Begin typing your search above and press return to search.

మోడీ శిష్యుడికి కోర్టు మొట్టికాయ‌లు

By:  Tupaki Desk   |   13 Jun 2017 5:19 AM GMT
మోడీ శిష్యుడికి కోర్టు మొట్టికాయ‌లు
X
ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన చోట‌.. అత్యుత్సాహంతో నిర్ణ‌యాలు తీసుకుంటే ఇలాంటి ఎదురుదెబ్బ‌లే త‌గులుతాయి మ‌రి. వ‌రుస బాంబు పేలుళ్ల కేసులో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ కు జైలుశిక్ష ప‌డ‌టం తెలిసిందే. 1993లో ముంబ‌యిని వ‌ణికించిన బాంబు పేలుళ్ల‌లో వాడిన మందుగుండు సామాగ్రిలో భాగంగా వ‌చ్చిన ఆయుధాల్ని సంజ‌య్ క‌లిగి ఉన్నార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

దీనిపై విచారించిన కోర్టు సంజ‌య్ నేరం చేసిన‌ట్లుగా నిర్ధారించింది. ఈ కేసులో సంజ‌య్‌కు ఐదేళ్ల జైలుశిక్ష‌ను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై అప్పీలుకు వెళ్ల‌గా.. సుప్రీం సైతం 2013 మేలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును స‌మ‌ర్థించింది. దీంతో.. అప్ప‌టివ‌ర‌కూ బెయిల్ ఉన్న సంజ‌య్ లొంగిపోయారు.

ఇదిలా ఉండ‌గా.. సంజ‌య్ శిక్షా కాలం ముగియ‌టానికి ఎనిమిది నెల‌ల ముందే ఆయ‌న్ను విడుద‌ల చేయాలంటూ మోడీ శిష్యుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న మ‌హారాష్ట్ర స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇదిలా ఉండ‌గా ఎర‌వాడ జైలు నుంచి విడుద‌లైన సంజ‌య్ పై మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌వాలు చేస్తూ ఒక ప్ర‌జాహిత వాజ్యం కోర్టులో దాఖ‌లైంది.

సంజ‌య్‌ను ముందుగా విడుద‌ల చేయ‌టానికి ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న అంశాల‌ను.. అనుస‌రించిన విధానాల‌ను వివ‌రిస్తూ ఒక అఫిడ‌విట్ దాఖ‌లు చేయాలంటూ కోర్టు మ‌హారాష్ట్ర స‌ర్కారును ఆదేశించింది. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా కోర్టు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ప‌లు ప్ర‌శ్న‌ల్ని సంధించింది.

సంజ‌య్ ద‌త్ ప్ర‌వ‌ర్త‌న బాగుంద‌ని అధికారులు ఎలా నిర్థ‌రించారు? ఆయ‌న స‌గం స‌మ‌యం పెరోల్ లో జైలు బ‌య‌టే ఉండ‌గా.. ఇలాంటి నిర్దార‌ణ‌కు రావ‌టానికి అధికారుల‌కు ఎక్క‌డ స‌మ‌యం దొరికింది? ద‌త్ ప్ర‌వ‌ర్త‌న బాగుంద‌ని అధికారులు ఎలా డిసైడ్ చేశారు? జైళ్ల విభాగం డీఐజీని ఈ విష‌యంపై సంప్ర‌దించారా? జైలు సూప‌రింటెండెంట్ నేరుగా త‌న సిఫార్సును గ‌వ‌ర్న‌ర్‌ కు పంపారా? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. తాను అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించింది. శిక్ష అనుభ‌విస్తున్న సంజ‌య్ ను ముంద‌స్తుగా విడుద‌ల చేసేలా నిర్ణ‌యం తీసుకున్న మోడీ శిష్యుడు క‌మ్ మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ఇబ్బందులు ఎదుర్కొనే అవ‌కాశాలు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/