Begin typing your search above and press return to search.

క‌ద‌ల‌ని ఓట‌రు.. యూపీలో మ‌ళ్లీ అదే సీన్‌

By:  Tupaki Desk   |   4 March 2022 10:30 AM GMT
క‌ద‌ల‌ని ఓట‌రు.. యూపీలో మ‌ళ్లీ అదే సీన్‌
X
ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌ల‌కు ఉన్న అతి పెద్ద ఆయుధం ఓటు. త‌మ‌ను పాలించే నాయ‌కుల‌ను ఎన్నుకునే అవ‌కాశం జ‌నాల‌కు ఉంది. కానీ ఎన్నో అవగాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినా.. చైతన్యం తెచ్చే ప్రోగ్రామ్‌లో చేసినా.. ఓట‌ర్ల‌లో మాత్రం మార్పు రావ‌డం లేదు. యూపీలో మ‌ళ్లీ గ‌త ఎన్నిక‌ల సీనే రిపీట్ అవుతోంది. బ‌ద్ద‌కం వ‌ద‌ల‌ని ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు ముందుకు రావ‌డం లేదు. దీంతో 2017 ఎన్నిక‌ల్లో న‌మోదైన పోలింగ్ శాతానికి కాస్త అటూఇటూగా ఈ సారి కూడా అంతే న‌మోద‌య్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టికే ఆరు ద‌శ‌ల పోలింగ్ పూర్త‌యింది. ఇంకో ద‌శ మిగిలి ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ఆరు ద‌శల ఎన్నిక‌ల‌ను గ‌మ‌నిస్తే పోలింగ్ శాతం గ‌త ఎన్నిక‌ల శాతానికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇంకా కొన్ని చోట్ల గ‌తం కంటే కూడా ఈ సారి త‌గ్గింది. అయిదేళ్ల‌లో ఓట‌ర్ల వైఖ‌రిలో ఎలాంటి మార్పు రాలేద‌నే విష‌యం దీంతో స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఆరో ద‌శ ఎన్నిక‌ల్లో 55 శాతం పోలింగ్ న‌మోదైంది. 2017లో ఇవే ప్రాంతాల్లో న‌మోదైన పోలింగ్ (56.52) శాతం కంటే ఇది త‌క్కువ‌గా ఉండ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం.

అంతే కాకుండా గ‌త అయిదు ద‌శ‌ల ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే 2017లో పోలింగ్ శాతం కంటే 0.3 శాతం త‌గ్గ‌డం గ‌మ‌నార్హం. పోలింగ్ శాతం పెర‌గ‌క‌పోగా.. స్వ‌ల్పంగా త‌గ్గ‌డం ఓట‌ర్ల నిర్ల‌క్ష్య వైఖ‌రిని అద్దం ప‌డుతోంది. మొద‌టి రెండు ద‌శ‌ల్లో పోలింగ్ శాతం గ‌తం కంటే త‌క్కువ‌గానే న‌మోదైంది. మూడు నుంచి అయిదు ద‌శ‌ల్లో కాస్త పెరిగినా అది అత్యంత స్వ‌ల్ప‌మే. మ‌రోవైపు పంజాబ్‌లో ఈ సారి 6 శాతం పోలింగ్ తగ్గింది. గోవాలో మూడు శాతం త‌గ్గింది. ఉత్త‌రాఖండ్‌లో మాత్రం 2017తో పోలిస్తే కాస్త పెరిగింది. ఇప్ప‌టివ‌రకూ అయిదు రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే స‌గ‌టు పోలింగ్ శాతం 62.09గా ఉంది. 2017తో పోలిస్తే ఈ సారి కూడా అదే స‌గ‌టుకు ద‌గ్గ‌ర‌గా ఉంది.

మారిన రాజ‌కీయ ప‌రిణామాల‌తో పాటు కొవిడ్ ప‌రిస్థితులు కూడా పోలింగ్ శాతం పెర‌గ‌క‌పోవ‌డానికి కార‌ణం కావొచ్చ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇక ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల కోసం ఎన్నిక‌ల సంఘం ఓట‌ర్ ట‌ర్న్ అవుట్ యాప్‌లో గ‌ణాంకాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటోంది. ఈ యాప్‌లో రిట‌ర్నింగ్ అధికారులు వివ‌రాలు న‌మోదు చేసిన త‌ర్వాత పోలింగ్ శాతం చూపిస్తోంది. అయితే మారుమూల ప్రాంతాల్లో, అట‌వీ, కొండ ప్రాంతాల్లో తుది పోలింగ్ శాతాలు అప్‌డేట్ కావాలంటే ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌ని స‌మాచారం.