Begin typing your search above and press return to search.

టీ సీపీఐకి ఆంధ్రా నేపథ్య కార్యదర్శి.. ఏళ్ల తర్వాత పోటీ.. ఎన్నో ప్రత్యేకతలు

By:  Tupaki Desk   |   9 Sep 2022 12:40 PM GMT
టీ సీపీఐకి ఆంధ్రా నేపథ్య కార్యదర్శి.. ఏళ్ల తర్వాత పోటీ.. ఎన్నో ప్రత్యేకతలు
X
తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శిగా కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. చాలా ఏళ్ల తర్వాత సీపీఐలో రాష్ట్ర కార్యదర్శి పదవికి ఎన్నికలు జరగ్గా కూనంనేని విజయం సాధించారు. దీంతో ఆయన తెలంగాణ సీపీఐకి కొత్త కార్యదర్శి కాబోతున్నారు. సాంబశివరావుది ఉమ్మడి ఖమ్మం జిల్లా (ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం) కొత్తగూడెంగా పేర్కొంటున్నా.. ఆయన పూర్వీకులది ఏపీలోని గుంటూరు జిల్లా. అక్కడినుంచి వీరి కుటుంబం కొత్తగూడెం వచ్చింది.

కూనంనేని విశాలాంధ్ర పత్రికకు జర్నలిస్టుగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకుని వామపక్ష భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చారు. సాంబశివరావు 1984లోనే కొత్తగూడెం పట్టణ సీపీఐ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1987లో కొత్తగూడెం ఎంపీపీగానూ గెలిచారు. 2005లో ఉమ్మడి ఖమ్మం జిల్లా సీపీఐ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఎమ్మెల్యేగా గెలవలేదు. 2009 ఎన్నికల్లో మూడో ప్రయత్నంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

పోటీ తప్పలే..

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పదవికి గురువారం జరిగిన ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయని అంతా భావించారు. కానీ, కూనంనేనికి తోడు పల్లా వెంకటరెడ్డి పోటీ పడ్డారు. జాతీయ కమిటీ.. ఈ పోటీని ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో ఎన్నిక తప్పలేదు. బుధవారం అర్థరాత్రి దాటాక శంషాబాద్ లోని తెలంగాణ సీపీఐ 3వ మహాసభ ప్రాంగణంలో జరిగిన ఎన్నికల్లో పల్లా వెంకటరెడ్డిపై కూనంనేని 14 ఓట్లతో గెలిచారు. వెంకటరెడ్డికి 110 ఓట్లకు గాను (109 పోలయ్యాయి).. 45 ఓట్లు పడ్డాయి. 5 చెల్లలేదు. కూనంనేనికి 59 ఓట్లు పడ్డాయి. అలా సాంబశివరావు సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

తెలంగాణ ఉదమ్యంతో తనదైన పాత్ర

కూనంనేని 2009లో ఎమ్మెల్యేగా గెలిచాక జరిగిన పరిణామాల్లో తెలంగాణ ఉద్యమం తీవ్రమైంది. ఆంధ్రా నేపథ్యం ఉన్న వ్యక్తి అయినప్పటికీ.. ఆ ఉద్యమంలో ప్రజల ఆకాంక్షకు తగ్గట్లు సాంబశివరావు నడుచుకున్నారు. సీపీఐ కూడా తెలంగాణకు అనుకూలంగా వైఖరి తీసుకోవడంతో దానిని ప్రజల్లోకి మరింత ముందుకుతీసుకెళ్లారు. ఏడు రోజుల పాటు ఆమరణ దీక్ష చేపట్టడంతో పాటు ఉద్యమ వ్వాప్తికి 450 కి.మీ. పాదయాత్ర కూడా చేపట్టారు.

ఎన్నికలో ప్రత్యేకతలెన్నో..?

తెలంగాణ సీపీఐకి సారథి ఎవరనేదేదానిపై ఎన్నిక అనివార్యం ఓ విశేషమైతే.. ఆంధ్రా నేపథ్యం ఉన్నప్పటికీ కరుడుగట్టిన తెలంగాణవాది కూనంనేని కార్యదర్శి కావడం మరో విశేషం. ఇక ప్రస్తుతం సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తమ్మినేని వీరభద్రం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లావారే. కూనంనేని కొత్తగూడెం వాసి. ఇద్దరూ ఒక దఫా ఎమ్మెల్యేలుగా పనిచేశారు.

వీరభద్రం ఎంపీగానూ పనిచేశారు. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం. మరోవైపు కొత్తగూడెం వంటి తెలంగాణ వాదం ఉన్న ప్రాంతం నుంచి కూనంనేని ఓ సారి గెలిచారు. అంతేకాదు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం కొత్తగూడెం. ఇక్కడినుంచి మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు వెంకట్రావు నాడు ఎమ్మెల్యేగా నెగ్గారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.