Begin typing your search above and press return to search.

రెడ్డిగారు.. మీ వల్లే ప్రధానమంత్రిని అయ్యా..వైఎస్ తో అన్నదెవరు?

By:  Tupaki Desk   |   3 Sep 2022 5:10 AM GMT
రెడ్డిగారు.. మీ వల్లే ప్రధానమంత్రిని అయ్యా..వైఎస్ తో అన్నదెవరు?
X
ఎవరెన్ని చెప్పినా.. ప్రజల జీవితాల్ని నేరుగా ప్రభావితం చేసే రంగం ఏదైనా ఉందంటే అది కచ్ఛితంగా రాజకీయ రంగమే. ఈ విషయంలో మరో వాదనకు తావు లేదు. రాజకీయాన్ని ఎవరెన్ని మాటలు అన్నా.. చివరకు ఆ రాజకీయమే ప్రజలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఈ రంగంలోని విశిష్ట స్థానాల్లో ఉన్న వారికి సంబంధించిన చాలా విషయాలు బయటకు రావు. అయితే.. రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు రాసిన పుస్తకాలు.. వాటిని ఆవిష్కరించే సందర్భంగా నేతలు..కీలక స్థానాల్లో ఉన్న కొందరు అప్పటివరకు బయటకు రాని కొన్ని అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు.

తాజాగా అలాంటి వివరాలే బయటకు వచ్చాయి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభకు హాజరయ్యారు.దివంగత మహానేత వైఎస్ కు ప్రాణ స్నేహితుడు.. అతడి ఆత్మగా పేర్కొనే మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాసిన జలయజ్ఞం - పోలవరం ఒక సాహసి ప్రయాణం' పుస్తకావిష్కరణ సభ జరిగింది.

దీనికి హాజరైన సంజయ్ బారు మాట్లాడుతూ కీలక విషయాల్ని వెల్లడించారు. ఆ విషయాన్ని ఆయన మాటల్లోనే చెబితే.. "నాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అనుబంధం నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కారణంగా ఏర్పడింది. మన్మోహన్ ప్రధాని అయ్యాక తొలిసారి వైఎస్ ఆయన్ను కలిసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా మన్మోహన్ మాట్లాడుతూ.. రెడ్డీ జీ.. మీ వల్లే నేను ప్రధానమంత్రిని కాగలిగాను అని అన్నారు.

ఈ మాటను ఆయన తర్వాత కూడా రెండు మూడు సందర్భాల్లో వైఎస్ తో అన్నారు. 2004లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణం వైఎస్. ఆయన కారణంగా రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు కాంగ్రెస్ కు రావటంతో..కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు కారణమైంది. 1991లో పీవీ ప్రధానమంత్రి కావటంలోనూ ఉమ్మడి ఏపీ కీలక భూమిక పోషించింది. 2004లోనూ మన్మోహన్ ప్రధాని కావటంలోనే అదే రిపీట్ అయ్యింది. హైదరాబాద్ కు అమెరికన్ కాన్సులేట్ రావటానికి రాజశేఖర్ రెడ్డినే కారణం' అంటూ ఇప్పటివరకు బయటకు రాని విషయాల్ని వెల్లడించారు.

ఇక.. వైఎస్ మీద పుస్తకం రాసిన కేవీపీ రామచంద్రరావు మరిన్ని వివరాల్ని వెల్లడించారు. ఒక దశలో ఎమోషన్ అయిన ఆయన.. ''కాంగ్రెస్ పార్టీ ఒక దశలో నన్ను నమ్మేది కాదు. పార్టీకి సంబంధం లేని పనులు కేవీపీ చేస్తున్నాడని భావించేవారు. ఇలాంటి ఫీడ్ బ్యాక్ కొందరు నేతలు అధినాయకత్వానికి ఇచ్చేవారు. రాజ్యసభలోనూ ఒక ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయినా.. నేను వెనక్కి తగ్గలేదు.

పోలవరం కోసం నాకున్న అన్ని అవకాశాల్ని ఉపయోగించుకున్నా. పార్టమెంటులో చేసిన చట్టం ఎవరి ప్రయోజనం కోసం మారుస్తున్నారో తెలీదు. పోలవరం నిర్మాణం కోసం అవసరమైనన్ని కేంద్రమే సమకూరుతుందన్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పోలవరం పూర్తి కాకపోవటం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయి' అని వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.