Begin typing your search above and press return to search.

దేవుళ్లును కించ‌ప‌రిచిన ఎంపీ తీరుతో ర‌చ్చ‌ర‌చ్చ‌

By:  Tupaki Desk   |   20 July 2017 5:06 AM GMT
దేవుళ్లును కించ‌ప‌రిచిన ఎంపీ తీరుతో ర‌చ్చ‌ర‌చ్చ‌
X
గోరక్షణ పేరిట దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులు - రైతుల సమస్యలపై బుధవారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రతిపక్ష సభ్యులు గోరక్షణ పేరిట జరుగుతున్న దాడులను రాజ్యసభలో - రైతుల సమస్యలను లోక్‌ సభలో ప్రస్తావించారు. గోవధపై చర్చ సందర్భంగా సమాజ్‌ వాది పార్టీ నేత నరేశ్ అగర్వాల్ హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బుధవారం రాజ్యసభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. తక్షణమే అగర్వాల్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ - ఇతర ఎన్డీయే సభ్యులు డిమాండ్‌ చేశారు. వెల్‌ లోకి దూసుకొచ్చి ఎస్పీ నేతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అగర్వాల్ తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవడంతోపాటు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉన్నాయని విమర్శించారు. అగర్వాల్ అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని, వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ అన్నారు. సభ రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించాలని ఆదేశించారు.

లోక్‌ సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ వెల్‌ లోకి దూసుకెళ్లారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సభ్యులతోపాటు తృణమూల్ - వామపక్షాలు - ఆర్జేడీ సభ్యులు గందరగోళం సృష్టించడంతో దాదాపు గంటపాటు సభ వాయిదా పడింది. రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తున్నదంటూ విపక్ష సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. బీజేపీ మిత్రపక్షమైన స్వాభిమానీ పక్ష ఎంపీ రాజు శెట్టి సైతం రైతుల సమస్యలపై ప్రభుత్వంతో విభేదించారు. వాయిదా అనంతరం సభ సమావేశమైన వెంటనే కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే మరోసారి ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని, వారి పెట్టుబడి ఖర్చుల కన్నా 50 శాతం అధికంగా చెల్లిస్తామన్న వాగ్దానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌ కుమార్ మాట్లాడుతూ, మోడీ సర్కార్‌ ను మించిన విధంగా ఏ ప్రభుత్వమూ రైతుల సమస్యలను పరిష్కరించలేదని అన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, అన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తామని చెప్పారు.

గోరక్షణ పేరిట జరుగుతున్న హత్యలు - దాడులపై ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. అటువంటి ఘటనలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు సంపూర్ణ అధికారాలున్నాయని, చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందని విపక్ష సభ్యులు వెల్‌ లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ హమీద్ అన్సారీ సభను 10 నిమిషాలపాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన వెంటనే మంత్రి హన్స్‌ రాజ్ గంగారాం మాట్లాడుతూ, గోరక్షణ దాడుల వెనుక బీజేపీ సభ్యులున్నారన్న ఆరోపణను తిరస్కరించారు. దాడులకు పాల్పడిన వారెవరైనా సరే చర్య తీసుకోవాలని కేంద్రం ఇప్పటికే రాష్ర్టాలకు సూచించిందని తెలిపారు. ప్రధాని కూడా గోరక్షణ పేరిట జరుగుతున్న దాడులను ఖండించారని గుర్తు చేశారు. 24 రాష్ర్టాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాలు గోవధను నిషేధించాయని చెప్పారు. ఇంతవరకు దాడులకు పాల్పడిన వారిని ఎవరినీ విడిచిపెట్టలేదని చెప్పారు. బీజేపీ అధికారంలో లేని రాష్ర్టాల్లో సైతం దాడులు జరుగుతున్నాయని మంత్రి అన్నారు.