా వైసీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాల‌ని.. పీకే సూచించిన‌ట్టు వార్త రాగానే.. పెద్ద ఎత్తున రాజ‌కీయ దుమారం రేగింది. మ‌రి ఇంత జ‌రిగినా.. స‌జ్జ‌ల మాత్రం రియాక్ట్ కాలేదు.

నిజానికి ఈ ప్ర‌తిపాద‌న వైసీపీ అధిష్టానానికి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. కార్య‌క‌ర్త‌లు.. వైసీపీ అభిమానులు మాత్రం ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హించ‌ర‌నేది .. విశ్లేష‌కుల భావ‌న‌గా ఉంది. ఎందుకంటే.. వైఎస్ త‌న‌యుడు.. జ‌గ‌న్‌పై కేసులు పెట్టించి.. 16 నెల‌ల‌పాటు ఆయ‌న‌ను జైలుకు త‌ర‌లించి, ఇప్ప‌టికీ కేసుల్లోఉండేలా చేసింది. ఆరోజుల్లో.. కాంగ్రెస్ పార్టీనేని.. వైసీపీ నేత‌లు ఇప్ప‌టికీ విశ్వ‌సిస్తారు. అందుకే.. కాంగ్రెస్ నుంచి చాలా మంది బ‌య‌ట‌కు వ‌చ్చి.. వైఎస్ అభిమానులు.. వైసీపీకి మ‌ద్ద‌తిచ్చారు. అంతేకాదు.. 2014లో పోటీ చేసిన తొలి అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే 67 స్థానాల్లో గెలిచి.. విజ‌యం ద‌క్కించుకున్న పార్టీ వైసీపీ.

ఆ త‌ర్వాత‌.. 2019లో వైసీపీ ఒక రాజ‌కీయ ప్ర‌భంజ‌నం సృష్టించింది. 151 సీట్ల‌లో విజ‌యం సాధించింది. ఇక‌, ఏపీలో కాంగ్రెస్ ప‌రిస్థితిని ఎంత చెప్పుకొన్నా వేస్టే.. ఎందుకంటే.. ఒక‌ప్ప‌టి హ‌వా నేడు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. క‌నీసం 1 శాతం ఓటు బ్యాంకు కూడా లేదు. మ‌రి ఇలాంటి పార్టీతో.. వైసీపీ అదినేత జ‌గ‌న్ ఎలా పొత్తు పెట్టుకుంటారు? అని వైసీపీ త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తున్న స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి గట్టివార్నింగ్ ఇవ్వాలి క‌దా! కానీ, అలా జ‌ర‌గ‌లేదని విమ‌ర్శ‌లు అంటున్నారు.

అంతేకాదు.. ప్ర‌తి విష‌యంలోనూ స‌జ్జ‌ల వివ‌ర‌ణ ఇస్తారు క‌దా.. ఇప్పుడు ఎందుకు మీడియా ముందుకు రావడం లేదేని ప్ర‌శ్నిస్తున్నారు. ఇదే విష‌యంపై రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ సాగుతోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదాఇస్తామంటే.. తాము ఎవ‌రితో అయినా పొత్తు పెట్టుకుంటామ‌ని వ్యాఖ్యానించ‌డం కూడా స‌రైంది కాదేమో.. అంటున్నారు. ఇవ్వాలి అనుకుంటే.. రాష్ట్ర ప్ర‌జల గురించి.. అంద‌రూ అంటున్నారు.కానీ, వాస్త‌వానికి వ‌చ్చే స‌రికి మాత్రం నిజం చేయ‌డం లేదు క‌దా! అని విమ‌ర్శ‌కులు అంటున్నారు.