Begin typing your search above and press return to search.

వాంఖడే స్థానంలో వచ్చిన సంజయ్ కుమార్ బ్యాగ్రౌండ్ పెద్దదే

By:  Tupaki Desk   |   6 Nov 2021 4:57 AM GMT
వాంఖడే స్థానంలో వచ్చిన సంజయ్ కుమార్ బ్యాగ్రౌండ్ పెద్దదే
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ ఉదంతంలో విచారణ అధికారిగా వ్యవహరించిన సమీర్ వాంఖడేను తప్పించి.. కేసుల్ని ఢిల్లీకి బదిలీ చేయటమే కాదు..ఆ విచారణ అధికారిగా సంజయ్ కుమార్ సింగ్ నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. మహారాష్ట్ర శాఖకు అధికారిగా వ్యవహరిస్తున్న సమీర్ వాంఖడే మీద పలు ఆరోపణలు రావటంతో.. ఈ కేసుల లెక్క చూసేందుకు వీలుగా కేంద్రం మరో సమర్థమైన అధికారిని నియమించినట్లుగా చెబుతున్నారు.

ఇంతకీ ఈ సంజయ్ కుమార్ సింగ్ ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆయన ట్రాక్ రికార్డు ఎలా ఉంది? అన్న ప్రశ్నలకు సమాధానాల్ని వెతికితే.. పెనం మీద నుంచి పొయ్యి మీద పడేలా కేంద్రం వ్యూహం సిద్దం చేసిందా? అన్న భావన కలిగేలా చేసిందని చెప్పాలి. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే సంజయ్ కుమార్ సింగ్ ఒడిశా పోలీసు విభాగం.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో వివిధ హోదాల్లో పని చేశారు. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారిగా ఉన్న సంజయ్.. ఆర్యన్ ఖాన్ కేసుతో సహా.. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మేనల్లుడి కేసును కూడా ఆయనే డీల్ చేయనున్నారు.

పలు అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ల గుట్లను రట్టు చేసిన సమర్థ అధికారిగా ఆయనకు పేరుంది. సంజయ్ 1996 బ్యాచ్ ఒడిశా ఐపీఎస్ క్యాడర్ అధికారిగా తన కెరీర్ షురూ చేశారు. ఎన్సీబీలో చేరటానికి ముందు సంజయ్ ఒడిశా పోలీసు డ్రగ్ టాస్క్ ఫోర్సు కి అదనపు డైరెక్టర్ జనరల్ గా నాయకత్వంవహించారు. డీటీఎఫ్ లో ఉన్న వేళలో ఒడిశా రాష్ట్రంలో డ్రగ్స్ వ్యతిరేక డ్రైవ్ లను భారీగా చేపట్టినట్లు చెబుతారు. ఇందులో భాగంగా భువనేశ్వర్ లో పలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా రాకెట్లను ఛేదించిన చరిత్ర ఆయన సొంతంగా చెబుతారు.

2008లో సీబీఐలో డిప్యూటీఇన్ స్పెక్టర్ జనరల్ గా 2015 వరకు పని చేసిన ఆయన.. ఆ సమయంలో పలు హైప్రొఫైల్ కేసుల్ని డీల్ చేసినట్లు చెబుతారు. ఆయన ట్రాక్ రికార్డును చూస్తే.. ఎలాంటి క్రమశిక్షణా చర్యలు.. క్రిమినల్ కేసులు పెండింగ్ లో లేవని చెబుతారు. ముక్కుసూటితనం.. సమర్ధమైన అధికారిగా ఆయనకు పేరుంది. ఇలాంటి క్లీన్ చిట్ ఉన్న ఉన్నతాధికారికి కేసుల్ని అప్పజెప్పటం ద్వారా.. మహా ప్రభుత్వానికి షాకిచ్చేలా కేంద్రం పావులు కదిపిందని చెబుతున్నారు. అంతేకాదు.. కేసు దర్యాప్తును ముంబయి నుంచి ఢిల్లీకి మార్చటం ద్వారా మహా ప్రభుత్వ చేతులు కట్టేసేలా చేసి.. ఈ గేమ్ లో తన అధిక్యతను కేంద్రం ప్రదర్శించిందన్న మాట వినిపిస్తోంది.