Begin typing your search above and press return to search.

ఏపీ : మ‌రో స‌మ్మె సైర‌న్ అదిగో... !

By:  Tupaki Desk   |   11 July 2022 5:30 AM GMT
ఏపీ : మ‌రో స‌మ్మె సైర‌న్ అదిగో... !
X
వీధులు ఊడ్చే స్వ‌చ్ఛ కార్మికుల వేద‌న‌లకు ప‌రిష్కారం అన్న‌దే లేకుండా పోతోంది. స్వ‌చ్ఛ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనే మాటను నిజం చేసే కార్మికులు కేవ‌లం క‌నీస వేతనం ఇర‌వై వేలు ఇవ్వ‌మ‌ని అడుగుతుంటే ఇప్ప‌టికీ వాటి కి మోక్షం లేకుండా ఉంద‌ని, ముఖం చాటేస్తున్నార‌ని ఓ వాద‌న వినిపిస్తోంది. ప్ర‌భుత్వం త‌మ‌పై మాన‌వ‌త‌ను చాటుకోవాల‌ని వీరంతా కోరుతూ విధుల‌ను స్తంభింపజేస్తున్నారు. స‌మ్మె పేరిట మ‌రో సారి త‌మ బాధ‌ను వెళ్ల‌గ‌క్కుతున్నారు. ఇప్ప‌టికే ఓ ద‌ఫా అధికారుల‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి.

ఏపీలో పుర‌పాల‌క, న‌గ‌ర పాల‌క పారిశుద్ధ్య కార్మికులు నేటి నుంచి స‌మ్మెకు దిగుతున్నారు. త‌మ న్యాయ‌మ‌యిన డిమాండ్ల సాధ‌న‌కు సమ్మెకు దిగ‌క త‌ప్ప‌డం లేద‌ని వీరు చెబుతున్నారు. ఎప్ప‌టి నుంచో త‌మ జీతాలు పెంచాల‌ని, అలానే పెంచాక సకాలంలో చెల్లించాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. కానీ ఇవేవీ ప‌ట్టించుకోని స‌ర్కారు చోద్యం చూస్తుంద‌ని అంటున్నాయి సంబంధిత వర్గాలు. తాము ఎప్ప‌టి నుంచో మొర పెట్టుకున్న‌ప్ప‌టికీ స‌మ‌స్య ప‌రిష్కారంపై చిత్త‌శుద్ధి అన్న‌ది లేద‌ని వీరంతా ఆరోపిస్తూ ఉన్నారు. దీంతో కొన్ని వేల కుటుంబాలు ఇవాళ్టి నుంచి అంటే సోమ‌వారం నుంచి ప‌నులు మానుకుని నిర‌స‌న‌కు సిద్ధం అవుతున్నాయి.

ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలు చెప్పినా కూడా స‌ర్కారు విన‌లేదు అని కూడా తేలిపోయింది. తాము 18 వేలు జీతం ఇస్తామ‌ని స ర్కారు అంటున్న‌ద‌ని కానీ తాము ఇర‌వై వేలు జీతం, క‌రువు భ‌త్యం అడుగుతున్నామ‌ని అంటున్నారు వీరు. అసలు శ్రీ‌కాకుళం లాంటి న‌గ‌ర కార్పొరేష‌న్ల‌లో విలీనం పేరిట కొన్ని పంచాయ‌తీల‌ను క‌లుపుకున్నారు. సంబంధిత పారిశుద్ధ్య కార్మికుల‌ను కూడా విధుల్లోకి తీసుకున్నారు. వీరంతా రెగ్యుల‌ర్ కాదు కాంట్రాక్ట్ బేస్డ్ కార్మికులు. వారికి కూడా మూడు నెల‌లుగా జీతాలు లేవ‌ని తెలుస్తోంది. జీతాల బ‌కాయిలు చెల్లించ‌మ‌ని అడిగితే కాల‌యాప‌న త‌ప్ప సమస్య ప‌రిష్కారంపై శ్ర‌ద్ధ అన్న‌ది లేకుండా పోతోంది అన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌ధాన డిమాండ్లివి :
- ఆరోగ్య భ‌త్యం (హెల్త్ ఇన్సూరెన్స్‌) బ‌కాయిల‌తో స‌హా చెల్లించాలి.
- 11వ పీఆర్సీ సిఫార‌సుల ప్ర‌కారం నెల జీతం ఇర‌వై వేలు చెల్లిస్తూ
క‌రువు భ‌త్యం ఇవ్వాలి
- మున్సిప‌ల్ పారిశుద్ధ్య , ఇంజ‌నీరింగ్ కార్మికుల‌ను రెగ్యుల‌రైజ్ చేయాలి
ప్ర‌స్తుతం చాలా మంది కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలోనే ఉన్నారు.
- చాలీ చాలని సిబ్బందితో వీళ్లంతా ప‌నిచేస్తున్నారు. సిబ్బందిని పెంపుద‌ల చేయాల‌ని కోరుతున్నారు.
- ఆప్కాస్ ద్వారా ఉద్యోగ విర‌మ‌ణ చేసిన కార్మికుల‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు ఇవ్వాలి.
వారి పిల్ల‌ల‌కు ఉద్యోగాలు ఇవ్వాలి
- రిటైర్ అయిన వారికి పెన్ష‌న్, గ్రాట్యుటీ చెల్లించాలి.
- ఇంజ‌నీరింగ్ కార్మికుల‌కు జీఓ 30 ప్ర‌కారం నైపుణ్య, నైపుణ్యేత‌ర జీతం ఇవ్వాలి.
- శాశ్వ‌త ఉద్యోగుల‌కు ఆర్జిత సెల‌వు మంజూరుతో పాటు వారి పేరిట జీపీఎఫ్ ఖాతాలు తెర‌వాలి.
- వారికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.
- ఎన్ఎంఆర్-ల‌కు టైమ్ స్కేల్, క‌రువు భ‌త్యం , పాఠ‌శాల‌ల్లోని ఆయాల‌కు క‌నీస వేత‌నం చెల్లించాలి.