Begin typing your search above and press return to search.

2019లో మోడీ బ్యాచ్‌ కి అన్ని సీట్లు పోతాయా?

By:  Tupaki Desk   |   27 Dec 2017 4:40 AM GMT
2019లో మోడీ బ్యాచ్‌ కి అన్ని సీట్లు పోతాయా?
X
పైకి క‌నిపించేది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే స‌ర్కారు అయినా.. న‌డిచేదంతా బీజేపీ హ‌వానే. అదే తీరులో పేరుకు బీజేపీ.. మోడీ లాంటి పెద్ద పెద్ద మాట‌లు వినిపించినా.. వారికి మార్గ‌ద‌ర్శ‌నం చేసేది.. వారు ఎలా న‌డ‌వాలో నిర్దేశించేది.. వారిని తీవ్రంగా ప్ర‌భావితం చేసేది మాత్రం సంఘ్ ప‌రివార్ గా చెప్ప‌క త‌ప్ప‌దు.

అలాంటి సంఘ్‌.. తాజాగా మోడీ అండ్ కోకు భారీ షాకిచ్చింద‌ని చెబుతున్నారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌మ‌దే విజ‌య‌మ‌ని ఊహ‌ల్లో విహ‌రిస్తున్న క‌మ‌ల‌నాథులు.. అర్జెంట్ గా నేల మీద‌కు దిగాల‌ని.. వాస్త‌వ ప‌రిస్థితుల్ని స‌మీక్షించుకోవాల‌న్న స‌ల‌హాను ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇప్ప‌టికి ఉన్న 60 సీట్ల మేర త‌గ్గొచ్చొన్న మాట‌ను సంఘ్ చెప్పిన‌ట్లుగా స‌మాచారం.

దీని వెన‌కున్న కార‌ణం ఇద‌న్న విష‌యాన్ని చెప్ప‌న‌ప్ప‌టికీ హిందీరాష్ట్రాల్లో బీజేపీ వ్య‌తిరేక‌త కాస్త పెరిగింద‌న్న విష‌యాన్ని సంఘ్ చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. హిందీ బెల్ట్ రాష్ట్రాలైన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. రాజ‌స్థాన్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్ ల‌లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీటికి తోడు క‌ర్ణాట‌క‌.. నాగాలాండ్‌.. మిజోరం.. మేఘాల‌య‌.. త్రిపుర‌ల‌లో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 2019 ఎన్నిక‌ల‌కు సెమీఫైన‌ల్స్ గా అభివ‌ర్ణిస్తున్న ఈ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఎదురుగాలి వీయ‌వ‌చ్చ‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక‌వేళ అలాంటిదే జ‌రిగితే.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ ఆత్మ‌స్థైరాన్ని భారీగా దెబ్బ తీయ‌టం ఖాయం.

బీజేపీ పై వ్య‌తిరేక‌త అంత‌కంత‌కూ పెరుగుతుంద‌న్న మాట‌కు నిద‌ర్శ‌నంగా గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాల్ని చూపిస్తున్నారు. 22 ఏళ్ల‌గా లేని అసంతృప్తి ఇటీవ‌ల కాలంలో ఎక్కువైన‌ట్లుగా చెబుతున్నారు. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు.. ప‌రిస్థితిని క్షుణ్ణంగా ప‌రిశీలించిన సంఘ్.. బీజేపీకి 64 సీట్ల‌కు మించి ఎక్కువ రావ‌న్న మాట‌ను తేల్చి చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో.. వ‌ణికిన మోడీ అండ్ కో.. అప్ప‌టిక‌ప్పుడు యుద్ధ ప్రాతిప‌దిక‌న ల‌క్ష్యాల్ని నిర్దేశించుకోవ‌ట‌మే కాదు.. మోడీ సైతం స్వ‌యంగా రంగంలోకి దిగి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశార‌ని చెప్పాలి. ఈ కార‌ణంతోనే గుజ‌రాత్ లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన బ‌లం కంటే కేవ‌లం ఏడు సీట్లు మాత్ర‌మే అధికంగా వ‌చ్చిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు.

సంఘ్ హెచ్చ‌రిక నేప‌థ్యంలో గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బూత్ ల స్థాయి వారీగా వ్యూహం సిద్ధం చేసి.. వాటిని అన్ని విధాలుగా అమ‌లు చేయ‌టం వ‌ల్లే విజ‌యం సాధ్య‌మైంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న మ‌ధ్య‌ప్ర‌దేశ్.. రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ ప‌రిస్థితి ఏమాత్రం బాగోలేద‌న్న అభిప్రాయాన్ని సంఘ్ తేల్చి చెప్పిన‌ట్లు చెబుతున్నారు. అక్క‌డ ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఎక్కువ‌గా ఉందంటున్నారు. ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. క‌ర్ణాట‌క‌ల‌లో కాంగ్రెస్ అంత బ‌లంగా లేకున్నా.. బీజేపీకి సానుకూల‌త లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. తాజాగా సంఘ్ చేసిన సూచ‌న మోడీ అండ్ కోల‌కు కొత్త గుబులు పుట్టేలా చేసింద‌న్న మాట వినిపిస్తోంది.