Begin typing your search above and press return to search.

ఇసుక వార్: ఆఖరుకు పిల్లలను అడ్డుకున్న గ్రామస్థులు

By:  Tupaki Desk   |   22 Feb 2022 11:31 AM GMT
ఇసుక వార్: ఆఖరుకు పిల్లలను అడ్డుకున్న గ్రామస్థులు
X
రెండు గ్రామాల మధ్య మొదలైన ఇసుక వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. ఆఖరుకు బడికి వెళ్లే పిల్లలను సైతం రోడ్డుపైనే నిలబెట్టిన పరిస్థితికి దిగజారింది. ఈ ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో చోటుచేసుకుంది. ఇరు గ్రామాల ప్రజలు పోలీసుల మీదే ఘర్షణకు దిగుతున్నారు. ఒక గ్రామం నుంచి వచ్చే ఇసుక బండ్లను ఆపుతుంటే.. మరొకరు ఆ ఊరి నుంచి వచ్చే వాహనాలను ఆపేస్తున్నారు. ఈ పంతాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గందిగెడ్డ ప్రాంతంలో ఏర్పడిన ఈ వివాదం శాంతిభద్రతల సమస్యగా మారడంతో పోలీసులు తలపట్టుకుంటున్నారు.

లంకలపల్లి పాలెం సమీపంలో ఉన్న కందిగెడ్డ వద్ద ఇళ్ల నిర్మాణానికి గోవిందపురం గ్రామస్థులు నాటుబండ్ల ద్వారా ఇసుక తెచ్చుకుంటున్నారు. ఇది కొన్నాళ్లుగా సాగుతోంది. సడెన్ గా ఒకరోజు తమ గ్రామం మీదుగా ఇసుక తీసుకెళ్లడానికి వీల్లేదంటూ గోవిందపురం గ్రామస్థులను లంకలపల్లిపాలెం గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో గోవిందపురం గ్రామస్థుల ఇసుక రవాణాకు ఇబ్బందిగా మారింది.

దీంతో లంకలపల్లిపాలెం వాసులపై గోవిందపురం గ్రామస్థులు ప్రతీకార చర్యలకు దిగారు. మా ఊరి మీదుగా వెళ్లే మీ వెహికల్స్ ను నిలిపివేస్తామని హెచ్చరించారు. తాగునీటి సరఫరాను అడ్డుకున్నారు.

దీంతో జేసీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. రెండు గ్రామాల మధ్య సయోధ్య కుదిర్చి ఇసుక తరలింపు కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే గోవిందపురం గ్రామస్థులు తమ ఊరి నుంచి వెళుతున్న స్కూల్ బస్సును, వాహనాలను నిలిపివేశారు.

రాకపోకలు పూర్తిగా నిలిపివేయడంతో వివాదం తారాస్థాయికి చేరి ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరు గ్రామాల ప్రజలు ఘటనాస్థలానికి చేరుకొని మాటల యుద్ధానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.