Begin typing your search above and press return to search.

సండ్ర‌కు బెయిల్ వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   14 July 2015 2:42 AM GMT
సండ్ర‌కు బెయిల్ వ‌చ్చేసింది
X
ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన స‌త్తుప‌ల్లి టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌కు బెయిల్ మంజూరైంది. ఓటుకు నోటు కేసులో సండ్ర‌కు నేరుగా సంబంధం ఉందంటూ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవ‌టం తెలిసిందే.

సండ్ర అరెస్ట్‌కు సంబంధించి నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత ఆయ‌న్ను విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసులు ఇవ్వ‌టం.. దానిపై ఆయ‌న స్పందించ‌క‌పోవ‌టం.. అనంత‌రం తాను అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యానంటూ స‌మాచారం ఇచ్చి.. వైద్యులు త‌న‌కు ప‌ది రోజులు విశ్రాంతి తీసుకోవాల‌ని చెప్పిన‌ట్లుగా ఆయ‌న పేర్కొన‌టం తెలిసిందే.

అనంత‌రం.. ఆసుప‌త్రి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచార‌ణ‌కు హాజ‌రు అవుతాన‌ని సండ్ర పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా గ‌తంలో ఇచ్చిన నోటీసుల‌కు భిన్నంగా ఏసీబీ అధికారులు సెక్ష‌న్ మార్చి నోటీసులు ఇచ్చారు. అనంత‌రం విచార‌ణ‌కు హాజ‌రైన సండ్ర‌ను.. దాదాపు ఏడు గంట‌ల‌పాటు విచారించిన ఏసీబీ అధికారులు ఆయ‌న్ను ఆరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

త‌న బెయిల్ కోసం అవినీతి నిరోధ‌క‌శాఖ కోర్టులో సండ్ర‌ పిటీష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం మ‌ధ్యాహ్నం ఒంటిగంట స‌మ‌యంలో బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రూ.2ల‌క్ష‌ల పూచీక‌త్తు ఇవ్వాల‌ని.. నియోజ‌క‌వ‌ర్గం విడిచి వెళ్ల‌రాద‌న్న ష‌ర‌తుతో ఆయ‌న‌కు బెయిల్ ఇచ్చింది. ఫార్మాలిటీస్ పూర్త‌య్యాక సండ్ర విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. మంగ‌ళ‌వారం సాయంత్రం కానీ.. బుధ‌వారం మ‌ధ్యాహ్నానానికి సండ్ర బ‌య‌ట‌కు వ‌చ్చే వీలుంద‌ని భావిస్తున్నారు.