Begin typing your search above and press return to search.

సారు రాజ్యంలో దీక్ష‌కు వెళితే అరెస్ట్ చేస్తారంతే!

By:  Tupaki Desk   |   15 July 2019 7:14 AM GMT
సారు రాజ్యంలో దీక్ష‌కు వెళితే అరెస్ట్ చేస్తారంతే!
X
కార‌ణం ఏదైనా కానీ.. విన‌తిప‌త్రం ఇవ్వాలి. అది కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రుల వారికి ఇబ్బంది లేకుండా.. ఆయ‌న‌కు అస‌హ‌నం క‌ల‌గ‌కుండా. అంతేకానీ.. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం రోడ్లు ఎక్కుతాం.. దీక్ష‌లు చేస్తాం.. మాన‌వ‌హారాలుగా మార‌తాం.. లాంటి పోరాటాలు చేస్తామంటే కుద‌ర‌దు.

ఉద్య‌మ‌స్ఫూర్తితో వ‌చ్చిన తెలంగాణ రాష్ట్రంలో.. ఇప్పుడు ఆందోళ‌న‌లు.. ధ‌ర్నాలు.. దీక్ష‌లు.. నిర‌స‌న‌లు.. లాంటివేమీ నిర్వ‌హించ‌కూడ‌ద‌న్న‌ట్లుగా ఉంది. గ‌తంలో మాదిరి పేరున్న నేత‌లు అనూహ్యంగా రోడ్ల మీద‌కు వ‌స్తే.. వారికి కాసేపు నిర‌స‌న చేయించి.. ఆ త‌ర్వాత వారిని బుజ్జ‌గించి పంపేవారు. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. ఎవ‌రైనా స‌రే.. ఒకటే ప‌ద్ద‌తి.. రెక్క పుచ్చుకోవ‌టం అదుపులోకి తీసుకోవ‌టం.. పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించ‌టం.

ఇందుకోసం గంట‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేయ‌టాలు లాంటివి కూడా ఏమీ ఉండ‌ద‌ని ప‌రిస్థితి. త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి గోదావ‌రి నీళ్ల‌ను త‌ర‌లించాల‌ని డిమాండ్ చేస్తూ జ‌ల‌దీక్ష చేయ‌టానికి వెళుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. గోదావ‌రి నీళ్ల‌ను త‌మ జిల్లాకు త‌ర‌లించాలంటూ నిరాహార‌దీక్ష చేయాల‌ని భావిస్తున్న ఆయ‌న్ను అలాంటిదేమీ జ‌ర‌గ‌క‌ముందే అరెస్ట్ చేసేస్తున్నారు.

తాజాగా జ‌గ్గారెడ్డి సైతం ఆ లిస్టులో చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న్నుకొండ‌పూర్ పోలీస్ స్టేష‌న్ లో ఉంచారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్రకారం సాయంత్రం వ‌ర‌కూ ఆయ‌న్ను పోలీస్ స్టేష‌న్లో ఉంచేసి.. ఆ త‌ర్వాత ఇంటికి పంపుతార‌ని చెబుతున్నారు. అయినా.. సారు రాజ్యంలో నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌లు లాంటివి లేవ‌న్న విష‌యాన్ని జ‌గ్గారెడ్డి అలా మ‌ర్చిపోతే ఎలా?