Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో కల్లోలం..జానాపై నిప్పులు

By:  Tupaki Desk   |   26 March 2017 8:05 AM GMT
కాంగ్రెస్ లో కల్లోలం..జానాపై నిప్పులు
X
తెలంగాణలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీలో మరో క‌ల‌కలం చోటు చేసుకుంది. సంపత్‌కుమార్‌ నల్ల కండువా ధరించి అసెంబ్లీకి రావడం చర్చనీయాంశమైంది. సీఎల్పీ విప్‌ పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. దళితుడినైన తనను పార్టీలోని వారే తక్కువ చూపు చూస్తున్నారని ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. ప్రధానంగా సీఎల్పీనేత జానారెడ్డిపైనే సంపత్‌ గురిపెట్టారు. ఆయన‌ను ఉద్దేశించి పరోక్షంగా ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో సంక్షేమం పద్దుపై మాట్లాడతుంటే ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ అడ్డు తగులుతున్నా ప్రతిపక్షనేతగా ఉన్న జానారెడ్డి జోక్యం చేసుకోలేదన్నది సంపత్ వ్యాఖ్యానించారు. మరో ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి పైనే పరోక్ష విమర్శలు చేశారు. కానీ ఎక్కువ సమయం మాట్లాడింది సంపత్‌ అని ఆ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

అయితే శుక్రవారం రాత్రివరకు చర్చల్లో పాల్గొన్న సంపత్‌ శనివారం ఉదయం కల్లా సీఎల్పీ నాయకత్వంపైనే విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. పార్టీలో సొంత ఇమేజ్‌ కోసం ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా? లేక ఆయన పార్టీ మారి టీఆర్‌ఎస్‌ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా? అనే కోణంలోనూ చర్చ జరుగుతున్నది. గతంలో ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రస్తావించగా కాంగ్రెస్‌ పార్టీకి ఒక సైనికుడిలా ఉంటానని చెప్పారు. ఇదిలా ఉండగా పార్టీ మారాలంటూ అధికార పార్టీ ఆయనపై ఒత్తిడి పెంచినట్టు తెలిసింది. పార్టీ మారతారనే స్పష్టమైన సంకేతాలు లేకపోయినా...ఒక దళిత ఎమ్మెల్యేగా పార్టీ పక్షాన ఫోకస్‌ కావాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని మరికొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. తనకు తానుగా ఫోకస్‌ అయి పార్టీలో మరింత గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నారా? లేక పార్టీ మారడానికి ముందు పార్టీపై ఆయన అనేక విమర్శలు చేసి జారుకుంటారా? అనేది తేలాల్సి ఉంది.

వచ్చే నెల 21న వరంగల్‌ లో జరగ నున్న టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో చేరేందుకు సంపత్‌ రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు మరో రకమైన ప్రచారం జరుగుతున్నది. తొలి నుంచి ప్రతిపక్ష నేత జానారెడ్డి పనితీరు పట్ల ఒకరిద్దరు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆయనపై సంపత్‌ అసంతృప్తిగానే ఉంటూ వస్తున్నారు. తనపై పనిగట్టుకుని ప్రచారం చేసేది ఎవరనేది కూడా తెలుసునని జానారెడ్డి మీడియాకు తెలియజేశారు. కాకపోతే ఆ వ్యక్తి ఎవరనేది పేరు బయటకు చెప్పలేదు. సభలో అధికార పార్టీ ప్రదర్శించిన తీరుకు నిరసనగా నల్లకండువా ప్రదర్శించారని ఆ పార్టీ ఎమ్మెల్యే పద్మావతి చెప్పారు. నల్లకండువా ప్రదర్శించడం, జానాపై పరోక్ష విమర్శలు చేయడంతో పార్టీపై తప్పుడు సంకేతాలు పోతాయని ఆ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జి చిన్నారెడ్డి రంగంలోకి దిగారు. సంపత్‌ను బుజ్జగించారు. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని జానాతో సంప్రదింపులు జరిగేలా చూస్తామని అప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/