Begin typing your search above and press return to search.

డీజీపీ సాంబశివ‌రావు ప‌ద‌వీకాలం పొడిగింపు?

By:  Tupaki Desk   |   18 Oct 2017 10:32 AM GMT
డీజీపీ సాంబశివ‌రావు ప‌ద‌వీకాలం పొడిగింపు?
X
ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా విధులు నిర్వ‌ర్తిస్తున్న నండూరి సాంబశివరావును కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్ర‌కారం కేంద్ర హోంశాఖకు ప‌ద‌వీకాలం పొడ‌గింపునకు సంబంధించి కేంద్రానికి ప్ర‌తిపాద‌న‌లు వెళ్లనున్నాయి. కేంద్రానికి....సీఎం కార్యాలయం నుంచి ప్రతిపాదనలు పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2017 డిసెంబర్ తో సాంబశివరావు పదవీ కాలం ముగియ‌నుంది. ప్రస్తుతానికి ఇన్‌ చార్జి డీజీపీ గానే కొనసాగుతున్న సాంబ‌శివ‌రావు ప‌ద‌వీ కాలం పొడిగింపుపై కొంత కాలంగా చర్చ జరుగుతోంది. త‌న హ‌యాంలో రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వహించిన‌ సాంబశివరావుకు చాలామంది మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. ఆయ‌న‌ను డీజీపీగా కొనసాగించాలని పలువురు ప్రభుత్వ పెద్దలు ఏక‌గ్రీవ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

సీఎం చంద్ర‌బాబు విదేశీ పర్యటనకు వెళ్ల‌నున్నందున పెండింగ్ అంశాలపై చర్చ జ‌రిగింది. ఆ చ‌ర్చ‌లో డీజీపీ పదవీ కాలం పొడిగింపు అంశం కూడా చర్చకు వచ్చింది. సాంబ‌శివ‌రావు ప‌దవీకాలం ముగియ‌నుండ‌డంతో చాలామంది ఆశావ‌హులు డీజీపీ ప‌ద‌వి చేప‌ట్టేందుకు ఉత్సాహం చూపుతున్న‌ట్లు స‌మాచారం. అయితే, ఇతర అధికారుల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా సాంబశివరావు వైపే చంద్ర‌బాబు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. త‌న ప‌ద‌వీకాలంలో డీజీపీ పనితీరు - స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ఆయ‌న చూపిన చొరవ‌ - రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు - సామాజిక వ‌ర్గ‌ కోణం వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న సీఎం.... సాంబశివరావునే కొన‌సాగించాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే సాంబ‌శివ‌రావు పదవీకాలాన్ని పొడ‌గించాల‌ని కోరుతూ కోరుతూ కేంద్ర హోంశాఖ - యూపీఎస్సీలకు ఫైల్ పంపించాలని అధికారుల‌ను సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.