Begin typing your search above and press return to search.

సంచయిత.. పుచ్చుకున్న వాయినం... ?

By:  Tupaki Desk   |   21 Oct 2021 2:30 AM GMT
సంచయిత.. పుచ్చుకున్న వాయినం... ?
X
రాజుల కోటలో రాచ మర్యాదలు బాగానే ఉంటాయి. వారికి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం కలిగినా ఒక రేంజిలో ఉంటుందనే చెబుతారు. ఇవన్నీ ఎందుకంటే విజయనగరం పూసపాటి వారి మూడవతరం వారసురాలిగా ఒక్కసారిగా తెర‌ ముందుకు వచ్చిన సంచయితకు ఇపుడు బాబాయ్ అశోక్ గజపతిరాజు తనదైన శైలిలో గట్టి రిటార్ట్ ఇచ్చేశారు అని చెప్పడానికే. గత ఏడాది ఇచ్చునమ్మ వాయనం అని సంచయిత బాబాయ్ అశోక్ సహా సవతి తల్లి, చెల్లెలుకు తనదైన శైలిలో గట్టి రిటార్ట్ ఇస్తే సరిగ్గా ఈ ఏడాది పుచ్చుకున్న వాయినం అని సంచయిత చేత అనిపించేశారు అశోక్ రాజా వారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా 2020 మార్చిలో నియమితురాలు అయిన సంచయిత అదే ఏడాది మొత్తం తన హవా చూపించారు. ఆమె పూసపాటి వారి ఆలయాలకు ధర్మకర్తగా వ్యవహరించారు. గత ఏడాది విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి ఉత్సవాల సందర్భంగా సంచయిత చూపించిన దర్జా ఇపుడు జనాలలో చర్చకు వస్తోంది.

ఆమె పైడితల్లి అమ్మవారి ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తగా ఒక రేంజిలో వెలిగిపోయారు. తనతో పాటు మరెవరికీ అవకాశం ఇవ్వకుండా విజయనగరంలోని రాజు గారి కోట బురుజు మీద ఉచితాసనం మీద ఆశీనురాలై ఉత్తరాంధ్రా జిల్లాల కల్పతల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలను తిలకించారు. ఆ టైమ్ లో ఆమె తన తండ్రి ఆనందగజపతిరాజు రెండవ భార సుధా గజపతిరాజుతో పాటు, ఆమె కుమార్తె ఊర్మిలా గజపతిరాజులను కూడా కోట బురుజు వద్ద ముందు వరసలో కూర్చోనీయకుండా అవమానించారు అన్న వార్తలు కూడా వచ్చాయి. అలాగే బాబాయి అశోక్ కుటుంబాన్ని కూడా ఉత్సవాల వేళ సరిగ్గా ఆహ్వానించలేదు అన్న విమర్శలు వినిపించాయి.

సరిగ్గా ఏడాది తరువాత మళ్ళీ పైడితల్లమ్మ వారి సిరిమాను ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అయితే ఈసారికి సంచయిత గజపతిరాజు మాజీ చైర్మన్ అయ్యారు. కోర్టు ఉత్తర్వులతో అశోక్ మళ్లీ చైర్మన్ అయ్యారు. ఆయన యధా ప్రకారం కోట బురుజు మీద పూసపాటి వారి పెద్దగా ఆసీనులై ఉత్సవాన్ని ఆసాంతం తిలకించారు. అలాగే ఆనందగజపతిరాజు రెండవ భార్య, కుమార్తె కూడా కోట బురుజులో తమకు కేటాయించిన ఆసనాలలో కూర్చుని సంబరాలు తిలకించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో కనిపించని వారు ఎవరూ అంటే అచ్చంగా సంచయిత మాత్రమే. ఆమెను ఈ ఉత్సవాలకు ఎవరూ కనీసం పిలవలేదుట. దాంతో మనస్తాపానికి గురైన ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు. పైడితల్లి అమ్మ ఆశీస్సులు తనకు నిండుగా ఉన్నాయని కూడా సర్దిచెప్పుకున్నారు. మొత్తానికి ఈ పరిణామాలను చూసిన వారు విజయనగరం రాజుల గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.