Begin typing your search above and press return to search.

మ‌జ్దూర్‌ క్వ‌శ్చ‌న్‌!... ఉద్యోగుల‌కు పన్నెందుకు?

By:  Tupaki Desk   |   11 Jan 2018 8:37 AM GMT
మ‌జ్దూర్‌ క్వ‌శ్చ‌న్‌!... ఉద్యోగుల‌కు పన్నెందుకు?
X
ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయాలంటే... సంప‌ద‌పై ప‌న్ను వ‌సూలు ఒక్క‌టే మార్గం. ప‌న్ను వ‌సూళ్ల ద్వారా అందే మొత్తంతోనే దేశంలో సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతో పాటుగా ప‌లు అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయి. అస‌లు ప్ర‌భుత్వం బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న మొత్తంగా ప‌న్ను రాబ‌డుల ఆధారంగా జ‌రిగేదే. స‌ర్కారీ ఖ‌జానాకు ఏ మేర‌కు ప‌న్ను వ‌స్తుంది? ఆ ప‌న్నుల ద్వారా వ‌చ్చిన మొత్తంలో ఎంత‌మేర నిధులు త‌ప్ప‌నిస‌రి వ్య‌యాల‌కు అవ‌స‌ర‌మ‌వుతాయి? త‌ప్ప‌నిస‌రి వ్య‌యాల‌కు పోగా మిగిలిన మొత్తం ఎంత‌? ఆ మిగిలిన మొత్తంతో ఎంత‌మేర సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌గ‌లం? అన్న విష‌యాల‌ను బేరీజు వేసుకునే ప్ర‌భుత్వాలు... త‌మ బ‌డ్జెట్‌ల‌ను ప్ర‌వేశ‌పెడ‌తాయి. ఆ మేర‌కే నిధుల‌ను ఖ‌ర్చు పెడ‌తాయి. అయితే ముందుగానే రూపొందించుకున్న బ‌డ్జెట్ మేర‌కు ప‌న్ను వ‌సూళ్ల‌లో ఏమాత్రం త‌రుగుద‌ల క‌నిపించినా... సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుపై తీవ్ర ప్ర‌భావమే ప‌డుతుంది. ఎందుకంటే... త‌ప్ప‌నిస‌రి వ్య‌యాల‌కు సంబంధించి మిన‌హాయింపులు ఏమాత్రం ఉండ‌వు కాబ‌ట్టి... ప‌న్ను వ‌సూళ్ల‌లో ఎంత‌మేర త‌గ్గితే... అంతమేర సంక్షేమ ప‌థకాల నిధుల‌కు కోత త‌ప్ప‌దు. ఈ మాట జ‌గ‌మెరిగిన స‌త్య‌మే అయినా... ప‌న్ను వసూళ్ల‌లో ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చాలా ప‌క్కాగా, దేశంలోని ప్ర‌తి ఒక్క‌రిని ప‌న్ను ప‌రిధిలోకి తీసుకువ‌చ్చేందుకు త‌న‌దైన శైలిలో దూసుకువెళుతున్నార‌నే చెప్పాలి.

అస‌లు దేశంలోని సంపాద‌నాప‌రులు మొత్తాన్ని ప‌న్ను ప‌రిధిలోకి తీసుకువ‌చ్చేందుకు దేశ‌మంతా వ్య‌తిరేకించినా కూడా మోదీ ఏమాత్రం వెన‌కడుగు వేయ‌కుండా పెద్ద నోట్ల ర‌ద్దు - జీఎస్టీ అమ‌లు - బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల్లో సంస్క‌ర‌ణలు త‌దిత‌ర సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ దిశ‌గా మోదీ ధైర్యంగా అడుగులు వేసేందుకు ఆయ‌న‌కు రాజ‌కీయ ఓన‌మాలు దిద్దించిన రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆరెస్సెస్‌) ద‌న్నుగా నిల‌వ‌డ‌మే కార‌ణ‌మ‌ని కూడా మ‌న‌కు తెలిసిందే. అస‌లు పెద్ద నోట్ల ర‌ద్దు లాంటి సంచ‌ల‌న ఆలోచ‌న చేసేలా మోదీని కార్యోన్ముఖుల‌ను చేసింది... ఆరెస్సెస్ నేప‌థ్య‌మున్న అనిల్ బోకిలే క‌దా. అయినా ఇప్పుడివ‌న్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వ‌చ్చిందంటే... ఏ ఆరెస్సెస్ అయితే సంపాద‌నాప‌రులంద‌రినీ ప‌న్ను ప‌రిధిలోకి తీసుకురావాల‌ని మోదీకి దిశానిర్దేశం చేసిందో... ఆదే ఆరెస్సెస్ ఇప్పుడు ఉద్యోగుల‌పై ప‌న్ను విధించ‌డ‌మెందుక‌ని ప్ర‌శ్నించింది. నిజ‌మా? అంటే.. నిజ‌మే. అయితే నేరుగా ఆరెస్సెస్ నేత‌ల నోట నుంచి ఈ మాట వినిపించ‌లేదు గానీ... ఆరెస్సెస్ అనుబంధ సంఘంగా ఉన్న భార‌తీయ మ‌జ్దూర్ సంఘ్ నోట ఈ మాట వినిపించింది.

