Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల మధ్య మరో పంచాయితీ

By:  Tupaki Desk   |   16 May 2020 9:50 AM GMT
తెలుగు రాష్ట్రాల మధ్య మరో పంచాయితీ
X
ఇన్నాళ్లు అన్నాదమ్ముల వలే ఆప్యాయంగా ఉన్న తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య జల పంచాయితీతో విభేదాలొచ్చాయి. శ్రీశైలం ప్రాజెక్టునుంచి రాయలసీమకు నీటి ఎత్తిపోతలపై తెలంగాణ భగ్గుమనడం.. ఏపీ తమ హక్కు అనడంతో పంచాయితీ ముదిరింది.

ఈ వివాదం కొనసాగుతుండగానే.. తుంగాభద్ర నదిలో ఇసుక తవ్వకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం చెలరేగింది. తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలపై అంతర్రాష్ట్ర సరిహద్దు అంశంలో వివాదం చెలరేగింది. ఇరు రాష్ట్రాల మధ్య మరో పంచాయితీకి తెరతీసింది.

సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి గాను ఏపీ ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కర్నూలు జిల్లా మైనింగ్ అధికారులు ఆ జిల్లాలోని శ్రావణ బెలగొళ మండలం గుండ్రేవుల వద్ద తుంగభద్ర నదిలో ఇసుకను తరలించడానికి వాహనాలు పంపారు. అక్కడే ఏపీ ఇసుక రీచ్ ఏర్పాటు చేశారు.

అయితే ఇటువైపున తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం చిన్న ధన్వాడ గ్రామస్థులు దీనిపై ఆందోళన చేశారు. తమ గ్రామ పరిధిలోకి వచ్చి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఆందోళనకు దిగారు. తెలంగాణ సరిహద్దు వరకు ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ధన్వాడ గ్రామస్థులు తెలంగాణ పోలీసులు.. మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ అధికారులు గుండ్రేవుల రీచ్ వద్ద ఇసుక తవ్వకాలకు వెళ్లిన వాహనాలను సీజ్ చేశారు. వాహనాలను తెలంగాణకు తరలించారు.

ఈ వివాదం చెలరేగడంతో ఏపీ అధికారులు తెలంగాణ అధికారులతో చర్చించారు. తమ పరిధిలోనే తవ్వకాలు చేస్తున్నామని విడుదల చేయాలని కోరారు.అయితే తెలంగాణ అధికారులు ససేమిరా అనడంతో ఇరు రాష్ట్రాల అధికారులు గుండ్రేవుల రీచ్ ను పరిశీలించారు. దీంతో ఇరు రాష్ట్రాల సరిహద్దులను గుర్తించేందుకు అధికారులు సర్వే చేశారు. సోమవారం జరగనున్న సర్వేతోనైనా ఈ సరిహద్దు వివాదం సద్దుమణిగి ఇరు రాష్ట్రాల మధ్య పంచాయితీ తగ్గుతుందో చూడాలి.