Begin typing your search above and press return to search.

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పిన సజ్జన్నార్

By:  Tupaki Desk   |   7 Nov 2021 8:30 AM GMT
తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పిన సజ్జన్నార్
X
కాలానికి తగ్గట్లు వచ్చి పడ్డ మార్పులతో వడ్డనలు తప్పని పరిస్థితి. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. ప్రభుత్వానికి ఇదో తలనొప్పి వ్యవహారం. ఛార్జీల పెంపుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంటుంది. అలా అని.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ధరల్ని పెంచకుంటే నష్టాల పోటు తప్పదు. ఇటీవల కాలంలో పెరిగిన డీజిల్ ధరల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల మీద విపరీతమైన భారాన్ని మోపుతోంది. గడిచిన కొంతకాలంగా పెరగకుండా ఉన్న ఛార్జీల్ని పెంచకుంటే సంస్థ మునిగిపోయే పరిస్థితుల్లో.. సర్కారు తనకు తానుగా ఛార్జీల పెంపుపై ప్రకటన చేసేందుకు సిద్దంగా లేని పరిస్థితి.

ఇలాంటివేళలో రంగంలోకి దిగిన ఆర్టీసీ ఎండీగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జన్నార్.. బస్సు ఛార్జీలను పెంచనున్నట్లుగా చెప్పేశారు. గడిచిన రెండేళ్లలో 30 శాతానికి పైగా పెరిగిన డీజిల్ ధరల నేపథ్యంలో ఆర్టీసీపై భారం పెరుగుతోందని.. అందుకే టికెట్ రేట్లను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

అదే సమయంలో ప్రయాణికులపై ఎక్కువ భారం పడకుండా ఛార్జీల్ని పెంచే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. నల్గొండ.. మిర్యాల గూడ ఆర్టీసీ డిపోల్ని శనివారం తనిఖీ చేసిన ఆయన.. అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. దీనికి ముందు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ కు ఉదయం ఐదు గంటలకు వెళ్లిన సజ్జన్నార్.. నల్గొండకు వెళ్లే నాన్ స్టాప్ బస్సులో ఎక్కారు. సాధారణ పౌరుడి మాదిరి ప్రయాణించారు.

నల్గొండకు చేరుకున్న తర్వాత బస్టాండ్ ను.. గ్యారేజ్ ను తనిఖీ చేశారు. ప్రయాణికులతో మాట్లాడి ఆర్టీసీ బస్సుల సమయపాలన గురించి అడిగి తెలుసుకున్నారు. బస్సు సౌకర్యం కోసం తనకు ట్విటర్ లో పోస్టు చేస్తే పంపుతానని చెప్పిన ఆయన కొత్త వరాన్ని తెలంగాణ ప్రజలకు ఇచ్చారని చెప్పాలి. కరోనా రెండో వేవ్ తర్వాత ఆర్టీసీ బస్సుల్ని ప్రజలు ఆదరిస్తున్నారని.. కార్గో సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని.. త్వరలోనే రైతులకు కూడా ఈ సేవల్ని విస్తరించనున్నట్లు చెప్పారు.

రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్లకు తరలించుకోవటానికి పట్టణాల నుంచి ఎరువులు.. విత్తనాల్ని తీసుకెళ్లేందుకు కార్గో సేవల్ని వినియోగించుకోవాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు వస్తాయన్న తీపి కబురును చెప్పారు. మొత్తానికి ఆర్టీసీ ఛార్జీల పెంపు విషయాన్ని ప్రకటించేందుకు ప్రభుత్వం కిందా మీదా పడుతున్ నవేళ.. సజ్జన్నార్ ఒక అడుగు ముందుకు వేసి..ఛార్జీల ప్రకటనను తేల్చేశారని చెప్పక తప్పదు.