Begin typing your search above and press return to search.

నెటిజ‌న్ల దెబ్బ‌కు సీపీ ట్వీట్ డెలిట్ చేశారుగా!

By:  Tupaki Desk   |   1 Dec 2019 12:35 PM GMT
నెటిజ‌న్ల దెబ్బ‌కు సీపీ ట్వీట్ డెలిట్ చేశారుగా!
X
డాక్టర్‌ ప్రియాంకా రెడ్డి కేసులో ఓ వైపు ద‌ర్యాప్తు - మ‌రోవైపు ఆమె ఆచూకి తెలియ‌ని స‌మ‌యంలో పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరుతో పోలీసు అధికారులు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న‌న సంగ‌తి తెలిసిందే. బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేష‌న్‌ కు వెళ్ల‌గా త‌మ ప‌రిధిలోకి రాద‌ని తిప్పి పంపించ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ ప‌రిధి విష‌యంలోనే...ముగ్గురు పోలీసులపై వేటుపడింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యహరించడంతోపాటు - సకాలంలో స్పందించకపోవడం - ఎఫ్ ఐఆర్ నమోదుచేయని కారణంగా శంషాబాద్ పోలీస్‌ స్టేషన్‌ లో పనిచేస్తున్న ముగ్గురు పోలీసులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఉత్తర్వులిచ్చారు.

అయితే, ఇదే ప‌రిధి స‌మ‌స్య‌తో హైద‌రాబాద్ సీపీ అంజ‌నీకుమార్ ఊహించ‌ని ఇర‌కాటంలో ప‌డిపోయారు. క్లారిటీ ఇచ్చేందుకు ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నం కాస్తా నెటిజ‌న్ల ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌యింది. దీంతో ఆ ట్వీట్‌ ను డెలిట్ చేయాల్సి వ‌చ్చింది. డాక్ట‌ర్ ప్రియాంక‌రెడ్డి హ‌త్యోదంతం నేప‌థ్యంలో ప‌లు ఛాన‌ల్లు హైద‌రాబాద్ పరిధి అని పేర్కొంటూ వార్త‌లు ప్ర‌చారం చేయ‌డంపై హైద‌రాబాద్ సీపీ క్లారిటీ ఇచ్చారు. `కొన్ని మీడియా సంస్థ‌లు హైద‌రాబాద్‌లో ఘ‌ట‌న జ‌రిగింద‌ని అంటున్నారు. ఆ ఘ‌ట‌న జ‌రిగింది సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో` అని ఆయ‌న ట్వీట్ చేశారు.

అయితే, సీపీ ట్వీట్‌ పై ప‌లువురు భ‌గ్గుమ‌న్నారు. ``నేరం జ‌రిగిన స‌మ‌యంలో - బాధితులు ఆప‌ద‌లో ఉన్న త‌రుణంలో...స‌మ‌స్య ప‌రిష్కారం కోసం - బాధితుల‌కు అండ‌గా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తారా....ప‌రిధి అంటూ కార‌ణాలు చెప్తారా? రాజీవ్‌ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌ పోర్ట్ హైద‌రాబాద్‌ లో ఉందంటారా? సైబ‌రాబాద్‌ లో అంటారా`` అంటూ ప‌లువురు నెటిజ‌న్లు ఘాటుగా స్పందించారు. దీంతో క్లారిటీ ఇచ్చేందుకు చేసిన ట్వీట్‌ ను ఆయ‌న డిలిట్ చేశారు. వాస్త‌వానికి ఆయ‌న మీడియాకు స్ప‌ష్ట‌త‌కు ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తే ఇలా ఊహించ‌ని స‌మ‌స్య ఎదురైంద‌ని అంటున్నారు.