Begin typing your search above and press return to search.

సర్జికల్ స్ట్రైక్స్... మోడీ సృష్టి !! ?

By:  Tupaki Desk   |   4 Oct 2016 4:23 PM GMT
సర్జికల్ స్ట్రైక్స్... మోడీ సృష్టి !! ?
X
ఉగ్ర‌వాదుల‌ను ఉసిగొలుపుతున్న పాకిస్థాన్ పీచ‌మ‌ణిచేలా భార‌త సైన్యం జ‌రిపిన స‌ర్జిక‌ల్ దాడుల‌పై విశ్వ‌వ్యాప్తంగా హ‌ర్షాతిరేకం వ్య‌క్త‌మ‌వుతుంటే... అందుకు భిన్నమైన వాతావ‌ర‌ణం దేశంలో నెల‌కొంది. ఇది కూడా సామాన్య జ‌నంలో కాదు... రాజ‌కీయ నేత‌ల్లో మాత్ర‌మే. ఆప‌ద స‌మ‌యంలో దేశంలోని అన్ని వ‌ర్గాలు దేశానికి... అంటే అధికార పార్టీకి మ‌ద్ద‌తుగా నిల‌వాల్సిన అవ‌స‌రం ఉంది. అనుకున్న‌ట్లుగానే స‌ర్జిక‌ల్ దాడులు జ‌రిగిన వెంట‌నే అన్ని రాజ‌కీయ పార్టీలు మోదీ స‌ర్కారుకు మ‌ద్ద‌తుగా నిలిచాయి. జ‌నం ఇంకో ముంద‌గుడు వేసి మోదీ సర్కారుకు జ‌య‌జ‌య‌ధ్వానాలు ప‌లికారు. వెర‌సి మొత్తం దేశ‌వ్యాప్తంగా ఓ ర‌క‌మైన విజ‌య‌గ‌ర్వం తొణికిస‌లాడింది. అయితే... కాస్తంత ఆల‌స్యంగానైనా మోదీ స‌ర్కారు సాహ‌సోపేత‌మైన చ‌ర్య‌ను మెచ్చుకుంటూ రంగంలోకి దిగిన‌ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌ - ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఓ తేనెతుట్టెను లేపారు. ఈ తేనె తుట్టే ఎంత‌గా లేచిందంటే మొత్తం దేశాన్ని ఓ కుదుపు కుదిపేసేంత‌గా.

పాక్ గ‌డ్డ‌పై ఉన్న ఉగ్రవాద శిబిరాల‌పై సైన్యం చేత స‌ర్జిక‌ల్ దాడులు చేసిన ప్ర‌ధాని మోదీకి స‌లాం అని చెబుతూనే... కేజ్రీవాల్ శ‌త్రుదేశం త‌ర‌హాలో ఓ వింత డిమాండ్ చేశారు. అదేంటంటే... స‌ర్జిక‌ల్ దాడుల‌కు సంబంధించిన వీడియో ఫుటేజీలు బ‌య‌ట‌పెట్టాల‌న‌డ‌మే. ఇప్ప‌టికే త‌మ భూభాగంపై భార‌త్ స‌ర్జిక‌ల్ దాడులు జ‌ర‌గ‌లేద‌ని వాదిస్తున్న పాక్‌... దాడులే జ‌రిగి ఉంటే ఆధారాలు బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేసింది. పాక్ వాద‌న‌లాగే కేజ్రీ కూడా దాడుల‌కు సంబంధించిన ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని కోరారు. కేజ్రీ ఈ డిమాండ్ వినిపించిన మ‌రునాడు కాంగ్రెస్ నేత‌లు కూడా రంగంలోకి దిగిపోయారు. యూపీఏ స‌ర్కారులో కీల‌క మంత్రిగా ప‌నిచేసినఆ పార్టీ సీనియ‌ర్ నేత‌ పి.చిదంబ‌రం స్వ‌యంగా మీడియా ముందుకు వ‌చ్చి కేజ్రీ వాద‌న‌ను వినిపించారు. పాక్ భూభాగంపై భార‌త సైన్యం చేసిన‌ స‌ర్జిక‌ల్ దాడులను స‌మ‌ర్ధిస్తున్నామ‌ని చెప్పిన చిదంబ‌రం... స‌ద‌రు దాడుల‌కు సంబంధించిన ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేశారు. యూపీఏ హ‌యాంలోనూ ఇదే త‌ర‌హాలో సైన్యం దాడులు చేసింద‌ని, అయితే నాడు తాము ఆ దాడుల‌ను బ‌య‌ట‌కు చెప్పుకోలేద‌ని చిదంబ‌రం చెప్పుకొచ్చారు. అయినా పాక్‌పై దాడులు చేసిన విష‌యంపై ఇంత పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని కూడా విస్మ‌యం వ్య‌క్తం చేశారు.

