Begin typing your search above and press return to search.

సండ్ర స్ట్రోక్‌!... బాబుకు రిటర్న్ పంచ్ ప‌డినట్టే!

By:  Tupaki Desk   |   3 March 2019 2:00 PM GMT
సండ్ర స్ట్రోక్‌!... బాబుకు రిటర్న్ పంచ్ ప‌డినట్టే!
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి ఇప్పుడు టైమేమీ బాగున్న‌ట్లు లేదు. ఓ వైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు ద‌రిదాపుల్లో క‌నిపించ‌డం లేద‌ని స‌ర్వేల‌న్నీ కోడై కూస్తుంటే... పార్టీలో ముఖ్యులనుకున్న వాళ్లు - వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రాలుగా ప‌రిగ‌ణిస్తున్న వారంతా వ‌రుస పెట్టి వైసీపీలో చేరుతుంటే... ఏం చేయాలో కూడా బాబుకు పాలుపోవ‌డం లేద‌నే చెప్పాలి. అస‌లు ఈ త‌ర‌హా ప‌రిణామాల‌పై నోరిప్పేందుకు కూడా బాబు సాహ‌సించ‌డం లేద‌నే చెప్పాలి. ఏదో మేక‌పోతు గాంభీర్యం మాదిరి... అవకాశ‌వాద రాజ‌కీయాల‌ని చెప్ప‌డం త‌ప్పించి... తాను ప్రోత్స‌హించిన పార్టీ ఫిరాయింపుల‌పై ఎక్కడ ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతాయోన‌న్న బెంగ‌తో బాబు అంత‌కు మించి మాట్లాడ‌టం లేదు. ఇలాంటి నేప‌థ్యంలో మూలిగే న‌క్క‌పై తాటికాయ ప‌డ్డ చందంగా... ఇప్పుడు తెలంగాణ‌లో పార్టీ శాఖ‌ను మూసుకోక త‌ప్ప‌ని ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి.

తెలంగాణ‌లో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో మొత్తం 13 చోట్ల పోటీ చేసిన టీడీపీ... రెండంటే రెండు స్థానాల్లోనే గెలిచింది. అయితే ఈ రెండింటిలో ఓ స్థానం టీఆర్ఎస్ ఖాతాలో ప‌డిపోయింది. ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సండ్ర వెంక‌ట వీర‌య్య‌... ఇప్పుడు టీడీపీకి చేయిచ్చేసి టీఆర్ఎస్‌లోకి చేరుతున్నారు. ఈ మేర‌కు ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. నిన్న‌నే ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో టీఆర్ఎస్ అదినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుతో భేటీ అయ్యారు. ఆ భేటీ వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించేందుకు నేటి మ‌ధ్యాహ్నం నిర్వ‌హించిన మీడియా మీట్ లో సండ్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఖ‌మ్మం జిల్లా.. ప్ర‌త్యేకించి త‌న నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే తాను టీఆర్ఎస్‌లో చేరుతున్నాన‌ని చెప్పిన సండ్ర‌.. ఇందులో త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలేమీ లేవ‌ని కూడా ప్ర‌క‌టించేశారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని త‌న అనుచ‌రుల‌తో చ‌ర్చించిన మీద‌టే తాను ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని కూడా ఆయ‌న చెప్పారు.

మొత్తంగా ఈ ప్ర‌క‌ట‌న ద్వారా సండ్ర‌... చంద్ర‌బాబుకు స‌రైన దెబ్బే వేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఏపీలో వైసీపీ టికెట్ల‌పై గెలిచిన ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను త‌న పార్టీలో చేర్చుకున్న చంద్ర‌బాబు.. వారితో త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధిని కాంక్షించే టీడీపీలో చేరుతున్నామ‌ని చిలుక ప‌లుకులు ప‌లికించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా తాము పార్టీ మారుతున్న వ్య‌వ‌హారంలో త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలేమీ లేవ‌ని కూడా వారితో చంద్ర‌బాబు చెప్పించారు. ఇప్పుడు సండ్ర నోట నుంచి కూడా స‌రిగ్గా ఇవే మాట‌లు వినిపించ‌డంతో చంద్ర‌బాబుకు రిట‌ర్న్ పంచ్ ప‌డిన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా తెలంగాణ‌లో 15 సీట్ల నుంచి మూడు సీట్లు, ఆ త‌ర్వాత రెండు సీట్లకు ప‌డిపోయిన టీడీపీ... ఇప్పుడు ఏకంగా సింగిల్ సీటుకే ప‌రిమితం కావ‌డం చూస్తుంటే... త్వ‌ర‌లోనే అక్క‌డ చంద్ర‌బాబు త‌న పార్టీ శాఖ‌ను మూసుకోక త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది.