Begin typing your search above and press return to search.

అప్పులకు కొత్త లెక్కలు చెబుతున్న సజ్జల

By:  Tupaki Desk   |   9 Aug 2021 4:43 AM GMT
అప్పులకు కొత్త లెక్కలు చెబుతున్న సజ్జల
X
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై అప్పుల ఆరోపణలు చేస్తున్న వైనం ఈ మధ్యన చూస్తున్నదే. అన్నేసి అప్పులు ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నలతో పాటు.. ఈ అంశంపై కేంద్రం కూడా క్వశ్చన్ చేస్తుందంటూ మీడియాలో కథనాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. అప్పుల మీద వస్తున్న విమర్శలపై తొలుత అంతగా పట్టించుకోని జగన్ సర్కారు.. ఇటీవల కాలంలో తన మీద పెరుగుతున్న విమర్శల తీరుతో వాటికి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం తీస్తున్న ఆరాపైనా తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామక్రిష్ణారావు ఆసక్తికర వాదనను తెర మీదకు తీసుకొచ్చారు.

ఎంతసేపటికి ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు గురించి మాట్లాడేవారు.. భారత ప్రభుత్వం చేసే అప్పుల మాటేమిటి? అంటూ కొత్త చర్చకు తెర తీశారు. కేంద్రంలోని మోడీ సర్కారు పాలనలో కేంద్రం కొత్తగా రూ.కోటి పదహారు లక్షల కోట్ల అప్పు చేసిందని.. కొవిడ్ సమయంలోనే రూ.20లక్షల కోట్లు అదనంగా అప్పు చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం చేసిన అప్పు చాలా తక్కువన్న ఆయన.. ఇతర రాష్ట్రాల్లోనూ తమకు మించిన అప్పులు చేశారన్నారు.

ఏపీలోని జగన్ సర్కారు పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఘాటు రిటార్టు ఇచ్చారని చెప్పాలి. తాజాగా ఆయన మాట్లాడుతూ కేంద్ర సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల జేబుల్లో డబ్బు ఉంటేనే కొనుగోళ్లు పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని.. ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్ నేరుగా.. లబ్థిదారుల ఖాతాల్లో రూ.లక్ష కోట్లకు పైగా జమ చేస్తున్నట్లు చెప్పారు. తీసుకొచ్చే ప్రతి పైసా అప్పును సద్వినియోగం చేస్తున్నామన్న ఆయన.. జగన్ అనుసరించే మత విశ్వాసాల్ని ఆధారంగా చేసుకొని దుష్ప్రచారం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు.

రాబోయే రోజుల్లో మత విశ్వాసాలు.. ఆర్థికపరమైన అంశాలే అజెండాగా దాడి జరగబోతోందన్న ఆయన.. ఈ తరహా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు వీలుగా నేతలు సిద్ధంగా ఉండాలన్నారు. బీజేపీ నేతలకు ప్రజా సమస్యలపై పోరాటం.. మస్యల పరిష్కారం అనే అజెండాతో సంబంధం లేదని.. మతం ఆధారంగా దాడి చేయటం వారికి తెలుసన్నారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి అడుగుతున్నవేళ.. దానికి సమాధానం చెప్పే కంటే మోడీ సర్కారు చేసిన అప్పుల లెక్క చెప్పి.. కొత్త చర్చకు సజ్జల మాష్టారు తెర తీశారని చెప్పక తప్పదు. ఇంతకీ.. సజ్జల చెప్పినట్లుగా మోడీ ఏడేళ్ల హయాంలో చేసిన అప్పులు ఎన్ని? ఎందుకంత చేసినట్లు? ఓవైపు పెట్రోల్.. డీజిల్ బాదుడు ఇంతలా బాదేసిన తర్వాత కూడా అప్పులు చేయటానికి కారణం ఏమిటన్న ప్రశ్నను సంధించాల్సిన సమయం వచ్చేసిందని చెప్పాలి.