Begin typing your search above and press return to search.

సంచలన నిర్ణయాన్ని తీసుకున్న సానియా మీర్జా

By:  Tupaki Desk   |   14 Jan 2023 6:32 AM GMT
సంచలన నిర్ణయాన్ని తీసుకున్న సానియా మీర్జా
X
భారత టెన్నిస్ క్రీడాకారిణి.. భారత్ సత్తాను అంతర్జాతీయ వేదిక మీద సగర్వంగా చాటిన హైదరాబాదీ సానియా మీర్జా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆమె తన టెన్నీస్ క్రీడకు గుడ్ బై చెప్పే నిర్ణయాన్ని తీసుకున్నారు. టెన్నిస్ కు రిటైర్మెంట్ ను ప్రకటిస్తూ ఆమె నాలుగు పేజీల సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్ లో అడుగు పెట్టనున్నారు.ఈ నెల 16న జరిగే ఈ టోర్నీ తర్వాత మరోటోర్నీలో పాల్గొంటారు. ఈ రెండే ఆమె క్రీడాజీవితంలో చివరి టోర్నీలుగా పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన ఒక ట్వీట్ ఆమె శుక్రవారం రాత్రి కాస్తంత పొద్దుపోయిన తర్వాత చేశారు. తననాలుగుపేజీల లేఖను తన ట్వీట్ కు జత చేయటం గమనార్హం. ముప్ఫై ఏళ్ల టెన్నిస్ కెరీర్.. ఇరవైఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్ ను విడిచిపెట్టటం బాధగా ఉందన్న ఆమె.. భావోద్వేగంతో రియాక్టు అయ్యారు. "నా తల్లిదండ్రులు, సోదరి, కోచ్‌లు, ఫిజియో, ట్రైనర్లు, అభిమానులు, మద్దతుదారులు, నా సహచర ప్లేయర్స్‌ తోడ్పాటు లేకుండా ఈ విజయాలు లేవు. నా ఆనందంలో, దుఃఖంలో వీరంతా పాలుపంచుకున్నందుకు కృతజ్ఞతలు" అని పేర్కొన్నారు.

2005లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా నా గ్రాండ్ స్లామ్ ప్రయాణం ఆరంభమైందని.. పద్దెనిమిదేళ్ల తర్వాత అదే టోర్నీ ద్వారా చివరి స్లామ్ తాను ఆడనున్నట్లుగాపేర్కొన్నారు. "ఇక్కడితో ఆగకుండా కొత్త లక్ష్యాల కోసం ముందుకు సాగాలని భావిస్తున్నా. నాకొడుక్కి గతంలో కన్నా ఇప్పుడే నా అవసరం ఎక్కువగా ఉంది. అతడితో ప్రశాంతమైన జీవితాన్నిగడిపేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని వెల్లడించారు.

మహిళా టెన్నిస్ చరిత్రలో భారత్ కు చెందిన ఒక క్రీడాకారిణి గ్రాండ్ స్లామ్ అర్హత సాధించటమే గొప్ప అనుకునే రోజుల్లో అందుకు భిన్నంగా ఆరు గ్రాండ్ స్లామ్స్ ను తన ఖాతాలో వేసుకొని సంచలనంగా మారారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భారత మహిళల టెన్నిస్ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన క్రెడిట్ సానియాకు దక్కుతుంది. 36 ఏళ్ల సానియావచ్చే వారం ఆస్ట్రేలియన్ ఓపెన్ లో కజికిస్థాన్ కు చెందిన అనాడానిలినాతో కలిసి ఆడనుంది. తాజాగా విడుదల చేసిన లేఖలో ఆమె తన భావోద్వేగాన్ని అందరితో పంచుకున్నారు.

'ముప్ఫై ఏళ్ల క్రితం.. ఆరేళ్ల చిన్నారి హైదరాబాద్ లోని నాసర్ స్కూల్ నుంచి టెన్నిస్ శిక్షణ కోసం నిజాం క్లబ్ కు వెళ్లింది. అక్కడికి వెళ్లినంతనే అక్కడి కోచ్ మాత్రం వయసు సరిపోదని తేల్చేశారు. అందుకు మా అమ్మ మాత్రం అప్పట్లో ఆ కోచ్ తో గట్టిగా పోరాడింది. అలా నాకలను నెరవేర్చుకోవటానికి ఆరేళ్ల నుంచే రాటుదేలాల్సి వచ్చింది' అని లేఖలో పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే.. తాను కన్న స్వప్నాన్ని సాకారం చేసుకోవాలని నిర్ణయించుకున్నానని.. ఇప్పుడు తిరిగి చూసుకుంటే గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఆడాలన్నస్వప్నాన్ని సాకారం చేసుకోవటంతో పాటు.. వాటిని సాధించిన వైనాన్ని ఆమె పేర్కొన్నారు.

పోడియం మీద నిలుస్తూ మువ్వెన్నల పతాకం రెపరెపలాడేలా చేసినందుకు తన జీవితం ధన్యమైందన్న సానియా.. దేశానికి పతకాలు అందించటమే తనకు దక్కిన అతి గొప్ప గౌరవంగా తాను భావిస్తున్నట్లుగా వెల్లడించారు. 2010లో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడిన సానియా 2018లో కొడుక్కి జన్మనిచ్చింది. ఆ తర్వాత రెండేళ్లు విశ్రాంతి తీసుకున్న ఆమె.. తర్వాత తాను ఆడిన తొలి టోర్నీలో డబుల్స్ విజేతగా నిలిచింది. గత ఏడాది ఖతార్ ఓపెన్ సెమీస్ వరకు చేరుకున్న ఆమె.. డబుల్స్ లో పలు టోర్నీలను సొంతం చేసుకుంది. సింగిల్స్ లో మాత్రం తన కెరీర్ మొత్తంలో ఒకే ఒక్క టైటిల్ ను సాధించింది. అయితేనేం.. సానియా విజయాల్ని తక్కువగా చూడలేం. భారత భవిష్యత్తు టెన్నిస్ క్రీడకు ఆమె ఒక స్ఫూర్తిగా చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.