Begin typing your search above and press return to search.

పాత జీతాలు వేయలేం.. స్పష్టం చేసిన ఏపీ సర్కార్

By:  Tupaki Desk   |   1 Feb 2022 2:31 PM GMT
పాత జీతాలు వేయలేం.. స్పష్టం చేసిన ఏపీ సర్కార్
X
పీఆర్సీ ప్రకారం జీతాలు పడుతున్న వేళ పాత జీతాలు వేయడం ఎలా సాధ్యమని ఉద్యోగ సంఘాలను ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. స్టీరింగ్ కమిటీ సభ్యులతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలను అంశాల వారీగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. జీతాలు పడుతున్న వేళ పాత జీతాలు వేయడం ఎలా సాధ్యమన్నారు.

చలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని కోరామని సజ్జల తెలిపారు. చర్చల సమయంలో ఉద్యమం అంటే ప్రతిష్టంభన ఏర్పడుతుందన్నారు. చలో విజయవాడ కార్యక్రమం కొనసాగుతోందని వారు చెప్పారన్నారు. ఉద్యోగుల కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోదన్నారు. కరోనా నిబంధనను ఉద్యోగ సంఘాలు గుర్తుంచుకోవాలన్నారు.

‘చలో విజయవాడ కార్యక్రమం’ కంటే ముందే సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని సజ్జల పేర్కొన్నారు. జీతాల్లో ఎక్కడా రికవరీ లేదన్నారు. ఐఆర్ అనేది తాత్కాలిక అడ్జెస్ట్ మెంట్ మాత్రమేనని ఆయన తెలిపారు. అది రీఅడ్జెస్ట్ అవుతుందని..దాన్ని రికవరీగా చూడొద్దన్నారు. ఉద్యోగ సంఘాల నేతలను మంత్రులు బెదిరిస్తున్నారనడం అవాస్తవమన్నారు. హైకోర్టు ఆదేశాలను ఉద్యోగులు కూడా పరిగణలోకి తీసుకొని తమ కార్యాచరణను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య పీఆర్సీ వివాదం ముదిరిపాకాన పడుతోంది. అటు ప్రభుత్వం కొత్త జీతాలు, పీఆర్సీ అమలు చేస్తుండగా.. ఉద్యోగులు తీసుకోం అంటూ ఉద్యమ బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే పీఆర్సీని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులు జీతాల నుంచి ఎటువంటి రికవరీలు చేయవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పీఆర్సీ కొత్త జీవోలను మూడు వారాల పాటు యథాస్థితిలో ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఏపీ ఉద్యోగులతో ప్రభుత్వం ఫైట్ మరింత రాజుకుంది. తగ్గేదేలే అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు ఉద్యమిస్తున్నా.. ఏపీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఉద్యోగుల జీతాలు, పింఛన్ల బిల్లులను ప్రాసెస్ చేయాలని ఆర్థికశాఖ మరోసారి సర్క్యూలర్ జారీ చేసింది.