Begin typing your search above and press return to search.

జ‌గ్గారెడ్డి ఉంటాడా... గోడ దూకేస్తారా...?

By:  Tupaki Desk   |   11 Oct 2019 1:34 PM GMT
జ‌గ్గారెడ్డి ఉంటాడా... గోడ దూకేస్తారా...?
X
టీ కాంగ్రెస్ ఫైర్‌ బ్రాండ్ ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి రాజ‌కీయ క‌ద‌లిక‌లు కొద్ది రోజులుగా తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిగా మారాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే ఆయ‌న వ్య‌వ‌హారం ఏదో తేడా కొడుతోంద‌న్న సంకేతాలు వస్తూనే ఉన్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక టీఆర్ ఎస్‌ పై దూకుడు త‌గ్గించిన ఆయ‌న కేసీఆర్‌ కు పాజిటివ్‌ గా మాట్లాడుతూ వ‌స్తున్నారు.

ఇటీవ‌లే మంత్రి హ‌రీశ్‌ రావును క‌లిసి పెద్ద చ‌ర్చ‌కే తెర‌లేపారు. హ‌రీశ్‌ రావుకు - జ‌గ్గారెడ్డికి మ‌ధ్య 14 ఏళ్లుగా మాట‌లు లేవు. ఎప్పుడో జ‌గ్గారెడ్డి టీఆర్ ఎస్‌ లో ఉన్న‌ప్పుడు మాత్ర‌మే వాళ్లు క‌లిసి ఉండేవారు. ఆయ‌న ఎప్పుడైతే టీఆర్ ఎస్‌ ను వీడి బ‌య‌ట‌కు వ‌చ్చి కాంగ్రెస్‌ లో చేరారో అప్ప‌టి నుంచి ఉప్పు - నిప్పు మాదిరిగా మారిపోయారు. ఇక గ‌త డిసెంబ‌ర్ ఎన్నిక‌ల్లో సైతం హ‌రీశ్ జ‌గ్గారెడ్డిని ఓడించేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఆయ‌న సొంత ఇమేజ్‌ తో గ‌ట్టెక్కారు.

ఇక అలాంటి జ‌గ్గారెడ్డి హ‌రీశ్‌ ను క‌లిసి సంచ‌ల‌నం రేపారో లేదో తాజాగా శుక్ర‌వారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గం అభివృద్ధి - ప్రజల కోసం సీఎం కేసీఆర్ దగ్గర తల వంచుతానని అన్నారు. సంగారెడ్డిలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. త‌న‌కు త‌న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి చాలా ముఖ్యం అని.. త‌నను గెలిపించిన ప్రజల కోసం సీఎంకు వ్యతిరేకంగా తాను స్టేట్ మెంట్ ఇవ్వనని - అలాగే, ఎవ్వరూ ఇవ్వొద్దని సూచించారు.

అలాగే, బీజేపీకి కూడా వ్యతిరేకంగా ప్రకటనలు చేయొద్దని సూచించారు. జ‌గ్గారెడ్డి వ్యాఖ్య‌లు చూస్తుంటే ఆయ‌న కేసీఆర్‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీలు మారిన వారంద‌రు త‌మ‌కు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధే ముఖ్యం అని చెప్పి కండువాలు మార్చేశారు. ఇప్పుడు జ‌గ్గారెడ్డి కూడా అదే బాట‌లో.. అంటే కాస్త డిఫ‌రెంటుగా వెళుతున్న‌ట్టే క‌నిపిస్తోంది.