Begin typing your search above and press return to search.

న‌న్నుప్రేమించ‌ట్లేదు..అందుకే పెట్రోల్‌ పోసి కాల్చేచా

By:  Tupaki Desk   |   22 Dec 2017 8:07 AM GMT
న‌న్నుప్రేమించ‌ట్లేదు..అందుకే పెట్రోల్‌ పోసి కాల్చేచా
X
హైద‌రాబాద్‌కు చెందిన ఓ యువ‌కుడి ఉన్మాద‌పు ప్రేమ కార‌ణంగా జ‌రిగిన చ‌ర్య అంద‌రినీ షాక్ గురి చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రేమను తిరస్కరించిందనే ఆగ్రహంతో ఓ ప్రేమోన్మాది...యువతిపై పెట్రోల్ పోసి నిప్పటించిన విషయం నగరంలో సంచలనం సృష్టించింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు సంధ్యారాణి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూసింది. ప్రేమోన్మాది కార్తీక్‌ ను పోలీసులు అరెస్టు చేసి నిందితుడిని మీడియా ఎదుట పోలీసులు ప్రవేశపెట్టగా అత‌ను సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. ఈ కేసు వివ‌రాల‌ను నార్త్ జోన్ డీసీపీ సుమతి మీడియాకు వెల్ల‌డించారు.

సికింద్రాబాద్ లాలాపేటలో నివాసముంటున్న సంధ్యారాణి(23) బీఏ(అకౌంట్స్) చదివింది. తన తండ్రి మరణంతో కుటుంబ భారం సంధ్యారాణిపై పడింది. దీంతో ఆమె స్థానికంగా ఉన్న లక్కీ ట్రేడర్స్‌ లో అకౌంటెంట్‌ గా పని చేస్తోంది. ఏడాది క్రితం కార్తీక్ కూడా అదే కంపెనీలో పని చేశాడు. ఈ క్రమంలో సంధ్యారాణిని ప్రేమిస్తున్నట్లు ఆమెకు చెప్పాడు. అయితే కార్తీక్ ఏడో తరగతి వరకు మాత్రమే చదివి.. అవారాగా తిరుగుతున్నాడు. బాధ్యత లేని యువకుడిని ప్రేమించడానికి సంధ్యారాణి ఇష్టపడలేదు. అనేకసార్లు ప్రేమ పేరిట సంధ్యారాణిని వేధించాడు. పలుసార్లు గిఫ్ట్‌ లు ఇచ్చేందుకు ప్రయత్నించగా వాటిని కూడా ఆమె తిరస్కరించిందని తెలిపారు. ఇటీవలే ఒక ఫోన్‌ను గిఫ్ట్‌ గా ఆమెకు ఇచ్చేందుకు మధ్యవర్తితో పంపించాడు కార్తీక్. ఆ ఫోన్‌ ను కూడా తీసుకోకుండా సంధ్యారాణి తిరిగి పంపింది. దీంతో ఆమెపై కార్తీక్ కక్ష పెంచుకున్నాడు. గురువారం సాయంత్రం సంధ్యారాణి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఆమెతో రోడ్డుపైనే గొడవ పడ్డాడు. సంధ్యారాణి కార్తీక్ ప్రేమను తిరస్కరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు.. వెంటతెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పటించాడని డీసీపీ సుమతి వెల్ల‌డించారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం సంధ్యారాణి కన్నుమూసినట్లు డీసీపీ పేర్కొన్నారు.

తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే కారణంతో సంధ్యారాణిపై దాడి చేసినట్లు నిందితుడు కార్తీక్‌ అంగీకరించాడు. ఐదేళ్లుగా సంధ్యారాణిని ప్రేమిస్తున్నానని, తనకు ఉద్యోగం ఇప్పించింది కూడా తనేనని పోలీసులకు తెలిపాడు. ఇద్దరం పెళ్లి చేసుకుందామ‌ని అనుకున్నామన్నారు. కానీ గత కొంతకాలంగా సంధ్యారాణి ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తనను దూరం పెట్టిందని పేర్కొన్నాడు. నిన్న రాత్రి కూడా సంధ్యారాణిని పెళ్లి చేసుకుందామని బతిమిలాడానని, అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెపై దాడికి పాల్పడ్డానని పోలీసుల ముందు అంగీకరించాడు.

ఇదిలాఉండ‌గా...మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని డీసీ తెలిపారు. ఈ కేసును సిరీయస్‌ గా తీసుకున్నామని సుమతి చెప్పారు. నిందితుడు కార్తీక్‌ పై 307 - 354డీ - ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. సంధ్యారాణిపై పెట్రోల్‌ తో దాడి చేసిన సమయంలో కార్తీక్ ఎవరూ సహకరించలేదని డీసీపీ స్పష్టం చేశారు. నిందితుడిని రిమాండ్‌ కు తరలించనున్నట్లు చెప్పారు.

కాగా, ప్రేమోన్మాది దాడిలో అసువులు బాసిన సంధ్యారాణి కుటుంబ సభ్యులను కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పరామర్శించారు. వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో మహిళలకు భద్రత కరవైందని అన్నారు. ఈ దురాగతానికి పాల్పడిన కార్తీక్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సంధ్యారాణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలని, పది లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.