Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ను మేం పొగడలేదు…

By:  Tupaki Desk   |   31 Jan 2017 5:37 AM GMT
కేసీఆర్‌ను మేం పొగడలేదు…
X
తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వ్యూహంలో ప్ర‌తిప‌క్ష‌ కాంగ్రెస్‌ - టీడీపీ ఎమ్మెల్యేలు చిక్కుకొని అనంత‌రం తాపీగా తేరుకున్న‌ట్లుగా మ‌రోమారు క‌నిపిస్తున్న సంద‌ర్భం ఇది. ఏకంగా తాము కేసీఆర్‌ ను పొగ‌డ‌లేద‌ని మూడు రోజుల త‌ర్వాత పత్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయాల్సి వ‌చ్చిందంటే... ఎంత‌గా ఇర‌కాటంలో ప‌డ్డారో అర్థం చేసుకోవ‌చ్చు.అసలేం జరిగిందంటే... జ‌న‌వ‌రి 27న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్‌ సి - ఎస్‌ టి సబ్-ప్లాన్‌ పై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. కాగా ఈ సమావేశంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు చేపట్టిందని, మంచి అడుగు పడిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ - ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క - ఆ పార్టీకి చెందిన మ‌రో ఎమ్మెల్యే సంపత్ కుమార్ స‌హా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అభినందించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

ఈ ప్రకటన దుమారాన్ని రేపుతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ - తెలుగు దేశం పార్టీ నాయకులు మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చారు. కేసీఆర్‌ ను తాము అభినందించలేదని, ఆకాశానికీ ఎత్తలేదని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ - టీడీపీల ఎమ్మెల్యేలు మండిపడుతూ...తాము అభినందించలేదని, పైగా ప్రభుత్వాన్ని నిలదీశామని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం మీడియాతో మాట్లాడుతూ, 30 నెలలుగా ఎస్‌ సి సబ్-ప్లాన్‌ పై అమలు చేయడం లేదని తాను ప్రభుత్వాన్ని నిలదీస్తే అభినందించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తప్పుడు ప్రకటన విడుదల చేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దళితులను ఉద్ధరించినట్లు ప్రభుత్వం ఆ ప్రకటనలో పేర్కొన్న దాంట్లో వీసమెత్తు కూడా నిజం లేదని, అయితే ఎస్‌ సి - ఎస్‌ టి వర్గాల జీవన ప్రమాణాలను పెంచేందుకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం మంచి నిర్ణయం అని మాత్రం అని అన్నానని సండ్ర తెలిపారు. మంచి చేస్తే మంచి అంటామని, చెడు చేస్తే తప్పకుండా విమర్శిస్తామని ఆయన చెప్పారు. ఎస్‌ సి - ఎస్‌ టి సబ్-ప్లాన్ చట్ట బద్దత - దీనిలో ఏమేమీ మార్పులు కావాలని అంటున్నారో స్పష్టత ఇవ్వాలని, ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని ముఖ్యమంత్రి తీసుకెళ్ళాలని సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. మరోవైపు ఎస్సీ - ఎస్టీ సబ్-ప్లాన్‌ పై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ దూరంగా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/