Begin typing your search above and press return to search.

సేమ్ సీన్ రిపీట్.. హైదరాబాద్ ఫ్లై ఓవర్ మీద నుంచి మళ్లీ పడిన కారు

By:  Tupaki Desk   |   23 Nov 2019 2:20 PM GMT
సేమ్ సీన్ రిపీట్.. హైదరాబాద్ ఫ్లై ఓవర్ మీద నుంచి మళ్లీ పడిన కారు
X
హైదరాబాద్ లో మరో దారుణ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవలే ప్రారంభించిన బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పైనుంచి ఒక కారు కింద పడిన ఉదంతం లో ఒకరు మరణించగా.. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయ పడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉదంతం లో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దాదాపు కిలోమీటర్ కంటే తక్కువ నిడివి ఉన్న ఈ ఫ్లైఓవర్ ప్రత్యేకత ఏమంటే.. హైదరాబాద్ లో ఉన్న ఫ్లైఓవర్ల కంటే ఎత్తులో ఉన్నది. రెండు వరుసల్లో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ మలుపు ప్రమాదకరంతో పాటు.. డిజైన్ పరంగా లోపం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మూడు వారాల క్రితం ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. ప్రజల అందుబాటులోకి వచ్చిన వారంలోనే వరుస ప్రమాదాలు చోటు చేసుకోవటంతో.. అర్థరాత్రి వేళలో ఈ ఫ్లైఓవర్ మీద వాహనాల రాకపోకల్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జరిగిన ఘోరాన్ని చూస్తే.. ఫ్లైఓవర్ మీద కారు వేగంగా వెళ్లటం.. అదుపు తప్పిన కారు ఫ్లై ఓవర్ మీద నుంచి కింద కు పడిపోయిన పరిస్థితి.

కారు వేగంగా వెళ్లటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ పేర్కొన్నారు. ఈ దారుణ ఘటన చోటు చేసుకున్న వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదాన్ని పరిశీలించారు. బ్యాడ్ లక్ ఏమంటే.. తాజా ప్రమాదం లో ఫ్లై ఓవర్ మీద నుంచి కారు కింద పడిన వేళలో.. సరిగ్గా దాని కిందనే ఆటో కోసం వెయిట్ చేస్తున్న మహిళ మీద కారు పడటం తో ఆమె అక్కడికక్కడే మరణించారు.

ఇటీవల ఈ వంతెన మీద నిలబడి ఇద్దరు యువకులు సెల్ఫీలు దిగుతున్న వేళ.. వేగంగా వచ్చిన కారు వారిని ఢీ కొట్టిన కారణంగా ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. హైదరాబాద్ లోని మరే ఫ్లైఓవర్ మీద జరగనన్ని ప్రమాదాలు ఈ కొత్త ఫ్లైఓవర్ మీద చోటు చేసుకోవటం గమనార్హం. డిజైన్ లోపంతో పాటు.. ఇంజనీరింగ్ లోపం కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. దీని పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కారు పై నుంచి పడిన సమయం లో కింద ఉన్న వ్యక్తులు పలువురు ప్రమాదానికి గురి కాగా.. వాహనాలు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.