Begin typing your search above and press return to search.

కేసీఆర్ అభిన‌వ అంబేడ్క‌ర్‌.. సంగారెడ్డి క‌లెక్ట‌ర్ స్తోత్ర పాఠాలు

By:  Tupaki Desk   |   19 Sep 2022 2:30 AM GMT
కేసీఆర్ అభిన‌వ అంబేడ్క‌ర్‌.. సంగారెడ్డి క‌లెక్ట‌ర్ స్తోత్ర పాఠాలు
X
రెండు రోజుల కింద‌ట మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డిపై.. సూర్యాపేట పోలీస్ బాస్ స్త్రోత్ర‌పాఠాలు వ‌ల్లె వేశారు. జ‌గ‌దీశ‌న్న‌కు జై! అంటూ.. బ‌హిరంగ వేదిక‌గా.. నినాదాలు చేశారు.. ప్ర‌జ‌ల‌తో చేయించారు. ఇక‌, ఇప్పుడు సంగారెడ్డి క‌లెక్ట‌ర్ వంతు వ‌చ్చింది. మంత్రుల‌తో ఏం ప‌నిలే.. అనుకున్నారో.. ఏమో.. ఆయ‌న ఏకంగా.. ముఖ్య‌మంత్రిపైనే స్తోత్ర పాఠాలు వ‌ల్లెవేశారు. అభిన‌వ అంబేడ్క‌ర్ అన్నారు. అంబేడ్క‌ర్ రూపంలో కేసీఆర్ త‌న‌కు క‌నిపిస్తున్నార‌ని.. కొనియాడారు. దీంతో అధికార పార్టీ అంటే.. ప‌డి చ‌చ్చిపోతున్న వీరంతా.. కండువా క‌ప్పేసుకుంటే బెట‌రేమో.. అనే కామంట్లు వినిపిస్తున్నాయి.

ఏం జ‌రిగింది?

సంగారెడ్డి కలెక్టరేట్లో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించారు. కలెక్టరేట్లో వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా.శరత్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ను అభినవ అంబేద్కర్గా పొగిడారు. గిరిజనులకు 1౦ శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న సీఎంకు కలెక్టర్‌ కృతజ్ఙతలు తెలిపారు. పేద దళిత, గిరిజన వర్గాలకు కేసిఆర్ ఆశాదీపంగా మారారని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను చూడలేదని, కేసీఆర్ రూపంలో ఆయనను ఇప్పుడు చూస్తున్నా మని తెలిపారు.

అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ అట్టడుగు వర్ణాల అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం సంతోషంగా ఉందని, దేశ చరిత్రలో ఇది ఒక సంచలన నిర్ణయమని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. భూమి లేని గిరిజనులకు "గిరిజన బంధు" అంటూ సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారని శరత్ ప్రశంసించారు.

'రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు వారంలోగా జీవో విడుదల చేస్తాం. దాన్ని ఆమోదించి గౌరవాన్ని కాపాడుకుంటరా? లేకపోతేఉరితాడుగా మార్చుకుంటరా? ప్రధాని మోదీనే తేల్చుకోవాలె. గిరిజన రిజర్వేషన్లపై కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయాం. కేంద్రం చేయకపోతే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను రాష్ట్రమే అమలు చేసుకుంటుంది'' అని సీఎం కేసీఆర్ చెప్పిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. మొత్తానికి రెండు రోజుల కింద ఎస్పీ.. ఇప్పుడు క‌లెక్ట‌ర్ హ‌ద్దులు దాటేశార‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.