Begin typing your search above and press return to search.

ఆ పాపానికి పరిహారం మోడీ భజనే!

By:  Tupaki Desk   |   20 Dec 2017 5:03 AM GMT
ఆ పాపానికి పరిహారం మోడీ భజనే!
X
ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టె ఒకదారి అన్నట్లుగా తయారైంది పరిస్థితి. గుజరాత్ లో రెండో విడత ఎన్నికల పోలింగ్ కూడా ముగిసిన తర్వాత.. దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ భాజపాకు మార్జిన్ లో విజయం దక్కుతుందని అంచనాలు వేస్తోంటే.. అదే పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ కాకడే మాత్రం.. భిన్నమైన జోస్యం వినిపించారు. తాను కూడా తన సొంత టీం తో సర్వే చేయించానని.. గుజరాత్ లో ఖచ్చితంగా తమ పార్టీ ఓడిపోతుందని.. కాంగ్రెస్ గెలుపుబాటలో ఉన్నదని ప్రకటించి ఆయన సంచలనం సృష్టించారు. నిజానికి ఎన్నికల ఫలితాలకు ముందు ఆయన చేసిన ఈ ప్రకటన భాజపాను కాస్త ఆత్మరక్షణలోకి నెట్టింది. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత.. కాకడే జోస్యం కాకమ్మ కబుర్లే అని తేలిపోయింది. అయితే.. ఇలాంటి తప్పుడు ప్రకటనతో పార్టీ పరువు తీసినందుకు మోడీ మరియు పార్టీ ఆయన మీద ఆగ్రహిస్తారని అంతా అనుకున్నారు. చూడబోతే.. కాకడే ముందుజాగ్రత్తగా అప్పుడే చేసిన పాపానికి పరిహారంగా , నష్టనివారణకు మార్గంగా నరేంద్రమోడీ భజన ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది.

ఎన్నికల ఫలితాలకు ముందు మోడీ వ్యతిరేక మీడియా మొత్తానికి ఎంపీ సంజయ్ కాకడే ఆపద్బాంధవుడిలా మారాడు. మోడీ ఇమేజిని డ్యామేజీ చేయడానికి కంకణం కట్టుకున్న మీడియా చానెళ్లు అన్నీ కూడా కాకడే జోస్యాన్నే హైలైట్ చేశాయి. సర్వేల్లో సుదర్ఘానుభవం ఉన్న అనేక సంస్థలు భాజపాకు స్వల్ప మెజారిటీ దక్కుతుందని అంచనాలు వేస్తే.. మోడీ వ్యతిరేకత నిండుగా ఉన్న మీడియా సంస్థలు అన్నీ సంజయ్ కాకడే చెప్పిన గణాంకాలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ.. భాజపా మునిగిపోతున్న నావ అనే ప్రచారాన్ని రెండురోజుల పాటూ ముమ్మరంగా సాగించాయి. అయితే పోలింగ్ ముగిసిన తర్వాతి ప్రచారం గనుక.. ఈ ప్రభావం ఫలితాల మీద పడలేదు.

పలితాలు మాత్రం భాజపాకే అనుకూలంగా వచ్చాయి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా.. ఈ ఫలితాల్లో భాజపా విజయం తన చావుకొచ్చిందని సంజయ్ కాకడే భావించారో ఏమో గానీ.. మోడీకి ఆగ్రహం రాకుండా ముందుజాగ్రత్తగా ఆయన భజన ప్రారంభించేశారు. ప్రతికూలత ఉన్నప్పటికీ.. వరుసగా ఆరోసారి పార్టీని గెలిపించిన మోడీ హీరో, అని.. తప్పుడు అంచనాలు వేసిన తాను జీరో అని.. గుజరాత్ లో పార్టీ ప్రతికూలత ఎలా ఉన్నప్పటికీ.. దానిని అధిగమించగల మోడీ ఇమేజిని తాము అంచనా వేయలేకపోయాం అని.. అందుకే మోడీ హీరో అని ఇప్పుడు కాకడే వరుస పొగడ్తలు కురిపిస్తున్నారు. ఈ రేంజిలో మోడీని పొగిడిన తర్వాత.. సంజయ్ కాకడే భవిష్యత్తుకు అంతగా ముంచుకొచ్చిన ప్రమాదం ఇంకేమీ ఉండకపోవచ్చునని పలువురు అనుకుంటున్నారు.