Begin typing your search above and press return to search.

జగ్గారెడ్డి..పార్టీ మారడమే మేలని జనాలకు చెప్తున్నారా?

By:  Tupaki Desk   |   30 April 2019 11:37 AM GMT
జగ్గారెడ్డి..పార్టీ మారడమే మేలని జనాలకు చెప్తున్నారా?
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గిన అతి తక్కువ మంది ఎమ్మెల్యేల్లో ఒకరు జగ్గారెడ్డి. ఈయన తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరబోతున్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఊహాగానాలు గత కొన్ని రోజులుగా పతాక స్థాయికి చేరాయి. తెలంగాణ రాష్ట్ర సమితిలోకి జగ్గారెడ్డి చేరికకు ముహూర్తం కూడా కుదిరిందని ఇది వరకే ప్రచారం జరిగింది. అయితే ఆ చేరిక జరగలేదు.

తను తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరబోతున్నట్టుగా జరిగిన ప్రచారాన్ని జగ్గారెడ్డి ఖండించారు. తన ఖండనకు మీడియా ప్రాధాన్యం ఇవ్వడం లేదని కూడా ఇటీవల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు మళ్లీ పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై మాట్లాడారు జగ్గారెడ్డి. ఇలాంటి వ్యవహారాల్లో తన గత అనుభవాలను ఆయన వివరించారు. గతంలో రెండు వేల నాలుగులో జగ్గారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున నెగ్గిన సంగతి తెలిసిందే.

అప్పట్లో కొన్నాళ్లకు తెలంగాణ రాష్ట్ర సమితిలో చీలిక వచ్చింది. చీలిక నేతలంతా కాంగ్రెస్ పార్టీతో జత కలిశారు. వారిలో జగ్గారెడ్డి ఒకరు. 'అప్పట్లో ఫిరాయించడం మేలు అయ్యింది. కాంగ్రెస్ కు దగ్గర కావడం వల్ల నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు చేయగలిగాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అప్పుడే ఏర్పడదని భావించి వైఎస్ పిలుపు మేరకు కాంగ్రెస్ కు దగ్గరయ్యాను. నియోజకవర్గానికి ఎన్నో చేయగలిగాను. ఐఐటీ తీసుకొచ్చాను..' అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

మరి ఇందు మూలంగా ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటి? అంటే.. బహుశా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరడం మేలని చెప్ప దలుచుకుంటున్నారేమో, ఫిరాయింపుకు అలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారేమో.. అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు.