Begin typing your search above and press return to search.

బీజేపీ ఓట‌మిపై సొంతోళ్ల స‌ర్వే సంచ‌ల‌నం!

By:  Tupaki Desk   |   3 May 2018 5:00 AM GMT
బీజేపీ ఓట‌మిపై సొంతోళ్ల స‌ర్వే సంచ‌ల‌నం!
X
బీజేపీకి కాలం క‌లిసి రావ‌టం లేదు. ఉత్త‌రాదిలో విజ‌యం మీద విజ‌యం సాధించి రెట్టించిన ఉత్సాహంతో ఈశాన్యంలో పాగా వేసిన క‌మ‌ల‌నాథుల ద‌క్షిణాది క‌ల‌లు క‌ల్ల‌లు కావ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఏమైనా స‌రే.. ద‌క్షిణాదిన పాగా వేయాల‌న్న సింగిల్ పాయింట్ ఎజెండాతో రంగంలో దిగిన బీజేపీకి సొంతోళ్లు చేసిన స‌ర్వే ఇప్పుడు షాకింగ్ గా మారింది.

బీజేపీ.. ఆర్ ఎస్ ఎస్ (రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌) మ‌ధ్య‌నున్న అనుబంధం ఎలాంటిదో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. బీజేపీకి ఫుల్ స‌పోర్ట్ గా ఉంటూ.. ఆ పార్టీ విజ‌యం కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మించే సంఘ్ ప‌రివార్ క‌ర్ణాట‌క ఎన్నిక‌ను సీరియ‌స్ గా తీసుకుంది. వేలాది మంది కార్య‌క‌ర్త‌ల్ని నెల‌ల కింద‌టే క‌ర్ణాట‌క‌కు పంపింది. గ్రౌండ్ లెవ‌ల్లో వ‌ర్క్ చేయాల‌ని ఆదేశించింది. ఇంత చేసినా కూడా ఎలాంటి ఫ‌లితం లేద‌న్న మాటను తాజాగా తేల్చేసింది.

అంత‌ర్గ‌తంగా చేసిన స‌ర్వేలో క‌ర్ణాట‌క‌లో బీజేపీ ఓట‌మి ఖాయ‌మ‌ని తేల్చేసింది. తాము చేసిన స‌ర్వేను సంఘ్ ప్ర‌ముఖులు.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు స్వ‌యంగా చేతికి ఇచ్చార‌ని చెబుతున్నారు.

సంఘ్ లెక్క‌ల ప్ర‌కారం కాంగ్రెస్‌కు 115 నుంచి 120 సీట్లు.. జేడీఎస్‌కు 29 నుంచి 34 సీట్లు వ‌స్తాయ‌ని.. బీజేపీకి 70కి మించి సీట్లు వ‌చ్చే చాన్సే లేద‌ని తేల్చిన‌ట్లుగా తెలుస్తోంది.

రాష్ట్రంలోని అల్ప‌సంఖ్యాకులు.. బ‌ల‌హీన వ‌ర్గాలు.. ద‌ళితుల ఓట్లును స‌మీక‌రించ‌టంలో విఫ‌ల‌మైన‌ట్లుగా తేల్చిన‌ట్లుగా స‌మాచారం. బీజేపీ సీఎం అభ్య‌ర్థి య‌డ్యూర‌ప్ప‌కు లింగాయ‌త్ కుల‌స్తుల‌పై ప‌ట్టు త‌ప్పింద‌ని.. గాలి టీమ్‌కు పెద్ద‌పీట వేయ‌టం.. జీఎస్టీ.. పెద్ద‌నోట్ల ర‌ద్దు.. మోడీ సౌత్ వ్య‌తిరేక‌త లాంటి అంశాల‌న్ని క‌లిసి క‌ర్ణాట‌క‌లో బీజేపీకి ఓట‌మి త‌ప్ప‌నిస‌రిగా మార్చనున్న‌ట్లుగా అంచ‌నా వేస్తున్నారు. పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల పెంపు కూడా బీజేపీ మీద దెబ్బ ప‌డేలా చేస్తుంద‌న్న అభిప్రాయం ఉంది.

సంఘ్ ప‌రివార్ అంత‌ర్గ‌త రిపోర్ట్ చూసిన త‌ర్వాత అమిత్ షా ముఖం చిన్న‌పోయింద‌ని.. ఆయ‌న మౌనంగా ఉండిపోయిన‌ట్లుగా తెలుస్తోంది. సంఘ్ స‌ర్వే రిపోర్టులు ర‌హ‌స్యంగా ఉంటాయ‌ని.. బ‌య‌ట‌కు పొక్కే ప‌రిస్థితి ఉండ‌ద‌ని చెప్పినా.. ఆ వివ‌రాలు బ‌య‌ట‌కు రావ‌టం క‌మ‌ల‌నాథులు ఖంగు తినేలా చేస్తున్నాయి. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీపై బోలెడ‌న్ని ఆశ‌ల్ని పెట్టుకుంది బీజేపీ. ఎన్నిక‌ల ప్ర‌చార ముఖ చిత్రం మొత్తాన్ని మార్చేయ‌గ‌ల‌ర‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇందుకు త‌గ్గ‌ట్లే ప్ర‌ధాని మోడీ షెడ్యూల్ లో మార్పులు చేశారు. క‌ర్ణాట‌క‌లోని మ‌రికొన్ని ప్రాంతాల్లో ఆయ‌న ప‌ర్య‌టించేలా షెడ్యూల్ ను సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. సౌత్ లో పాగా వేయాలంటూ కోటి ఆశ‌లు పెట్టుకున్న క‌మ‌ల‌నాథుల‌కు తాజా స‌ర్వే రిపోర్ట్ షాకింగ్ గా మారిన‌ట్లుగా తెలుస్తోంది.