Begin typing your search above and press return to search.

నాని ప్రతిపక్షాల ట్రాప్ లో పడ్డారు:సజ్జల

By:  Tupaki Desk   |   24 Sep 2020 5:39 PM GMT
నాని ప్రతిపక్షాల ట్రాప్ లో పడ్డారు:సజ్జల
X
తిరులమ డిక్లరేషన్ వ్యవహారం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆలయాలు, డిక్లరేషన్ పై నాని చేసిన వ్యాఖ్యలు విపక్షాలకు విమర్శనాస్త్రాలుగా మారాయి. అయితే, మోదీ, యోగిలపై నాని చేసిన వ్యాఖ్యలతో ఇటు వైసీపీ సర్కార్ కూడా ఇరకాటంలో పడ్డట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాని తొందరపడి మోదీ, యోగిలను ఈ వ్యవహారంలోకి లాగారని, దీంతో, ప్రభుత్వం డిఫెన్స్ లో పడాల్సి వచ్చిందని కొందరు వైసీపీ నేతలు కూడా గుసగుసలాడుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాని వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మంత్రి కొడాలి నాని విపక్షాల ట్రాప్‌లో పడ్డారని సజ్జల అభిప్రాయపడ్డారు. తమ రాజకీయ స్వార్థం కోసం టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆ ట్రాప్ లో పడి వ్యక్తిగత విమర్శలకు దిగొద్దని సూచించారు.

హిందూ దేవాలయాలపై దాడుల వెనుక టీడీపీ హస్తం ఉందని సజ్జల సంచలన ఆరోపణలు చేశారు. హిందూ మతంపై విశ్వాసంతో కాదని, అధికారంలో లేమనే బాధతో ప్రతిపక్షాలు ఇలా వ్యవహరిస్తున్నాయని అన్నారు. వీటి వల్ల ప్రజల్లో ప్రతిపక్షాలే చులకనవుతున్నాయన్నారు. అమరావతి భూ కుంభకోణంపై దృష్టి మరల్చడమే టీడీపీ లక్ష్యమని సజ్జల మండిపడ్డారు. అందుకే, తమ అనుకూల మీడియాను అడ్డంపె ఈ తరహా రాజకీయాలు టీడీపీ చేస్తోందని,ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పాలన చూసి విపక్షాలు ఓర్వలేకున్నాయని, అందుకే జగన్ ను టార్గెట్ చేసుకుని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. అందుకే, ప్రభుత్వాన్ని రెచ్చగొట్టాటని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, ఆ ట్రాప్ లో పడొద్దని నానిని ఉద్దేశించి అన్నారు. వ్యక్తిగత వ్యాఖ్యలు ఎవరిపై ఎవరు చేసినా సమర్థనీయం కాదని, ఆ తరహా వ్యాఖ్యలతో విపక్షాల ట్రాప్‌లో పడొద్దని సజ్జల సూచించారు.