Begin typing your search above and press return to search.

సైకిల్ ను విడవడంట.. కారు ఎక్కడంట

By:  Tupaki Desk   |   10 May 2016 4:58 AM GMT
సైకిల్ ను విడవడంట.. కారు ఎక్కడంట
X
రెండు తెలుగురాష్ట్రాల్లో చిత్రమైన రాజకీయం నడుస్తుంది. అధికారపక్షాలు రెండూ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగిస్తూ.. విపక్షాలన్నవి లేకుండా చేస్తున్న పరిస్థితి. తమ దారికి రాని విపక్ష నేతలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ.. తాము అనుకున్నట్లుగా విపక్ష నేతల్ని మార్చుకుంటున్న తీరు రెండు రాష్ట్రాల్లోని అధికారపక్షాల్లో ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. పార్టీలోకి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి ప్రదర్శించని నేతల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి.. వారు తమతో భాగస్వామ్యులయ్యేలా చేయటం కనిపిస్తుంది.

ఈ మధ్యనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేత మైసూరారెడ్డి చెప్పిన మాటలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఈ తరహా ప్లాన్స్ అమలు చేస్తారా? అన్న సందేహం కలగక మానదు. తాను జగన్ పార్టీలో చేరటానికి దారి తీసిన పరిస్థితుల్ని వివరించిన మైసూరా.. ‘‘అప్పట్లో జగన్ నా గురించి తరచూ అడిగేవారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పేవారు. ఒక్కసారి టిఫిన్ కు కలుద్దామని ఒకటికి నాలుగుసార్లు చెప్పిన తర్వాత ఓకే అన్నా. జగన్ ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే.. జగన్ ఇంట్లో మైసూరారెడ్డి అంటూ టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ లు వచ్చేశాయి. దీంతో.. ఆ పార్టీలోకి వెళ్లక తప్పని పరిస్థితి. జగన్ ఇంట్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి నా ప్రమేయం లేకుండానే చాలానే జరిగిపోయాయి’’అంటూ చెప్పుకొచ్చారు.

మైసూరా విషయంలో జగన్ అనుసరించినట్లు చెబుతున్న ప్లాన్ ను కాస్త అటూఇటూగా మార్చి తెలంగాణ టీడీపీ నేత సండ్ర వెంటక వీరయ్య విషయంలో తెలంగాణ అధికారపక్షం అమలు చేయాలని భావిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అధికారపక్షానికి చెందిన మీడియా సంస్థలో సండ్ర కారు ఎక్కుతున్నట్లుగా వార్తల జోరు పెరగటమే కాదు.. పెద్ద స్థాయిలో ఇవ్వటం ఇప్పుడు కలకలం రేపుతున్న పరిస్థితి. తాను పార్టీ మారిపోతున్నట్లుగా అచ్చేసిన కథనంపై ఆయనే స్వయంగా ఖండించుకోవాల్సి వచ్చింది.

తెలంగాణ అధికారపక్షానికి చెందిన మీడియా సంస్థలో తాను పార్టీ మారుతున్నట్లుగా వార్తల్ని సండ్ర తనకుతానుగా ఖండించుకున్నారు. తాను ఎట్టిపరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని విడిచి పెట్టనని తేల్చి చెప్పారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు.. తనపై సందేహాలు కలిగేలా చేయటమే లక్ష్యంగా తెలంగాణ అధికారపక్షం ఆలోచనగా ఆయన చెబుతున్నారు. పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో విపక్షాల మధ్య ఐక్యతను దెబ్బ తీసే పనిలో భాగంగానే తాను పార్టీ మారుతున్నట్లుగా తెలంగాణ అధికారపక్షం ప్రచారం చేస్తుందంటూ సండ్ర ఆరోపిస్తున్నారు. అయినా.. అధికారపక్షానికి చెందిన పత్రికలో ఒక విపక్ష నేత పార్టీ మారుతున్న వార్త రావటం.. దాన్ని ఆయనే స్వయంగా ఖండించటం చూస్తే.. సండ్ర మాటల్లో ఎంతోకొంత నిజం అందనిపించకమానదు.