Begin typing your search above and press return to search.

కనుసైగతో తొండి ఆట ఆడిన సంగక్కర్

By:  Tupaki Desk   |   14 Feb 2022 5:30 PM GMT
కనుసైగతో తొండి ఆట ఆడిన సంగక్కర్
X
గడిచిన వారం మొత్తం ఐపీఎల్ 2022 మెగా వేలం చుట్టూనే తిరిగింది. క్రీడాభిమానులు.. మరీ ముఖ్యంగా ఐపీఎల్ ను విపరీతంగా అభిమానించే వారంతా.. వేలం మీద చూపించిన ఆసక్తి అంతా ఇంతా కాదు. దీనికి తగ్గట్లే.. తాజా వేలం విశేషాల పుట్టగా మారింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. వేలం వేళ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ డైరెక్టర్ కుమార సంగక్కర్ చేసిన తొండి పనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటమే కాదు.. అంత పెద్ద మనిషి ఇలా చీప్ గా వ్యవహరించటమా అని మండిపడుతున్నారు. మరికొందరు అయితే.. ఇలాంటి తీరును తాము అస్సలు అంచనా వేయలేదని విస్మయానికి గురవుతున్నారు.

దిగ్గజ ఆటగాడిగా ఉంటూ తన స్థాయికి ఏ మాత్రం సరిపోని తీరును ప్రదర్శించారంటున్నారు. దీనికి తోడు అతను చేసిన చెత్త పనికి సంబంధించినదంతా కెమేరా కళ్లు రికార్డు చేసేయటం.. అవి కాస్తా సాక్ష్యాలుగా మారటంతో మరేమీ మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. ఇంతకూ అతనేం చేశారు? అసలీ వివాదం ఏమిటి? సంగక్కర కక్కుర్తి ఏమిటి? లాంటి విషయాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2022 మెగా వేలం రెండో రోజు జోరుగా సాగుతున్న వేళ.. ఆదివారం మధ్యాహ్నం ఇంగ్లంగ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేలంలోకి వచ్చారు. అతను రూ.2కోట్ల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వచ్చిన అతనికి సంబంధించి మరో అంశం ఏమంటే.. అతనీ సీజన్ లో ఆడే అవకాశం లేదు.

కానీ.. అతని కోసం ముంబయి ఇండియన్స్ తో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. ఆర్చర్ ను సొంతం చేసుకోవటానికి ఈ మూడు జట్లు ఆసక్తిని ప్రదర్శించాయి. గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడటం.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలవటం తెలిసిందే.

దీంతో.. అతన్ని వదులుకోవటం రాజస్థాన్ రాయల్స్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. అయితే.. అతని ధర రూ.6 కోట్లకు వచ్చేసరికి అనుకోని ఇబ్బంది రాజస్థాన్ రాయల్స్ కు ఎదురైంది. ఆ జట్టు దగ్గర డబ్బులు అయిపోవటం.. వేలంలో రూ.6 కోట్ల ధరకు మించి ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.

దీంతో బరిలో ముంబయి.. సన్ రైజర్స్ కు మాత్రమే అవకాశం ఉంది. దీంతో.. తమకు దక్కనిది మరెవరికీ దక్కకూడదన్న తొండి బుద్ధితో పాటు.. తన ప్రత్యర్థి జట్టును చీటింగ్ చేసేలా ఆయన వ్యవహరించాడు. ఆర్చర్ ను ఎట్టి పరిస్థితుల్లో సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న ముంబయి ఇండియన్స్ చేత ఎక్కువ ధర పెట్టేలా సంగక్కర కనుసైగతో హైదరాబాద్ సన్ రైజర్స్ టీం వారికి సందేశాన్నిపంపాడు.

ఈ విషయాన్ని కెమేరా రికార్డు చేయటంతో అతడి దొంగాట బయటకు వచ్చింది.ఈ వీడియో సోషల్ మీడియాలో బయటకు రావటం.. అది కాస్తా వైరల్ గా మారటంతో సంగక్కరను తిట్టి పోస్తున్నారు.

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ఇలా చేయటమా? అని పలువురు విస్మయానికి గురవుతున్నారు. ఇలా మోసం చేయటం ఏమిటి? అన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. ముంబయి ఇండియన్స్ జట్టును చీటింగ్ చేయాల్సిన అవసరం ఏమిటి? అని నిలదీస్తున్నారు.

తన కనుసైగతో చేసిన చీటింగ్ రాజస్థాన్ రాయల్స్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీయటంతో పాటు.. సంగక్కర మీద ఇప్పటివరకు ఉన్న పెద్ద మనిషి ట్యాగ్ ఆయనకు ఏ మాత్రం సూట్ కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.మరికొందరైతే ఒక అడుగు ముందుకేసి.. మన దగ్గరి ముతక సామెత.. వయసు రాగానే సరికాదు.. అన్న లెవెల్లో తిట్టి పోస్తున్నారు.