Begin typing your search above and press return to search.

సజ్జలకే సాక్షి షాక్

By:  Tupaki Desk   |   25 July 2021 8:30 AM GMT
సజ్జలకే సాక్షి షాక్
X
సజ్జల రామకృష్ణారెడ్డి..పరిచయం అవసరం లేని అధికారపార్టీ ముఖ్యులు. గడచిన 12 ఏళ్ళుగా వైసీపీలో కానీ ఇపుడు ప్రభుత్వంలో కానీ సజ్జల పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. అందుకనే 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించగానే సజ్జలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఇటు ప్రభుత్వ సలహదారుగా అటు వైసీపీ ప్రధాన కార్యదర్శిగా సజ్జల డబుల్ యాక్షన్ బాగానే పోషిస్తున్నారు.

అలాంటి సజ్జలకు సాక్షి మీడియా ఒక్కసారిగా షాకిచ్చింది. సలహాదారులు రాజకీయాలు మాట్లాడటం ఏమిటి ? ప్రెస్ మీట్లు పెట్టడం ఏమిటనే విషయంపై కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. గతంలో ఎప్పుడైనా సలహాదారులు మీడియా సమావేశాలు పెట్టి రాజకీయాలు మాట్లాడారా అంటు కోర్టు ఓ విచిత్రమైన ప్రశ్న వేసింది. ఈ నేపధ్యంలోనే శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన సజ్జలను సాక్షి మీడియా కేవలం వైసీపీ ప్రధాన కార్యదర్శి అని మాత్రమే ప్రస్తావించింది.

శుక్రవారం వరకు సజ్జల గురించి ఏమి రాసినా ప్రభుత్వ సలహాదారు అని రాసిన సాక్షి మీడియా ఒక్కసారిగా ప్రధాన కార్యదర్శి అని మాత్రమే సరిపెట్టడం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి సలహాదారులు రాజకీయాలు మాట్లాడకూడదని, ప్రెస్ మీట్లు పెట్టకూడదని ఎక్కడా లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో సలహాదారుగా పనిచేసిన కేవీపీ రామచంద్రరావు కేవలం హెలికాప్టర్ ప్రమాదం జరిగినపుడు మాత్రమే మీడియా సమావేశం పెట్టారని చెప్పింది.

కోర్టుకు తెలీని విషయం ఏమిటంటే మొదటినుండి కేవీపీ మీడియాకు దూరం. మీడియా మిత్రులతో పిచ్చాపాటి ఎంతసేపైనా మాట్లాడుతారు కానీ సమావేశాలు మాత్రం పెట్టరు. ఆ మీడియాలో కొంతమందితో మాత్రమే కేవీపీ సన్నిహితంగా ఉంటారంతే. ఇక చంద్రబాబునాయుడు హయాంలోని సలహాదారుల్లో పరకాల ప్రభాకర్, కుటుంబరావులు ఎన్ని వందల మీడియా సమావేశాలు పెట్టారో లేక్కేలేదు.

అంతేకాకుండా పరకాలైతే మహానాడులో పాల్గొని ఏకంగా ఓ తీర్మానాన్నే ప్రవేశపెట్టినట్లు వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. మంత్రివర్గ సమావేశాల్లో కూడా పరకాల కూర్చున్న విషయం కోర్టుకు తెలీదేమో. కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు తీవ్రంగా ఆక్షేపించిన తర్వాత క్యాబినెట్ సమావేశాలకు పరకాలను చంద్రబాబు దూరంగా ఉంచారు. సలహాదారులు మీడియా సమావేశాలు పెట్టడం అన్నది ముఖ్యమంత్రి ఇష్టంమీదుంటుంది. సీఎం ప్రెస్ మీట్లు పెట్టమంటే పెడతారు లేకపోతే మానేస్తారంతే. అంతేకానీ ప్రత్యేకించి నియమ నిబంధనలేమీ లేవు.