Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ పై దాడి..వైసీపీ కీల‌క భేటీ..ఇవ‌న్నీ డౌట్లే

By:  Tupaki Desk   |   26 Oct 2018 4:51 PM GMT
జ‌గ‌న్‌ పై దాడి..వైసీపీ కీల‌క భేటీ..ఇవ‌న్నీ డౌట్లే
X
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత‌ - ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ఆ పార్టీ అల‌ర్ట్ అయింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో కీల‌క‌ నాయకులు శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. మేకపాటి రాజమోహన్‌ రెడ్డి - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు - బొత్స సత్యనారాయణ - భూమన కరుణాకర్‌ రెడ్డి - అనంత వెంకట్రామిరెడ్డి - కె. పార్థసారధి - వరప్రసాద్‌ - సజ్జల రామకృష్ణారెడ్డి - వాసిరెడ్డి పద్మ తదితరులు సమావేశంలో పాల్గొని విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌ పై హత్యాయత్నం - ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పందించిన తీరు తదనంతర పరిణామాలపై లోతుగా చర్చించారు. అనంత‌రం వైఎస్ ఆర్‌ సీపీ సీనియర్‌ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ పై జరిగిన దాడి కంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. విచక్షణా జ్ఞానం ఉండి ఆలోచించే వారు అందరూ కూడా చంద్రబాబు వెకిలితనాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ దుర్ఘటనపై ఒక నిష్పాక్షిత దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండు చేశారు. సంఘటన జరిగిన అరగంటలోనే డీజీపీ ఒక కన్‌క్లూజన్‌ ఇవ్వడం దారుణమన్నారు.

ప్రతిపక్ష నేతపై జరిగిన దాడికి సూత్రదారి అధికార టీడీపీ పార్టీనే అని, సీఎంగా కొనసాగడానికి చంద్రబాబు అనర్హుడని సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు వైఎస్ ఆర్‌ సీపీపై బుదరజల్లుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్‌ జగన్‌ అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని, నిందితుడిని ఏమి చేయవద్దని చెప్పారన్నారు. బాధగా ఉన్న సరే..ఎయిర్‌ పోర్టులో అందర్ని పలకరిస్తూనే వచ్చారన్నారు. ప్రాథమిక చికిత్స చేసి హైదరాబాద్‌కు పంపించారని, అక్కడ పోలీసులు ఉండాలని సూచించి ఉంటే విశాఖలోనే ఉండేవారన్నారు. ఒక ఆయుధం ఎయిర్‌ పోర్టులోకి ఎలా వచ్చిందని మా పార్టీ నాయకులు ప్రశ్నించారని, ఆ కత్తికి విషం ఏమైనా ఉందా అని అనుమానం వ్యక్తం చేశారన్నారు. పబ్లిసిటీ కోసం ఈ ఘటనను వాడుకునేతత్వం వైఎస్‌ జగన్‌ ది కాదన్నారు. చంద్రబాబు అయితే వెంటనే స్ట్రేచర్‌ పై పండుకొని - పురవీధుల గుండా ఊరేగేవారని తెలిపారు. అభిమానంతోనో, అమ్ముడపోయో ఓ వర్గం మీడియా అంగీపై రక్తం లేదని చర్చ జరపడం, డీజీపీ స్టేట్‌ మెంట్‌ ఇవ్వడంపై మాకు అనుమానం వచ్చిందన్నారు. సెల్‌ ఫోన్‌ లో మెసెజ్‌ లు చూస్తూ ఆయన మాట్లాడటం అనుమానంగానే ఉందన్నారు. లెటర్‌ లో ఉన్న అంశాలను కూడా విచారణలోకి తీసుకుంటామన్నారు..కానీ ఆ లెటర్‌లో ఏముందో అప్పుడు చెప్పలేదన్నారు. విచారణ మొదలుపెట్టామని డీజీపీ చెప్పారన్నారు. వీవీఐపీ అక్కడ ఉంటే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. నిందితుడి రాసినట్లు ఒక్కో పేజీలో ఒక్కరకంగా రాశారన్నారు. మా నాయకుడిపై బుదరజల్లి టీడీపీ ఓ డ్రామా రక్తికట్టించారన్నారు. రాత్రి చంద్రబాబు ప్రెస్‌ మీట్‌ చూస్తే ఆశ్చర్యమనిపిస్తుందన్నారు. అన్ని పార్టీలన్నీ కూడా తనపై దాడి చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మీడియా బలం చూసుకొని చంద్రబాబు తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.