ఇక అదే పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత సంజ‌య్ నిరుప‌మ్ మ‌రో అడుగు ముందుకేసీ... భార‌త సైన్యం పాక్ భూభాగంపై అస‌లు స‌ర్జిక‌ల్ దాడులు చేయ‌నేలేద‌ని తేల్చేశారు. ఉగ్ర మూక‌ల‌పై మెరుపు దాడులు చేయాల‌ని తాము కూడా కోరుకుంటున్నామ‌ని చెప్పిన నిరుప‌మ్‌... న‌కిలీ దాడులతో ప్ర‌చారాన్ని తాము స్వాగ‌తించ‌బోమ‌ని కాస్తంత ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. తొలుత కేజ్రీవాల్‌, త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ నేత‌లు చేస్తున్న ఈ వితండ వాద‌న‌ను విన్న జ‌నం నోట మాట రావ‌డం లేదు. ఓ వైపు స‌ర్జిక‌ల్ దాడులు చేసిన మోదీ స‌ర్కారు చ‌ర్య‌ను అగ్ర‌రాజ్యం అమెరికా స‌హా దాదాపుగా అన్ని దేశాలు మెచ్చుకుంటూ ఉంటే... దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పాలించిన కాంగ్రెస్ లాంటి పార్టీలు దాడుల‌ను వివాదాస్ప‌దం చేయ‌డ‌మేంట‌నే వాద‌న వినిపిస్తోంది. ఓ వైపు దేశంపై ఉగ్ర‌మూక‌లు విరుచుకుప‌డుతున్న ఘ‌ట‌న‌లు ఇటీవ‌ల మ‌రింత‌గా పెరిగాయి. మొన్న‌టి ఉరీ ఉగ్ర ఘ‌ట‌న‌లో ఏకంగా 20 మంది సైనికుల‌ను ఉగ్రవాదులు పొట్ట‌న‌బెట్టుకున్నారు. విధులు ముగించుకుని ఆద‌మ‌ర‌చి నిద్రిస్తున్న సైనికుల‌పై దొంగ దెబ్బ తీసిన సైనికుల చ‌ర్య‌లో అక్క‌డికక్క‌డే 18 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా... తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రిలో రోజుల త‌ర‌బ‌డి చికిత్స అందించినా మ‌రో ఇద్ద‌రు సైనికులు చ‌నిపోయారు.

ఈ ఘ‌ట‌న యావ‌త్తు దేశాన్ని ఆగ్ర‌హావేశాల‌కు గురి చేసింది. ఈ క్ర‌మంలోనే మోదీ దాడుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. అయినా... ఉగ్ర‌వాదుల దుర్మార్గాన్ని క‌నీసం ఖండించ‌డానికి కూడా పాక్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీప్ కు నోరు రాలేదు. అలాంటి దేశం పెంచి పోషిస్తున్న ఉగ్ర‌వాదం పీచ‌మ‌ణ‌చ‌కపోతే... త‌ప్పే అవుతుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మైంది. మోదీ కూడా ఇదే భావ‌న‌తోనే దాడుల‌కు పచ్చ‌జెండా ఊపి ఉంటారు. మ‌రి ఇలాంటి సాహ‌సోపేత‌మైన చ‌ర్య‌ను స‌మ‌ర్ధించాల్సిన కాంగ్రెస్ పార్టీ... దాడులు చేసి ఉంటే ఆధారాలు బ‌ట‌య‌పెట్టండంటూ శ‌త్రు దేశం వాద‌న‌ను అందిపుచ్చుకోవడం ఏ మేర‌కు స‌బ‌బో ఆ పార్టీ నేత‌ల‌కే తెలియాలి. ఏదేమైనా... దేశాన్ని అన్ని పార్టీల కంటే అత్య‌ధిక కాలం పాలించిన కాంగ్రెస్ లాంటి పార్టీ నుంచి ఈ త‌ర‌హా వాద‌న బ‌య‌ట‌కు రావడాన్ని సామాన్య భార‌తీయుడు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/