ఉద్యోగులు ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని, అయినా సేవ‌లు చేస్తున్న ఉద్యోగుల మీద ప‌న్ను ఎలా వేస్తార‌ని కూడా మ‌జ్దూర్ సంఘ్ కాస్తంత ఘాటుగానే ప్ర‌శ్న‌లు సంధించింది. ప్ర‌ధాని మోదీ స‌హా యావ‌త్తు బీజేపీ నేత‌ల‌ను, త‌న మాతృ సంస్థ అయిన ఆరెస్సెస్ నేత‌ల‌ను షాక్‌కు గురి చేసేలా మ‌జ్దూర్ సంఘ్ చేసిన వ్యాఖ్య‌ల విష‌యానికి వ‌స్తే... ఉద్యోగుల‌పై విధిస్తున్న ప‌న్నుల‌ను ప్ర‌స్తావిస్తూ సంఘ్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - లేబ‌ర్ యూనియ‌న్ చీఫ్ అయిన బ్రిజేశ్ ఉపాధ్యాయ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అస‌లు ఇప్పుడు ఉద్యోగులుగా ఉన్న ఏ ఒక్క‌రు కూడా ప‌న్ను చెల్లించాల‌ని అనుకోవ‌డం లేద‌ని వ్యాఖ్యానించిన ఆయ‌న‌... వారి భావ‌న స‌రైన‌దేన‌ని స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డంతో పాటుగా వారి వాద‌న‌లో ఎంత‌మేర వాస్త‌వ‌ముంద‌న్న విష‌యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చెప్పారు.

ఉపాధ్యాయ్ అస‌లు ఏమ‌ని వ్యాఖ్యానించారంటే... *దేశంలోని ఏ ఒక్క ఉద్యోగి కూడా ట్యాక్స్ చెల్లించాల‌ని అనుకోరు. మన దేశంలో నియమనిబంధనలు ఉద్యోగ వర్గం ట్యాక్సులు చెల్లించాలని చెబుతున్నాయి. కానీ, అలా జరగకూడదు. వ్యాపార వేత్తలు సంపాధించే ఆదాయం మాత్రమే పన్ను పరిధిలోకి వస్తుంది. సేవలు చేస్తున్నందుకు ప్రతిఫలంగా పొందుతున్న జీతభత్యాలపై ఎట్టి పరిస్థితుల్లో పన్ను విధించరాదు. భారత్‌లోని చాలామంది శ్రామికులు పేదవారు. అలాంటివారిపై అంతపెద్ద మొత్తంలో పన్ను విధిస్తే వాళ్లు ఎలా చెల్లిస్తారు. ఏం పొదుపు చేసుకుంటారు? దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లయింది. ఇప్పటి వరకు ఉపాధి విధానమే లేదు. పారిశ్రామిక విధానం మాత్రం ఇప్పటికే మూడుసార్లు చేశారు.. కానీ, ఉపాధి విధానంలో మాత్రం నిర్ణయమే లేదు. ఈ రోజు దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగ‌మే. అందుకు కారణం మనకు ఉపాధి విధానమే లేకుండా పోయింది. ఏ ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచన చేసిన పాపాన పోలేదు' అని ఉపాధ్యాయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మ‌రి ఈ మాట‌ల‌పై మోదీ ఏమంటారో చూడాలి.