Begin typing your search above and press return to search.

మ‌ట్టి మాఫియా - సొంత నేతలు రేపిన వివాదం

By:  Tupaki Desk   |   30 May 2022 6:30 AM GMT
మ‌ట్టి మాఫియా - సొంత నేతలు రేపిన వివాదం
X
మ‌రో వివాదం లో జ‌గ‌న్ స‌ర్కారు చిక్కుకుంది. జ‌గ‌న‌న్న కాల‌నీల పేరిట నిర్మాణాలు చేప‌ట్టాలంటే ముందుగా రోడ్లు వేయాలి అంటే మ‌ట్టి కావాలి. కానీ మట్టి మాఫియా చేతిలో ఉంది. కొనుగోలు శ‌క్తి ఉన్న‌వాళ్ల‌కే అది చేరుతుంది. దాంతో నిర్మాణాలు ఆగిపోతున్నా యి. వైసీపీ ప్ర‌భుత్వం సంక‌ల్పం కాస్త నీరుగారిపోతోంది.

ఈ మాట‌లు విప‌క్షం నుంచి కాదు స్వ‌ప‌క్షంలో ఉన్న పెద్ద‌లే చెబుతూ, వాస్త‌విక స్థితిని వివ‌రిస్తూ, జ‌గ‌న్ కు ఫిర్యాదులు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. పేరు బెజ‌వాడ రాజ‌కీయం అయినా కూడా నిజాల‌ లోతు తెలుసుకుంటే ప్ర‌భుత్వానికే మేలు.

ఇప్ప‌టిదాకా ఇసుక మాఫియా ఎలా ఉందో ఏం చేసిందో అంద‌రికీ తెలిసిందే ! ఇప్పుడిక మ‌ట్టి మాఫియా వంతు వ‌చ్చింది. దీనిపై బెజ‌వాడ వైసీపీ పెద్ద‌లే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు త‌క్ష‌ణం జోక్యం చేసుకోవాల‌ని కోరుతున్నారు. గ్రామాల్లో మ‌ట్టి అక్ర‌మ త‌వ్వ‌కాల‌పై దృష్టి సారించాల్సిన త‌హ‌శీల్దారు కార్యాల‌య వ‌ర్గాలు చోద్యం చూస్తున్నాయ‌ని ఆరోపిస్తూ, ముఖ్య‌మంత్రి వ‌ర‌కూ ఈ విష‌యాన్ని తీసుకుని వెళ్లాల‌ని భావిస్తున్నారు కొంద‌రు.

వైసీపీలో నెల‌కొన్న అసంతృప్తి కార‌ణంగా చాలా విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నందున ఇది కూడా అలాంటిదేనని, అయితే దీని వెనుక వాస్త‌వాలు గుర్తిస్తే కొంత‌లో కొంత ఆరోప‌ణ‌ల్లో ఉన్న నిజానిజాలు తెలిసి వ‌స్తాయ‌ని వైసీపీ వ‌ర్గాలే అంటున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌ట్టి మాఫియాను ఎలా నిలువ‌రిస్తారు?

గన్న‌వ‌రం పొలిటిక‌ల్ హీట్ లో భాగంగానే దుట్టా రామ‌చంద్ర‌రావు అనే లీడ‌ర్ ఈ మ‌ట్టి మాఫియాను వెలుగులోకి తెచ్చారు. గ్రామాల్లో ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌లు నిర్మాణాలు చేప‌డుతున్నందున ప్ర‌స్తుతం మ‌ట్టికి ఉన్న డిమాండ్ రీత్యా మాఫియా రెచ్చిపోతోంద‌ని అంటోంది దుట్టా వ‌ర్గం.

ఉచితంగా మ‌ట్టి త‌ర‌లించేందుకు అవ‌కాశాలే లేకుండాపోతున్నాయ‌ని, దాంతో నిర్మాణపు ప‌నులు ఆర్థికంగా భారంగానే మారుతున్నాయ‌ని అంటున్నారు. ఇదే మ‌ట్టి మాఫియా ఒక్క విజ‌య‌వాడ‌లోనే కాదు విశాఖ‌లోనూ రెచ్చిపోయి రంకెలేస్తోంది. రుషి కొండ చుట్టూ మ‌ట్టి మాఫియా ఆగ‌డాలు మామూలుగా లేవు. వీటిపై దృష్టి సారించాల్సిన స‌ర్కారు పెద్ద‌గా స‌మ‌స్య‌ను సీరియ‌స్ గా తీసుకోవ‌డం లేదు.